Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ‌బరిలో టిడిపి, జనసేన

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ సత్తాను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పదిహేడు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశంపార్టీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత క్రమేణా మసకబారుతూ వొచ్చింది. గత జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కేవలం ఒకటంటే ఒక స్థానాన్ని మాత్రమే సాధించుకున్న టిటిడిపి, ప్రస్తుతం ఇక్కడ జరిగే ఎన్నికల ద్వారానైనా పూర్వ వైభవాన్ని పొందాలన్న ప్రయత్నంలో ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకన్నా అత్యధికంగా రాష్ట్ర రాజధానిలో సెటిలర్స్ ‌సంఖ్య ఎక్కువగానే ఉండడంతో జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కొన్ని స్థానాలనైనా గెలుచుకునే అవకాశం లేకపోలేదని ఆశిస్తోంది. అందుకే జిహెచ్‌ఎం‌సి పరిధిలోని అన్ని స్థానాలకు కాకుండా ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో సెటిలర్స్ ‌నివసించే ప్రాంతాలను ఎంచుకుని తమ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా రాజధానిలో ఇంకా టిడిపి బ)ంగానే ఉందన్న సంకేతాన్నివ్వాలని చూస్తోంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ దిశగా తన క్యాడర్‌ను సమాయత్తపర్చే పనిలో ముని గిపోయారు.

చాలాకాలంగా తెలంగాణ రాజకీ యాల్లో అంతగా శ్రద్ధ కనబరచకుండా మౌనంగా ఉంటూ వొస్తున్న చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్‌లో విపరీతమైన ఎదురు దెబ్బలు తగులుతుండడంతో, తెలంగాణలో తన క్యాడర్‌ను పటిష్టపర్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు స్పష్ట మవుతున్నది.  హైదారాబాద్‌లో పార్టీ బలపడితే దాని ప్రభావం యావత్‌ ‌తెలంగాణపై పడక పోదు. ఆలాగే ఆ పార్టీని అంటిపెట్టుకున్న ఏపి నాయకులు, కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపినట్లు అవుతుందన్న ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పార్టీని తిరిగి వెలుగులోకి తీసుకు రావడానికి అందివొచ్చిన జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పోటీపడాలని అధినేత అభిప్రాయడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్‌ ‌పరిధిలోని సీనియర్‌ ‌నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించడంతో పాటు, గెలుస్తామనుకునే స్థానాల్లో గెలువగలిగే అభ్యర్థుల పేర్లను ప్రకటించే ప్రయత్నంలో పార్టీ ఉంది.

గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ పెద్దగా సాధించిందేమీలేదు. బిజెపి నాలుగు స్థానాల్లో గెలిస్తే, టిడిపి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అయితే ఆ ఎన్నికల అనంతరం పొత్తుపై రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకున్న విషయం తెలిసిందే. గత అనుభవం దృష్టా ఈసారి తాము గెలువగలమనుకుంటున్న స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయడానికి టిడిపి సిద్ధపడింది. మొదటినుండీ హైదారాబాద్‌ ‌నిర్మాతను తానే అని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు తమ పరిపాలనా కాలంలో హైదరాబాద్‌లో ముఖ్యంగా ఐటి సెక్టార్‌లో జరిగిన అభివృద్ధికి కారణం తామేనన్న విషయాన్ని వోటర్ల ముందుకు మరోసారి తీసుకుపోవాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు  హితబోధ చేస్తున్నారు. వాస్తవంగా హైదరాబాద్‌ ‌వోటర్లను వోటు అడిగే హక్కు తమకే ఉందని ఇటీవల విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. ‌రమణ పేర్కొనడం గమనార్హం.

గత ఎన్నికల్లో పోటీకి ఇష్టపడని జనసేన పార్టీ చీఫ్‌ ‌పవన్‌ ‌కళ్యాణ్‌ ఈసారి ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే తాము కూడా జిహెచ్‌ఎం‌సి ఎన్నికల రంగంలో ఉండబోతున్నట్లు ప్రకటించడంతో గ్రేటర్‌ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ప్రధానంగా యువ వోటర్లు ఎక్కువగా ఇష్టపడే పవన్‌ ‌కళ్యాణ్‌ ‌రంగంలోకి దిగితే ఎలా ఉంటుందన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. యువ జనసైనికులు, క్రీయాశీల కార్యకర్త)నుండి వొస్తున్న వందలాది విజ్ఞప్తుల మేరకే ఎన్నికల్లో పాల్గొనాలని నిశ్చయించినట్లు పవన్‌ ‌కళ్యాణ్‌ ‌ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా తాను ప్రశ్నించే గొంతుకనవుతానని పదేపదే చెబుతున్న పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వైపు వోటర్లు ఏమేరకు మొగ్గుతారన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందా, మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అన్నది కూడా ఇంకా తేలాల్సిఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపితో జనసేనకు పొత్తు ఉంది. అదే విధంగా తెలంగాణలో కూడా ఆ పార్టీతో జనసేన పొత్తుపెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఎన్నికైన తర్వాత పవన్‌కళ్యాణ్‌ను కలిసినట్లు  జరుగుతున్న  ప్రచార నేపథ్యం కూడా  ఇదే సంకేతాన్ని తెలుపుతున్నది. అయితే దాన్ని కొట్టిపారేసినట్లుగా ఈ ఎన్నికల్లో జనసేనతో తమకు పొత్తులేదని  బండి సంజయ్‌ ‌తాజాగా ప్రకటించినప్పటికీ చివరి దశలో ఏం జరుగనుందన్నది ఇప్పుడప్పుడే అంచనావేయడంకష్టం. టిడిపి ఆశిస్తున్నట్లుగానే గ్రేటర్‌ ‌పరిధిలో భారీ సంఖ్యలో సీమాంధ్ర వోటర్లున్నారు. అలాగే తెలంగాణలో కూడా పవన్‌కళ్యాణ్‌కు చాలామంది యువ అభిమానులుండడంతో సెటిలర్ల వోట్లను టిడిపి, జనసేన పార్టీలు ఏమేరకు చీల్చుకుంటాయన్నది ఎన్నికల ఫలితాలు వొచ్చేవరకు వేచిచూడాల్సిందే.

manduva
మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply