గురువంటే…
విశ్వ జనీన ప్రభాతం
విశారద వర ప్రసాదం
విజ్ఞాన నదీ ప్రవాహం.
వికాస గంధ ప్రసూనం
ఆచార్యుడంటే …
అమ్మలా లాలించి
అక్షరామృతం పంచేవాడు
నాన్నలా చేరదీసి
విలువల బోధన చేసేవాడు
ఆత్మ బంధువులా నిలిచి …
బుద్దిని ఒద్దికగా సరిదిద్దేవాడు
మదిని మన్నికగా మలిచేవాడు
అధ్యాపకుడంటే
అక్షరాల తోట
ఆదర్శాల బాట.
అంతర్లీన ప్రజ్ఞను వెలికితీసి
మూర్తిమత్వం ప్రసాదించేవాడు
అజ్ఞాన తిమిరం తరిమేసి..
విజ్ఞాన ప్రమిద వెలిగించేవాడు
శిలలాంటి మనస్సులను
సుందర శిల్పంగా ప్రతిష్టించేవాడు
తరగతి గదిలో…
దేశ భవిష్యత్ రూపులద్దేవాడు
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ద
యావత్ జీవితం దారబోసేవాడు
అందుకే …!
అపర బ్రహ్మ… గురువును
గుండెల్లో పెట్టుకు పూజిద్దాం
సాష్టాంగ ప్రణామాలు సమర్పిద్దాం
(సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం సందర్భంగా…)
– కోడిగూటి తిరుపతి: 9573929493