రెండో రోజు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకువచ్చింది ప్రతిపక్ష టీడీపీ. అయితే అది సకాలంలో నిబంధనల ప్రకారం చేయలేదు. మరోవైపు అధికార వైసీపీ బిల్లులపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. నిర్ణయం తీసుకోవాల్సింది మండలి ఛైర్మన్. ఓ వైపు నిబంధనలకు వ్యతిరేకంగా సెలక్ట్ కమిటికి పంపించాలన్న డిమాండ్, మరోవైపు ప్రభుత్వ విజ్ఞప్తి..సహజంగానే ఛైర్మన్ నిర్ణయంపై అందిరిలో ఉత్కంఠత నెలకొంది. చంద్రబాబు, విజయసాయి రెడ్డి వంటి ఇరుపక్షాల ఉద్దండులు వీఐపీ గ్యాలరీల్లో కూర్చుని మండలి కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సంక్లిష్ట స్థితిలో…టీడీపీ కోరినట్లు సెలక్ట్ కమిటికి పంపించటం నిబంధనలకు విరుద్ధం అనే విషయాన్ని స్వయంగా అంగీకరిస్తూనే ఛైర్మన్‌గా నిబంధన 154 ప్రకారం తనకుండే విచక్షణాధికారాన్ని ఉపయోగించి బిల్లులను సెలక్ట్ కమిటికి పంపిస్తూ రూలింగ్ ఇచ్చారు.
ఎండాకాలం రావటానికి ఇంకా కాస్త సమయం ఉంది. కాని తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే రాజకీయ ఉక్కపోత ప్రారంభం అయిపోయింది. తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల సెగ రాజుకోవటం, ఓట్ల రూపంలో ఈవియమ్ మెషీన్‌లలో స్థిరపడటం జరిగింది. పురపాలికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారో రేపు తేలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం మరింత ఘాటు రేపుతోంది. చట్టసభల వేదికగా రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు కళ్లకు కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు అసెంబ్లీలో తేలిగ్గానే గట్టెక్కేశాయి. 175 మంది సభ్యుల శాసనసభలో వైసీపీకి ఏకంగా 151 సభ్యుల బలం ఉండటంతో అక్కడ ఏ బిల్లును అయినా పాస్ చేయించుకోవటం వైఎస్ జగన్ ప్రభుత్వానికి నల్లేరు మీద నడకే. కాని మండలిలో పరిస్థితి దీనికి భిన్నం. 58 మంది సభ్యులు ఉండే మండలిలో మూడు పదులు దాటిన సంఖ్య ప్రతిపక్ష టీడీపీది. అంటే సగాని కంటే ఎక్కువ మంది ఆ పార్టీ సభ్యులే. బలం ఉన్నచోట టీడీపీ ఎందుకు తగ్గుతుంది. అసెంబ్లీలో పడే భంగపాటును మండలిలో తీర్చుకుంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా బహుశా ఇలాగే చేస్తుందేమో. లేదంటే చంద్రబాబు మార్క్ రాజకీయ వ్యూహాలు కాబట్టి కాస్త ఓ మోతాదు ఎక్కువగానే ఉంటాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ రెండు బిల్లుల విషయంలో శాసన మండలిలో అదే జరిగింది.
ముందు నుయ్యి-వెనుక గొయ్యి
శాసనమండలి ఛైర్మన్ పరిస్థితి అచ్చంగా ముందు నుయ్యి-వెనుక గొయ్యిలా మారింది. గౌరవనీయ ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ వృత్తిగత జీవితం టీడీపీతోనే ప్రారంభం అయ్యింది. నాలుగు దశాబ్దాలకు పైగా అదే పార్టీతో ఆయన ప్రయాణం కొనసాగింది. దానికి ప్రతిఫలంగా మండలి ఛైర్మన్ పదవి ఆయనను వరించింది. రాజ్యాంగ పదవుల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలతో అనుబంధాలు, వ్యక్తిగత లాభాపేక్షలను వదులుకోవాలన్నది ఆదర్శమే కాని వాస్తవంగా ఎవరూ పాటించరన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. సాధారణ సమయాల్లో ఏం జరిగినా కీలక సందర్భాల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలుంటే ఆ పదవి ప్రతిష్ట తగ్గుతుందనేది వాస్తవం. ఏపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదం పొందిన సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అడ్డుకునే వ్యూహాన్ని టీడీపీ అమలులో పెట్టింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేందుకు పెట్టే రూల్ 71 ను తెర మీదకు తీసుకువచ్చింది. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టకుండా ఈ రూల్ 71 పై వెంటనే చర్చకు పట్టుబట్టింది. ఛైర్మన్ అనుమతితో ఏడు రోజుల వ్యవధిలో చర్చ చేపట్టవచ్చు. మరో వైపు అధికార పక్షం అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం పట్టుబడుతూ ఉంది. నిబంధనల ప్రకారం చట్టసభల బిజినెస్‌లో ప్రభుత్వ బిల్లులకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. అయినా సాయంత్రం వరకు ఎత్తులు, పై ఎత్తులు కొనసాగిన తర్వాత రూల్ 71 పై చర్చ, ఓటింగ్ ముగిశాయి. రెండో రోజు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకువచ్చింది ప్రతిపక్ష టీడీపీ. అయితే అది సకాలంలో నిబంధనల ప్రకారం చేయలేదు. మరోవైపు అధికార వైసీపీ బిల్లులపై చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. నిర్ణయం తీసుకోవాల్సింది మండలి ఛైర్మన్. ఓ వైపు నిబంధనలకు వ్యతిరేకంగా సెలక్ట్ కమిటికి పంపించాలన్న డిమాండ్, మరోవైపు ప్రభుత్వ విజ్ఞప్తి..సహజంగానే ఛైర్మన్ నిర్ణయంపై అందిరిలో ఉత్కంఠత నెలకొంది. చంద్రబాబు, విజయసాయి రెడ్డి వంటి ఇరుపక్షాల ఉద్దండులు వీఐపీ గ్యాలరీల్లో కూర్చుని మండలి కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సంక్లిష్ట స్థితిలో…టీడీపీ కోరినట్లు సెలక్ట్ కమిటికి పంపించటం నిబంధనలకు విరుద్ధం అనే విషయాన్ని స్వయంగా అంగీకరిస్తూనే ఛైర్మన్‌గా నిబంధన 154 ప్రకారం తనకుండే విచక్షణాధికారాన్ని ఉపయోగించి బిల్లులను సెలక్ట్ కమిటికి పంపిస్తూ రూలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఛైర్మన్ రాజ్యాంగం ప్రకారం తనకు లభించిన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శకు ఈ నిర్ణయం అవకాశం కల్పించింది.
మండలి రద్దు?
మండలిలో ముఖ్యమైన బిల్లులను టీడీపీ అడ్డుకుంటోంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీని వల్ల విధానపరమైన నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నామన్న అభిప్రాయం సహజంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వ కలల రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలు, టీడీపీ నాయకులు చేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, సుమారు 800 మంది బినామీల చిట్టాను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టారు. ఈ వాస్తవాలు తెలుగు ప్రజలను నిర్ఘాంతపరిచేవే. ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో విశ్వనగరంగా గ్రాఫిక్స్‌లో చూపించిన అమరావతి భూముల కొనుగోళ్ళు, అమ్మకాల వెనుక అక్రమాలు జరిగి ఉంటే మరో ఆలోచన లేకుండా ముక్త కంఠంతో ఖండించాల్సిందే. బాధ్యులకు శిక్ష పడాల్సిందే.
ఈ నేపథ్యంలో రాజధాని నగరాన్ని విశాఖపట్నానికి తీసుకువెళ్ళాలన్నది జగన్ ఉద్దేశమన్నది స్పష్టమే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిబంధనలకు విరుద్ధంగా మండలిలో అడ్డుకట్ట పడుతూ ఉండటంతో ప్రభుత్వం అసలు మండలినే రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఇక ముందు కూడా ప్రభుత్వానికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం చిక్కదు. రికార్డ్ స్థాయి మెజార్టీ సాధించిన తర్వాత కూడా జగన్ తనదైన ముద్ర వేయగలిగే నిర్ణయాలు తీసుకుని అమలు చేయలేకపోతే ముఖ్యమంత్రిగా విఫలమైనట్లే. అందుకే మండలి రద్దు ప్రతిపాదనను ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా ఆలోచిస్తున్నాయి. గతంలో 1985లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలిని రద్దు చేశారు. 1983లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి అప్పుడు విపక్ష కాంగ్రెస్ మండలిలో ప్రతి బిల్లుకు మోకాలు అడ్డు పెట్టేది. దీనితో మండలిని రద్దు చేస్తు ఎన్టీ రామారావు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మండలిని పునరుద్ధరించారు. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిని పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి మండలి రద్దు అయితే తండ్రి పునరుద్ధరించిన మండలిని అతని కుమారుడే రద్దు చేసిన ప్రత్యేక రికార్డ్ నమోదవుతుంది.