Take a fresh look at your lifestyle.

ట్యాపింగ్ పోలిటిక్స్

“మనం ఒకరి పై ఆరోపణ చేస్తున్నాం అంటే విచారణకు నిలబడగలిగే ప్రాధమిక ఆధారాలు ఉండాలి. లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా బురద జల్లారు అని ప్రత్యర్ధులు ఎదురుదాడి చేయటానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయంలో టీడీపీ,చంద్రబాబు ఏం జాగ్రత్తలు తీసుకున్నారో, వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఇప్పటికైతే మనకు తెలియదు. ఈ క్రమంలో సీనియర్ నేత యనమల వాదన  కాస్త వింతగానే ఉంది. ప్రభుత్వమే దోషి కనుక…ఆధారాలు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని యనమల వాదన”

rehana pendriveఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయం అంతా టెలిఫోన్‌ టాపింగ్‌ చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఏ అంశం తెర మీదకు వస్తుందో అంచనా వేయలేకపోవచ్చేమో కాని… వచ్చే ప్రతి అంశం వెనుక ఉండే రాజకీయ కూడికలు, తీసివేతల గణాంకాలు అయితే చేయొచ్చు. ముందు వైసీపీ రెబల్‌ ఎమ్‌పీ రఘురామ కృష్ణం రాజు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. తన రెండు ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని, ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పిస్తూనే …ముఖ్యమంత్రి వరకు ఈ వ్యవహారం వెళ్ళకపోవచ్చు…ఆ పక్కన ఉండే వారెవరో చేస్తున్నారన్నది ఆయన చేసిన మీడియా బ్రీఫింగ్‌ సారాంశం. సరే ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నా లేకపోయినా…అధినేత దృష్టిలో పడాలనే విధంగా ఆయన వ్యవహరించటం, పార్టీ ఆయన ఎపిసోడ్‌ను పట్టించుకోవటం మానేసింది. కాబట్టి ఈ ట్యాపింగ్‌ ఇష్యూ కూడా అక్కడితే ఆగిపోయి ఉండేది. కాని రెండో రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు రంగంలోకి దిగటంతోనే ఈ ఎపిసోడ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. తన ఫోన్‌ ట్యాపింగ్‌ అవుతోంది అని అనుమానం వ్యక్తం చేసి ఉంటే కొంచెం నమ్మశక్యంగా ఉండేదేమో…కాని ఆయన మాత్రం ట్యాపింగ్‌ లిస్ట్‌ పెద్దదే ఇచ్చారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, జర్నలిస్ట్‌లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఇలా…అసలు ఇంత మంది పై ప్రభుత్వం నిఘా పెట్టాల్సిన అవసరం ఏముంది? అటువంటి అవాంఛనీయ లేదా సంక్షోభ భరిత వాతావరణం ఉందా? అసలు సాంకేతికంగా సాధ్యమేనా? ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తే వ్యవహారం ఎక్కడో ఒక చోట బయటకు పొక్కకుండా, దొరకకుండా ఉంటుందా?ఇలా అనేక అనుమానాలకు అవకాశం ఏర్పడుతుంది. టీడీపీ చేసిన మరో ఆరోపణ ప్రైవేటు వ్యక్తులు క్లోజ్‌ ఎండ్‌ టెక్నాలజీ ద్వారా టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని.
చంద్రబాబు లేఖను స్థానిక బీజేపీ నేతలు కూడా తప్పుబట్టడం మరో అంశం. ఎన్నికలకు ముందు ప్రధాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి, ఇప్పుడు అదే వ్యక్తిని శక్తివంతుడిగా అభివర్ణించటంతో చంద్రబాబు మాటల్లో విశ్వసనీయత తగ్గినట్లు అయ్యింది. ఒక విధానపర నిర్ణయానికి కట్టుబడి ఉండరని విమర్శించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక కీలకమైన మరో అంశం ప్రాధమిక ఆధారాలు చూపించకపోవటం. చంద్రబాబు లేఖ రాసిన వెంటనే జగన్‌ ప్రభుత్వం హోమ్‌ మంత్రిని, డీజీపీని రంగంలోకి దించింది. హోమ్ మంత్రి రాజకీయంగా మాట్లాడతారు అనుకున్నా…డీజీపీ సాంకేతిక అంశాలనే ప్రస్తావిస్తారు.
విచిత్ర వాదనలతో లాభమా? నష్టమా?
మనం ఒకరి పై ఆరోపణ చేస్తున్నాం అంటే విచారణకు నిలబడగలిగే ప్రాధమిక ఆధారాలు ఉండాలి. లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగా బురద జల్లారు అని ప్రత్యర్ధులు ఎదురుదాడి చేయటానికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయంలో టీడీపీ,చంద్రబాబు ఏం జాగ్రత్తలు తీసుకున్నారో, వారి వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఇప్పటికైతే మనకు తెలియదు. ఈ క్రమంలో సీనియర్ నేత యనమల వాదన  కాస్త వింతగానే ఉంది. ప్రభుత్వమే దోషి కనుక…ఆధారాలు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని యనమల వాదన. ప్రభుత్వం దోషి అని తేల్చింది ఎవరు? ఏ ఆధారాలతో తేల్చారు అనే ప్రశ్నలు వస్తాయి కదా. రాజకీయ విమర్శలు, ఆరోపణలు చట్టబద్ద నిర్ధారణలు అవుతాయా? యనమల  తమ పార్టీ నేతను హత్య చేశారు అని వైసీపీ ఆరోపించింది అనుకోండి… ఆయన దోషి అయిపోతారా?  జైల్లో వేసి శిక్షిస్తారా? అది న్యాయమా?  మరో వైపు కొందరు ఇదే విషయం పై హై కోర్టును కూడా ఆశ్రయించారు. పిటిషన్‌ వేయటం వరకు సరే…కోర్టు అడిగితే ఆరోపణలకు ఆధారాలు చూపించక తప్పదు. కోర్టు అన్ని వివరాలతో అఫిడవిట్‌ వేయమని పిటిషనర్‌కు చెప్పింది. ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో, టీడీపీ శిబిరంలో ఉన్న ఆధారాలు ఏమిటో బయటపడితే మాత్రం
రాజకీయ వాతావరణం మరింత వేడెక్కతుంది.
కాస్త వెనక్కి వెళితే: 
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు ఇవే ఆరోపణలు అప్పుడూ చేశారు. ‘అనవసరంగా మీకు మీరు ఎక్కువ ఊహించుకోకండి…మీ మాటలు రహస్యంగా వినే స్థాయిలో మీరు లేరని’ అసెంబ్లీ వేదికగా వైఎస్ ఎద్దేవ చేసిన వీడియో క్లిప్ ను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీం వైరల్ చేస్తోంది. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే ఆరోపణలను నాటి టీడీపీ ప్రభుత్వం పై చేయడం కొసమెరుపు.

Leave a Reply