Take a fresh look at your lifestyle.

‌డ్రగ్స్ ‌రహిత రాష్ట్రంగా తెలంగాణ

  • మంచి పని తీరు కనబరిచిన అధికారులకు అవార్డులు, రివార్డులు
  • డ్రగ్‌ ‌రాకెట్‌ను పట్టుకున్న ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులకు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సన్మానం

వొచ్చే 30 రోజుల్లో రాష్ట్రంలో మత్తు పదార్థాలను సరఫరా నిర్ములనే లక్ష్యంగా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ‌శాఖలో మంచి పనితీరును కనబరిచిన అధికారులను గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామన్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారి వివరాలు, సమాచారాన్ని అందించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌ ‌లోని తన క్యాంప్‌ ‌కార్యాలయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో 2  కోట్ల రూపాయలపై విలువైన సుమారు 5 కిలోల మెపిడ్రిన్‌ ‌డ్రగ్‌ను పట్టుకొని సీజ్‌ ‌చేసిన రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ‌శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి  మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, రవాణా చేస్తున్న, అమ్మకాలు చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్‌ ‌డేవిడ్‌ ‌రవికాంత్‌, ‌సహాయ కమిషనర్‌ ‌చంద్రయ్య సూచనలతో మేడ్చెల్‌ – ‌మల్కాజిగిరి జిల్లాలో ఎక్సైజ్‌ ‌శాఖ సూపరింటెండెంట్‌ ‌విజయ్‌ ‌భాస్కర్‌  ‌నేతృత్వంలోని గట్టి నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారంతో సిబ్బంది పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 5 కిలోల మెపిడ్రిన్‌ ‌డ్రగ్‌ను పట్టుకొని సీజ్‌ ‌చేసినందుకు అబ్కారీ శాఖ అధికారులను ఘనంగా సన్మానిస్తున్నామన్నారు.

ఆంధ్ర-ఛత్తీస్‌ ‌ఘడ్‌, ఒరిస్సాల నుండి గంజాయి, మొదలైన మత్తు పదార్థాలను తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాల మేరకు అబ్కారీ శాఖ అధికారులు గట్టి నిఘాను, పకడ్బందీగా ప్రత్యేక టాస్క్ ‌ఫోర్స్‌ను ఏర్పాటు  చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ ‌డేవిడ్‌ ‌రవికాంత్‌, ‌రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్‌ ‌చంద్రయ్య, మేడ్చెల్‌ ఇఎస్‌ ‌విజయ్‌ ‌భాస్కర్‌, ‌సిఐ సహదేవ్‌ ‌వారి సిబ్బందిని మంత్రి అభినందించారు.

Leave a Reply