- నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..పీడీ యాక్ట్ నమోదు
- మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జూన్ 1 :: రాష్ట్రంలో నకిలీ విత్తనాల చెలామణి నివారణకై పోలీసు, వ్యవసాయాధికారులతో కలిపి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లతోకలసి పోలీసు కమిషనర్ల్లు, ఎస్.పి. లు, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉచిత కరంటు, నీళ్లు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, అదే సమయంలో ప్రధానంగా విత్తనాలు విత్తే సమయంలో నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోకూడదన్నది ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ప్రధాన రంగంగా గుర్తించిన మన రాష్ట్రంలో 60 లక్షల రైతు కుటుంబాలు దాదాపు 2.40 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు.కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే అమ్మాలి .. విత్తనాలే నాణ్యత లేకుంటే రైతు తీవ్రంగా నష్టపోతాడని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. 450 గ్రాముల పత్తి ప్యాకెట్ గరిష్ట ధర రూ.767 గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిందని, అంతకన్నా ఎక్కువగాని, తక్కువగానీ అమ్మవద్దని తెలిపారు. వానాకాలంలో గ్లైఫోసైట్ పెస్టిసైడ్ ను అమ్మడాన్ని నిషేధించడం జరిగిందని, ఏ షాపులో కనిపించినా లైసెన్సులు రద్దు చేయాలని పేర్కొన్నారు.
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 1,60,950 మంది రైతు బంధు సమితి కార్యకర్తలున్నారని, వీరికి రాష్ట్రంలో ఉన్న 2600 రైతు వేదికల్లో నకిలీ విత్తనాలపై తగు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నకిలీ విత్తనాల బెడద నివారణలో పోలీసు, వ్యవసాయాధికారులతో పాటు రైతు బంధు సమితి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ, ఎక్కువగా మిరప, పత్తి విత్తనాల్లో కల్తీ విత్తనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు తమ పరిధిలోని విత్తన విక్రదారుల దుకాణాలు, గోదాములు, నర్సరీలను తనిఖీ చేయాలని తెలియచేసారు. రైతు వేదికల ద్వారా కోవిద్ నిబంధనలను పాటిస్తూ నకిలీ విత్తనాలపై రైతు బంధు కార్యకర్తలు, రైతులను చైతన్య పర్చాలని స్పష్టం చేశారు.
నార్త్ జోన్ విభాగం, సీడ్ టాస్క్ ఫోర్స్ ఐజి నాగిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని మండల, గ్రామాల్లోని విత్తన దుకాణాలన్నింటినీ తనికీలు నిర్వహించాలని టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించామని అన్నారు. అనుమానిత విత్తన ప్యాకెట్లను ముందుగా ఫోటోతీసి కేటాయించిన వాట్స్ ఆప్ నెంబర్ కు పంపాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు డీజీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు, రాజేష్ కుమార్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.