
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇక నుండి ఒక్కటే ఫెడరేషన్‌గా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మూడు సంఘాల విలీనానికి ముహూర్తం ఈ నెల 19 నిర్ణయించబోతున్నారు. మూడు ఉపాధ్యాయ ఫెడరేషన్లు టిపిటిఎఫ్, టిటిఎఫ్, టిడిటిఎఫ్లు తమ విలీన ప్రకటనను సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈ ఆదివారం ప్రకటించనున్నాయి. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం, ఈ నెల 19న ఈ మూడు ఉపాధ్యాయ సంఘాల (టిపిటీఎఫ్, టీడీటిఎఫ్, టిటిఎఫ్) రాష్ట్ర స్థాయి ఐక్యతా సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని, మూడు సంఘాల విలీనాన్ని ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు నిలయంగా, ఆదర్శంగా, నిర్భయంగా, నిస్వార్థంతో పని చేసిన మూడు ఉపాధ్యాయ సంఘాలు ఇక ఏకం కాబోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ, ఏ ఉపాధ్యాయ సమస్య ఉన్నా, సామాజిక సమస్య ఉన్నా తమ సమస్యగా ముందుకు వచ్చి పోరాడిన ఈమూడు సంఘాల విలీనాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం స్వాగతిస్తోంది, అభినందిస్తోంది. ఈమూడు సంఘాల త్యాగ ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు అనేక అంశాలు తెరపైకి రావడం జరిగింది. కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమి కేటాయింపుకు వ్యతిరేకంగా, ప్రతి సామాన్య కుటుంబ బిడ్డకు ప్రభుత్వం ద్వారానే విద్య అందించాలనే లక్ష్యంగా అనేక పోరాటాలకు ఈ ఉపాధ్యాయ సంఘాలు నాంది పలికాయి.
పరిస్థితుల కారణంగా నాడు విడిపోయిన ఉపాధ్యాయ సంఘం మూడు ముక్కలైనప్పటికినీ… తమ శక్తిని కోల్పోలేదు. తమ ఉనికిని చాటుకుంటూ, తమ పోరాట ప్రటిమను మరువలేదు, వారు సిద్ధాంతాలను విడువలేదు, అదే స్థాయిలో, అదే తీరుగా, సిద్ధాంతాలకు అనుగుణంగా, ప్రజా సమస్యలే లక్ష్యంగా ఈ మూడు ఉపాధ్యాయ సంఘాలు పని చేస్తూ వచ్చాయి. ఏ సందర్భమో..ఎవరి ఆలోచనా విధానమో గాని నేడు మళ్ళీ ఈ మూడు సంఘాలు ఏకమవడానికి దారి తీశాయి. ఆ దారి వీరిని ఏకం చేసి ప్రజలకు ఉపయోగపడే దారిగా మున్ముందు ఇంకా ఎన్నెన్నో మంచి పోరాట ఫలితాలను సాధించే దిశగా, రాష్ట్రంలో విద్యనే కాదు అనేక సామాజిక వర్గాలకు ఉపయోగ పడేలా ఉండాలని మనమంతా ఆశిద్దాం.
సమాజాన్ని అత్యంత ప్రభావవంతంగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకు పోవడానికి విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఏ విధమైన విద్యను, ఎలా బోధించాలన్నా, దాన్ని రాజ్యమే నిర్ధారించినా, ఉపాధ్యాయులు రాజ్యం స్వభావాన్ని ప్రజలకు వివరించి దాన్ని సరైన మార్గంలో తీసుకు పోవడానికి చోధక శక్తులుగా పనిజేస్తుంటారు. భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1948లో నైజాం సర్కార్ అనంతరమే ప్రజలందరికీ ఏ వివక్షత లేకుండా మాతృభాషలో విద్యను అభ్యసించే అవకాశం లభించింది. అప్పటి దాకా ఉన్న పాఠశాలల్లో పనిజేస్తున్న ఉపాధ్యాయులకు నామమాత్రంగా ప్రభుత్వం ద్వారానే నిర్వహింపబడే ఒక ఉపాధ్యాయ సంఘం ఉండేది. 1952లో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు జరిగిన అసౌకర్యానికి నిరసనగా, తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం వలన చైతన్యం పొందిన కొందరు ఉపాధ్యాయులు ఆనాడు గొంతెత్తి ప్రశ్నించారు.
అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఉపాధ్యాయుల హక్కుల కోసం తెలంగాణలో ఏర్పడిన మొదటి ఉపాధ్యాయ సంఘం. అదే ఎస్టియూ. అయితే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అప్పటికే ఎలమెంటరీ ఎడ్యూకేషన్ యూనియన్ ఏర్పడి అదే సంఘం పెట్టుకొనే హక్కును సైతం సాధించుకొని మద్రాస్ నుండి ఆంధ్ర వేరైనప్పటికినీ, తర్వాత ఆంధ్రప్రదేష్ టీచర్స్ ఫెడరేషన్ గా ఆవిర్భవించి ఆంధ్ర ప్రాంతంలో క్రియాశీలక పోరాటాలకు ముందు వరుసలో నిలిచి తనకంటూ నలుగురు ఎమ్మెల్సీలను కలిగియుండే స్థాయికి ఎదిగింది ఆ సంఘం. 1952 తర్వాత నుండి ప్రజలవైపు నుండి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వాలకు మరిన్ని పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేయక తప్పలేదు.1959 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న పాఠశాలల్లో నియమించ బడుతున్న ఉపాధ్యాయులు, పాతవారితో కలిసి సంఘటిత పడి ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రమాదం ఉందని పసిగట్టిన ఆనాటి పాలక వర్గాలు అంత వరదాకా జిల్లా బోర్డుల ద్వారా నిర్వహించ బడుతున్న ఉపాధ్యాయ నియామకాలను స్టానిక సంస్థలకు అప్పగించారు. ఉపాధ్యాయులను ఐక్యం కాకుండా రాజ్యం జాగ్రత్త పడింది. పాత వారికి ప్రభుత్వ ఉద్యోగుల వలె అన్నీ సౌకర్యాలు ఉండగా స్టానిక సంస్తల ద్వారా నియమించబడినవారిని మాత్రం, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించలేదు. ప్రస్తుతం మాడల్ స్కూళ్ళలో , కులాల వారీగా ఉన్న ఆవాస విద్యాలయాల్లో బోధిస్తున్న వారికి ఎలాగైతే సర్వీస్ రూల్స్ లేకుండా ఉందో అప్పుడు కూడా స్టానిక సంస్థలల్లో పనిజేస్తున్న ఉపాధ్యాయులకు కూడా సర్వీస్ రూల్స్ లేవు. పెన్షన్ సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వలె మాకు కూడా సెలవులు, ప్రమోషన్లు, సర్వీస్ రూల్స్, పెన్షన్ సౌకర్యం ఉండాలి అనే డిమాండ్ పైన పోరాడగా 1961లో జిపిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు పోరాట ఫలితంగా వచ్చాయి. 1970లో పిఆర్టియూ సంఘం తెలంగాణలో వచ్చింది. ఆంధ్రాలో ఉన్న ఏపిటిఎఫ్, తెలంగాణలోని ఎస్టియూ, పిఆర్టియూ పోరాడిన ఫలితంగా 1982లో ఉపాధ్యాయులందరికీ రీ-గ్రూపింగ్ స్కేల్స్, 1983లో పిఆర్ ఉపాధ్యాయులకు ప్రావెన్సులైజేషన్ సర్వీస్ రూల్స్ వచ్చాయి.
అలా సమిస్టీ పోరాటాల ద్వారా సాధించుకున్న కొన్ని ప్రయోజనాలతో ఆ ప్రయోజకత్వమంతా మాదంటే… మాదే… అన్న ప్రచారంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలకు కొమ్ముగాసే సంఘాలుగా కొట్టుక పోయాయి. కేవలం జీత-భత్యాల పెంపుకోసమే గాకుండా విద్యారంగ ఉన్నతికి అలాగే ప్రజలను నిత్యం వేధిస్తున్న దైనందిన సమస్యలపైన సైతం బుద్ధి జీవులుగా ఉపాధ్యాయులమైన మనం స్పందించాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ లోని కొందరు చైతన్యవంతులైన ఉపాధ్యాయులు తాము పనిజేస్తున్న ఉపాధ్యాయ సంఘంలో డిమాండ్ చేయగా, మనం ఉపాధ్యాయులం, మన సమస్యల కోసం మనం పనిజేయాలి గానీ, ప్రజల సమస్యలతో మనకేమి పని అని, ప్రభుత్వాలకు వంతబాడే సంఘనాయకులు ఒప్పుకోలేదు. ఫలితంగా అప్పటిదాకా ఆంధ్ర ప్రాంతంకే పరిమితమై ఉండి, నాయకత్వ పీకులాట పీటముడిలో యూటిఎఫ్ అనే ముక్క ఒకటి విడగొట్టుకొని పోయి ఉన్న ఏపిటిఎఫ్ను తెలంగాణకు తీసుకొని వచ్చి ఆసంఘం బలోపేతం గావడానికి తెలంగాణ క్యాడర్ అద్భుతమైన కృషి చేసిందని చెప్పవచ్చు. 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, 1967 నుండి 1970 దాకా సాగిన శ్రీకాకుళ ఉద్యమాన్ని, 1973 నుండి తెలంగాణ పల్లెల్లో ఉప్పెనై లేసిన ప్రజా పోరాటాలను, 1976లో వచ్చిన ఎమర్జెన్సీని అణిచివేయడంలో రాటుదేలిన రాజ్యం ఏ ఉద్యమాలనయినా అణిచివేయడమే ఏకైక సాధనంగా ఎంచుకొన్నది. ఉపాధ్యాయ సంఘాలు ఎఫ్ఏపిటిఓ , జేఏసిటిఓల పేరుతో కూటములుగా ఏర్పడి ఐక్య పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. 1996 నుండి తెలంగాణలో మొదలైన మలి దశ ప్రత్యేక తెలంగాణ పోరు తీవ్రతను, ప్రజాభిప్రాయాన్ని ఏపిటిఎఫ్ నాయకత్వం పట్టించుకోలేదని తెలంగాణ ప్రాంత నాయకత్వం డిటిఎఫ్ పేరుతో ఏపిటిఎఫ్ నుండి వేరయ్యింది. ఆ తర్వాత 1998లో సాధించుకున్న 505 మరియు 538 ఉమ్మడి సర్వీస్ రూల్స్, 1998లో సాధించుకున్న డిఎస్సి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్లలో కౌన్సిలింగ్ విధానం, 2002లో హెచ్ఎం, ఎంఈఓలకు అధికార వికేంద్రీకరణ, జిఓఎంఎస్ నెంబర్ 40, సబ్జెక్ట్ వారి స్కూల్ అసిస్టెంట్స్, 2009లో అప్రెంటిస్ విధానం రద్దు, 2012లో అప్రెంటిస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెట్లు లాంటి అనేక సమస్యలను సమిస్టీ ఉద్యమాల ద్వారానే సాధించుకున్నారు.
ప్రస్తుతం సిద్ధాంతాల వైరుధ్యాల పేరుతో, కులాల పేరుతో ఉపాధ్యాయ సంఘాలు చీలికలు – పేలికలుగా విడిపోయి వెన్నెముక లేని బలహీనమైన సంఘాలుగా మిగిలిపోయినాయి. మరో వైపు రాజ్యం తన ప్రజలనే మతాల పేరుతో, కులాల పేరుతో, వర్గాల పేరుతో ముక్కలుముక్కలుగా విడగొడుతున్న పరిస్థితి. ప్రధానంగా యువకులు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య నుండి, ప్రజలకు నిత్య పోరాటమైన విద్య, వైద్యం, త్రాగునీటి సమస్య, వాతావరణ కాలుష్యం, వనరుల విధ్వంసం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల లాంటి అనేక ముఖ్యమైన సమస్యల వైపు ఆలోచించకుండా ఉపరితల అంశాలైన భావజాల రంగాల భావావేశాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పనిలో ఉందని చెప్పక తప్పదు. మనిషిని మనిషి ధ్వేషించుకోవడం, వనరులన్నీ గంపగుత్తగా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడం, ఆ బడా బాబులు హద్దు-పద్దు లేకుండా వనరులను ధ్వంసం చేస్తుండగా, అలివిగాని కాలుష్యం, ఓపలేని అనారోగ్యాల వలన భావితరపు బాలబాలికల భవిష్యత్తు భయాందోళనలకు గురి కాబోతున్న ప్రస్తుత తరణంలో ఈ సమాజం నుండి ఎంతో నేర్చుకొని, ఎన్నో అవకాశాలు, సౌకర్యాలు, అంతో ఇంతో జ్ఞానం పొందిన, బుద్ధిజీవులైన ఉపాధ్యాయులపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఇంకా తుచ్ఛమైన ఇగోలకు, పట్టింపులకు, స్వార్థ పూరిత అహంభావాలకు పోకుండా సమాజానికి ఒక ఆశావాహ దృక్పథం అందించే కొరకు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఒక్కతాటి పైకి వచ్చి సామాన్య జనానికి ఒక మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉంది.
Tags: teachers federation, school assistance, telangana progressive, federation