- సర్కార్ ఆదేశాలతో మళ్లీ స్కూళ్లలో రిపోర్టు చేయనున్న టీచర్స్
- విద్యార్థుల సందేహాలను ఇంటికి వెళ్లి నివృత్తి చేయాల్సి ఉంటుంది
ఇంతకాలం ఇంటికే పరిమితం అయిన టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. సర్కార్ ఆదేశాలతో 27న గురువారం నుంచి మళ్లీ స్కూళ్లలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 27 నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరుకావాలని, సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతాయని మార్గదర్శకాలు వెలువరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు తరగతుల వారీగా ఎంత సమయం ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనే విషయంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీచర్లు స్కూళ్లకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడంతోపాటు ఆన్లైన్ తరగతులు విద్యార్థులందరికీ చేరే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా విద్యాధికారులు సక్షించారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, పర్యవేక్షాణాధికారులు ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సెలక్ట్ కమిటీకి అందజేస్తారని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సూచించిన విధంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. 90 శాతానికి పైగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశామని, యూనిఫాం కూడా రెడీ అవుతున్నదని, ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే విద్యార్థులకు అందజేస్తామని వివరించారు. విద్యార్థులకు ఏదైనా సందేహం కలిగితే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంటికి వెళ్లి నివృత్తి చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కొంతమంది విద్యార్థులను కలవడం ద్వారా ఉపాధ్యాయులు వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. నేర్చుకున్న డిజిటల్ పాఠాలను విద్యార్థులు ప్రాక్టీస్ చేసే విధంగా వర్క్షీట్లను సోమవారం ఎస్ఈఆర్టీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ ద్వారా 2 నుంచి 10 తరగతుల ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యా యులు, విద్యార్థులు ఈ వర్క్షీట్లనుడౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1, 6 తరగతుల్లో ప్రవేశాలు కల్పించాలని సూచించారు. కొరోనా కారణంగా మార్చి15న మూతపడిన పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో సెప్టెం బర్ ఒకటో తేదీ నుంచి తెరుచు కోనున్నాయి. విద్యార్థులు అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరు కానున్నారు. డిజిటల్ బోధనకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి వాటిని రాష్ట్ర స్థాయిలో అమలుపర్చనున్నారు. ఆన్లైన్లో పాఠాలు బోధించేలా షెడ్యూల్‌ను రూపకల్పన చేశారు. నర్సరీ, ప్లేస్కూల్, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు వారంలో మూడు రోజులకు మించకుండా రోజుకు 45 నిమిషాలు మాత్రమే తరగతులు నిర్వహించాలి. ఆన్లైన్ క్లాసుల సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు లేదా పర్యవేక్షకులు ఉండాలి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గంటన్నర సమయాన్ని రోజుకు రెండు సెషన్ల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు నిర్వహించాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రోజుకు మూడు సెషన్లలో రెండు గంటల పాటు వారంలో ఐదు రోజులు తరగతులు జరగాలి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రోజుకు నాలుగు సెషన్ల చొప్పున మూడు గంటల సమయాన్ని వారంలో ఐదు రోజుల మాత్రమే నిర్వహించాలి. ఆన్లైన్ బోధనా పద్ధతిని పర్యవేక్షించేందుకు విధులను విభజించారు. ఉపాధ్యాయుడు, హెచ్ఎం, ఎంఈఓ, డీఈఓలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సూచనలు చేశారు. హెచ్ఎం విధుల్లో ప్రధానంగా ప్రతి విద్యార్థీ ఆన్లైన్ పాఠాలు వినేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. దీనిని మూడు అంశాలుగా పేర్కొన్నారు.
మొదటిది విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్ ద్వారా అవకాశం ఉండటం, రెండోది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, నెట్ సౌకర్యం కలిగి ఉండడం. మూడోది విద్యార్థులకు టీ శాట్, దూరదర్శన్, స్మార్ట్‌ఫోన్స్ వంటి ఏ సదుపాయమూ లేకుండా ఉండడం. మూడో అంశంలో ఆన్లైన్ తరగతులకు ఏ అవకాశమూ లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీ లేదా పాఠశాలలోని టీవీల ద్వారా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతుల వీక్షణకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు డిజిటల్ విద్యకు సంబంధించిన పాఠాలను సిద్ధం చేసుకోవాలి. టీచర్లు టీ శాట్, దూరదర్శన్‌లో వచ్చే పాఠాల షెడ్యూల్‌ను విద్యార్థులకు వివరించాలి. అందుబాటులో ఉన్న వాట్సాప్, మొబైల్ ఫోన్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలి. ఆన్లైన్ పాఠాలకు అనుగుణంగా •ంవర్కులు ఇవ్వాలి. 1 నుంచి 10 తరగతుల వరకు తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయాలి. విద్యార్థులు వర్క్షీట్లు పూర్తిచేసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోనున్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను ప్రభుత్వంపై తరగతులకు ప్రమోట్ చేసింది. అంగన్వాడీల్లోని విద్యార్థులకు 1వ తరగతికి, ప్రాథమిక పాఠశాలల్లోని 5వ తరగతి విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలోకి, ఇతర పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రవేశాల పక్రియ నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. బడిబయట పిల్లలను కూడా గుర్తించి అడ్మిషన్లు ఇవ్వాలని, చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో వివరాలు పొందుపర్చాలని సూచించారు.