- రక్షణ పరికరాల కొరతను రానివ్వం మంత్రి ఈటల
రాష్ట్రానికి 95 శాతం కొరోనా భయం తగ్గినట్లేననీ, రాబోయే రోజులలో కేసులు భారీగా నమోదు కాక పోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నమోదైన కొరోనా పాజిటివ్ కేసులకు గాంధీ ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారనీ, వీరిలో ఎవరి పరిస్థితి కూడా విషమంగా లేదని తెలిపారు. బుధవారం కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా కొరోనా పాజిటివ్ •కేసుల సంఖ్య 453కు చేరుకుందని వెల్లడించారు. వైద్య పరీక్షలలో నెగటివ్ వచ్చిన వారిని సొంత జిల్లాల్లోనే క్వారంటైన్లో ఉంచుతామని తెలిపారు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో సైతం పీపీఈ కిట్లు, ఎన్95 వంటి మాస్కులు దొరకడం లేదనీ, ఆ పరిస్థితిని తెలంగాణలో రానివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 వేల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయనీ, మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అలాగే, లక్షకు పైగా ఎన్95 మాస్కులుఅందుబాటులో ఉండగా, మరో 5 లక్షల మాస్కులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటికి తోడు మరో 3.5 లక్షల కొరోనా టెస్ట్ కిట్లకు ఆర్డర్ ఇచ్చామని వివరించారు. గచ్చిబౌలిలో వచ్చే 15 రోజుల్లో కొరోనా ప్రత్యేక ఆసుపత్రి సిద్దమవుతుందనీ, అక్కడ 1500 పడకలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలోని 22 ప్రైవేటు మెడికల్ కళాశాలలను సైతం కొరోనా చికిత్సలు, క్వారంటైన్ కోసం వినియోగించుకుంటామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ వెల్లడించారు.