ఆర్థిక బిల్లును అడ్డుకోవడంపై మండిపడ్డ స్పీకర్
అచ్చెన్న నిజాయితీ రుజువు చేసుకోవాలన్న మోపిదేవి వెంకట రమణ
తిరుమల,జులై 2 : తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీమంత్రి ,ఎంపి మోపిదేవి వెంకట రమణలు గురువారం దర్శించుకున్నారు. వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందించారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా బుధవారం తిరుమలకు చేరుకున్న స్పీకర్‌కు స్థానిక శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద జిల్లా అధికారులు, టీటీడీ డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికారు. గురువారం స్పీకర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్పీకర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి, శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలకు వచ్చి బస చేస్తారని అధికారులు తెలిపారు. శుక్రవారం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని, శనివారం శ్రీకాళహస్తీశ్వరస్వామిని స్పీకర్ దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా తమ్మినేని మాట్లాడుతూ మండలిలో టీడీపీ ఆర్థిక బిల్లును అడ్డుకోవడంతో ఇవాళ ఉద్యోగులకు జీతాలు నిలిచి పోయాయని పేర్కొన్నారు. పేదవారికి అందించే పెన్షన్లు సైతం ఆగిపోయాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందన్నారు. ప్రపంచంలో ఆర్థిక బిల్లును అడ్డుకున్న ఘటనలు ఎక్కడా జరగలేదని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాత్మక పాత్ర పోషించాలన్నారు.
108,104 వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా విమర్శించడం సమంజసం కాదన్నారు. ప్రజల సంక్షేమంలో వైఎస్ ఒక్క అడుగు ముందుకు వేస్తే…. జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని తమినేని సీతారాం కొనియాడారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పు చేయకుంటే ధైర్యంగా ఎదుర్కోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సూచించారు. రాజ్యసభకు ఎన్నికైన తరువాత గురువారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామివారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎంపీని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడారు. ఈఎస్ఐ స్కాంలో తాను తప్పుచేయ లేదని అచ్చెన్నాయుడు నిరూపించు కోవాలని అన్నారు. తప్పు చేసేవారు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని విమర్శించారు. అచ్చెన్నాయుడు అవినితికి పాల్పడలేదని ఒక్క టీడీపీ నాయకుడు చెప్పడం లేదన్నారు. అరెస్ట్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నార న్నారు. అవినీతికి పాల్పడితే అచ్చెం అయినా… చంద్రబాబైన అరెస్ట్ కాక తప్పదని మోపిదేవి పేర్కొన్నారు. బీసీలు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు కేటాయించారన్నారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేలా జగన్ పరిపాలన చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.