- హైదరాబాద్ మెడికల్ హబ్ కావడం సంతోషకరం
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై
- ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అభినందనలు
ప్రజాతంత్ర, హైదరబాద్, జనవరి 26 : తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని తెలంగాణను ముందు వరుసలో నిలిపిన రైతులకు గవర్నర్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని గవర్నర్ అభిప్రాయ పడ్డారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ తమిళి సై ప్రసంగింస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే మనం ముందున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.
కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుంచి రాజ్‌భవన్‌కు మార్చారు. రాజ్‌భవన్‌లో జాతీయ పతాక ఆవిష్కరణకు ముందు వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు. జెండాను ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, కోవిడ్ టీకా పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతుందని, త్వరలోనే దేశ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టీకా డోసులు పూర్తి చేసుకోబోతున్నామని, హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరమని, రాష్ట్రంలో ఇప్పటికే 8 మెడికల్ కాలేజీలను కేంద్రం కేటాయించిందని గవర్నర్ తమిళిసై అన్నారు.