Take a fresh look at your lifestyle.

ప్రైవేటీకరణపై తలోమాట… స్మారకచిహ్నాలకు రాజకీయ రంగు

ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌లాభాలొస్తున్నా ప్రైవేటీకరణ చేసి తీరుతామని ప్రకటించగా, నాలుగు ప్రధాన రంగాలు తప్ప అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ కార్యక్రమం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌మాత్రం రైల్వేలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అనే పదం ఉపయోగించకుండా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేయడం లేదు. దేశంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడే సామర్ధ్యం ప్రస్తుత ప్రభుత్వానికి లేదనే విషయం ఈ ప్రకటనలతో స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌ ‌హయాంలోనే ప్రభుత్వ ఆస్తులు చాలా మటుకు అన్యాక్రాంతం అయ్యాయి.

ప్రభుత్వానికి నామమాత్రం లీజుతో దశాబ్దాల నుంచి ప్రభుత్వ భూములు, భవనాల్లో వ్యాపారాలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. స్వాతంత్య్రం వొచ్చిన తొలి నాళ్ళలో ప్రజల్లో జాతీయ భావాలు మెండుగా ఉండేవి.ఇప్పుడు వారిలో కూడా యథారాజా, తథా ప్రజా అన్న సామెత చందంగా మార్పు కనిపిస్తోంది. స్మారక చిహ్నాలను పరిరక్షించుకోవడానికి గతంలో ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడేవారు.ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లోనే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. భావసమైక్యతను పెంచే కట్టడాలు, చిహ్నాలను కాపాడుకోవాలన్న స్పృహ కూడా క్రమంగా కనుమరుగు అవుతోంది. లోకంలో ఉన్న పరిస్థితినే ప్రధాని నరేంద్రమోడీ తన ప్రకటనల్లో ప్రతిబింబింపజేశారు. స్మారక చిహ్నాలు, భావోద్వేగాలు అంటూ కూర్చుంటే కుదరదనీ, ప్రైవేటు రంగానికి ప్రభుత్వ ఆస్తులను అప్పగించాల్సి వొచ్చినప్పుడు సందేహించకూడదని అన్నారు.

బహుశా విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక పెద్ద ఉద్యమ చరిత్ర ఉందన్న ప్రజాప్రతినిధుల ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ స్పష్టీకరణ చేసి ఉండవచ్చు.అలాగే. స్వాతంత్య్ర యోధుల పేరిట ఉన్న మైదానాలన్నీ క్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో అలాంటి మైదానాలెన్నో క్రమంగా కుదించుకుని పోయాయి. తరచుగా బహిరంగ సభలు జరిగే ఇలాంటి మైదానాల్లో ముందుగా చిన్న చిన్న దుకాణాలు వెలుస్తాయి. క్రమంగా చిన్న షాపింగ్‌ ‌కాంప్లెక్సులు వొస్తాయి. ఇలా మొత్తం మైదానమంతా ఆక్రమణకు గురి అవుతోంది. ఒక్క నగరం, పట్టణమని కాకుండా దేశంలో అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితిని చూస్తున్నాం. ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ ఆక్రమణల పర్వం ప్రారంభమై క్రమంగా ఆ మైదానాలన్నీ అన్యాక్రాంతాలవుతాయి.

చరిత్ర ప్రసిద్ధి గన్న రాజమహేంద్రవరంలో పాల్‌ ‌చౌక్‌ అనే మైదానం ఈ మాదిరిగానే ఆక్రమణకు గురి అయింది. స్వాతంత్య్రోద్యమంలో జాతీయ నాయకులు ప్రసంగాలు చేసిన మైదానాలకు వారి పేర్లు పెట్టడం ఒక ఆనవాయితీగా ఉండేది. అన్ని నగరాలలో ఇలాంటి మైదానాలు ఉన్నాయి. ఒక వేళ వారు ప్రసంగించకపోయినా, జాతీయ నాయకుల పేర్లు మైదానాలకు పెట్టడం ఒక ఆనవాయితీగా ఉండేది. అయితే, ప్రజల్లో కూడా మనకెందుకులెమ్మన్న నిర్లిప్తతా భావం క్రమంగా ఏర్పడుతోంది. జీవన పోరాటంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సగటు మనిషికి ఇవన్నీ పట్టించుకునే తీరిక లేదు. ఎన్నికల సమయాల్లో తప్ప పట్టణాలు, నగరాల్లో మైదానాల జోలికి ఎవరూ వెళ్లరు. ఎన్నికల్లో కూడా బహిరంగ సభలను నిర్వహించే సంప్రదాయానికి పార్టీలు స్వస్తి చెప్పి ఇరుకు గల్లీల్లో రోడ్‌ ‌షోలు నిర్వహిస్తున్నాయి.

జనం రావడం లేదు. జనాన్ని రప్పించడానికి గతంలో మాదిరిగా ప్రయత్నాలు జరగడం లేదు.అందువల్ల పెద్ద నాయకుల రోడ్‌ ‌షోలు సైతం ఇప్పు డు ఇరుకు గల్లీల్లో జరుగుతున్నాయి. ఈ మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఇరుకు గల్లీల్లో రోడ్‌ ‌షోలు నిర్వహించిన దృశ్యాలను నిరంతర వార్తా స్రవంతుల్లో చూశాం. బెంగాల్‌ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.అంతేకాకుండా, పార్టీ నాయకులు ఎంత పెద్ద వారైనా వారు నిర్వహించే ర్యాలీలకు, సభలకు గతంలో మాదిరిగా ప్రజలు పనులు మానుకుని వెళ్లకపోవడం వల్ల జనసమీకరణ పెద్ద సమస్యగా తయారైంది. ఈ కారణం గా ఇరుకుగల్లీల్లో రోష్‌ ‌షోలను నిర్వహించడం సర్వసాధారణమైంది.అలాగే, మత పరమైన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ కూడా మందిరాలు, చిన్న గుళ్లు గోపురాలపై జెండాలను ఎగురవేసేందుకు వెనకాడటం లేదు.

గతంలో ఇలాంటివి చాలా తప్పుగా తోచేవి.ఇప్పుడు ఆ యా ప్రార్థనా మందిరాలకు భారీగా విరాళాలు ఇచ్చిన వారి ఒత్తిడి వల్ల, మొహమాటాల వల్ల పార్టీ జెండాలు మందిరాలు, గుడుల సమీపంలో కనిపిస్తున్నాయి.అన్ని విషయాల్లో పార్టీ రాజకీయాల, రాజకీయ నాయకుల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. దేవుని పేరిట జరిగే ఉత్సవాల్లో కూడా రాజకీయనాయకులు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న ధోరణులు ఈ మధ్య తరచూ చూస్తున్నాం. రాజకీయం ధనమయం కావడంతో అన్నింట్లోకి చాపకింద నీరులా ప్రవేశిస్తోంది. వాతావరణం ఇలా కలుషితం కావడానికి ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, ‌బీజేపీలదే బాధ్యత, దశాబ్దాల తరబడి పాతుకుని పోయిన ప్రాంతీయ పార్టీలు కూడా ఈ విషయంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నాయి. జాతీయ స్మారక చిహ్నమైనా, మత చిహ్నమైనా రాజకీయాలకు అతీతం కాదని రుజువు అవుతున్న రోజులివి.

Leave a Reply