Take a fresh look at your lifestyle.

మహిళల విద్యపై తాలిబాన్‌ల విధానం..

తాలిబాన్‌ ‌మొదటి పాలన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ ‌లో గత 20 సంవత్సరాలలో విద్య రంగంలో మహిళలు చూపిన ప్రతిభ ఒక పెద్ద ముందడుగు. యునెస్కో నివేదిక ప్రకారం, 2001 నుండి స్త్రీ అక్షరాస్యత 17 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. దాదాపు రెట్టింపు అయింది. ఇప్పుడు మళ్ళీ తాలిబన్‌ ‌రెండవ సారి అధికారంలోకి వచ్చాక మహిళల చదువుకి బ్రేక్స్ ‌పడుతున్నాయి. ఇది ఆఫ్గనిస్తాన్‌ ‌ప్రగతికి తీవ్ర అవరోధం కానున్నది.

తాలిబాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళల దుస్థితి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత తాలిబన్‌ ‌ప్రభుత్వం(1996-2001), బాలికలకు విద్యా హక్కు లేదని ప్రకటించి వారు పాఠశాలలకు, విద్యాసంస్థలకు వెళ్లకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో నేటి తాలిబాన్‌ ‌ప్రభుత్వం ఎలాంటి విద్యా వవస్థను ఆఫ్ఘన్‌ ‌మహిళలకు ఇచ్చిందో చూద్దాం.  తాలిబాన్‌లు ఆఫ్గనిస్తాన్‌ ‌ప్రభుత్వాన్ని చేపట్టిన కొద్దిసేపటిలోనే, ఆ దేశంలోని అనేక ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలు కర్టెన్లు కట్టి వేరు చేయబడిన తరగతి గదులలో విద్యార్థి, విద్యార్థినిలను కూర్చోబెట్టి చదువు చెప్పడం ప్రారంభించాయి. ఈ ఫోటోలు సోషల్‌ ‌మీడియాలో హల్చల్‌ ‌చేసిన విషయం తెలిసిందే.

ఈ వారం ప్రారంభంలో మొత్తం మగవారితో ఏర్పడిన కొత్త తాలిబాన్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం మహిళలు చదువుకోడానికి విశ్వవిద్యాలయాలకు హాజరు కావచ్చునని అనుమతించింది. అయితే కఠినమైన ఆంక్షలు విధించింది. తాలిబాన్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన కొద్దిసేపటికే, కర్టెన్‌లతో విభజించబడిన తరగతి గదులలు ఉనికిలోకి వొచ్చాయి. ఒక్క మహిళా మంత్రి కూడా లేని తాలిబాన్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం, మీడియా సమావేశంలో మహిళల విద్య మీద తమ వైఖరిని వెల్లడించింది. మహిళలు చదువుకోవాలంటే అనుసరించాల్సిన నియమాలను ప్రకటించింది. చదువుకోవటానికి విద్యా సంస్థలకు వెళ్ళాలనుకున్న మహిళలు ఇస్లాం మతం ప్రకారం, తాలిబాన్లు అనుమతించిన దుస్తులు ధరించాలి. దుస్తుల విషయంలో కఠినమైన కోడ్‌ని మహిళలు కచ్చితంగా పాటించాలి. తరగతులకు హాజరయ్యేటప్పుడు మహిళలు కచ్చితంగా హిజాబ్‌ ‌ధరించాలని తాలిబాన్‌ ‌ప్రభుత్వం చెప్పింది.‘‘అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోవటాన్ని ఇస్లాం మతం ఒప్పుకోదు. అంతే కాకుండా అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోవటం ఆఫ్ఘన్‌ ‌జాతీయ విలువలకు సరిపోని విషయం. ఆఫ్ఘన్‌ ఆచారాలు..సంప్రదాయాలకు ఇది విరుద్ధం’’ అని ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ ‌బాకీ హక్కానీ పేర్కొన్నాడు.

పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక ఎంట్రెన్స్ ‌పరీక్షలు ప్రవేశ పెట్టాలని విద్యా సంస్థలకు తాలిబన్‌ ‌ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. విశ్వవిద్యాలయాలు వేర్వేరు సమయ షెడ్యూల్‌లను విద్యార్థి, విద్యార్థినిల కోసం ఏర్పాటు చేయాలని తాలిబాన్‌ ‌ప్రభుత్వం నియమాలను  ప్రకటించింది. ప్రస్తుతం కొంత కాలం పాటు లింగ విభజన క్లాసుల్లో పాటించేందుకు తరగతి గది మధ్యలో కర్టెన్స్ ఉం‌డేలా చూసుకోవాలని విద్యాసంస్థలకు చెప్పింది. గత ఆగస్టులో, హెరాత్‌ ‌ప్రావిన్స్‌లో సహ-విద్యను నిషేధించే సమయంలో, సద్గుణవంతులైన మహిళా లెక్చరర్‌లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెప్పాలని, వీరు మగవారికి కూడా పాఠాలు చెబుతామంటే అనుమతించబోమని తాలిబాన్‌ ‌ప్రతినిధి చెప్పారు.

ఖాళీ అవుతున్న తరగతి గదులు..
వాల్‌ ‌స్ట్రీట్‌ ‌జర్నల్‌ ‌నివేదిక ప్రకారం, కాబూల్‌ ‌గాలిబ్‌ ‌యూనివర్సిటీ తిరిగి ప్రారంభమైనప్పుడు, కేవలం 21 మంది విద్యార్థినులు మాత్రమే తరగతులకు హాజరయ్యారు. ఈ ప్రైవేట్‌ ‌యూనివర్సిటీలో ఒకప్పుడు 2,400 మంది విద్యార్థులు ఉండేవారు. ఇందులో 60 శాతం మంది మహిళలే ఉండేవారు. వారం చివరకు 21 మంది విద్యార్థినుల సంఖ్య 200కి పెరిగింది. తాలిబాన్‌ ఆఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా మంది బోధనా సిబ్బంది పారిపోయినందున తరగతులను నిర్వహించడం విశ్వవిద్యాలయలకు చాలా కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి గర్జిస్తాన్‌ ‌విశ్వవిద్యాలయంలో ఉంది.

ఈ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌ ఏఎఫ్‌పి వార్తా సంస్థకు తన విశ్వవిద్యాలయంలో నెలకొన్న పరిస్థితిని ఇలా వివరించారు..‘‘గత సంవత్సరం నమోదు చేసుకున్న 1,000 మంది విద్యార్థులలో 10 నుండి 20 శాతం మంది మాత్రమే గత వారం క్యాంపస్‌కు వొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌ ‌ప్రభుత్వ పతనంతో కనీసం 30 శాతం మంది విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోయారు.’’గార్డియన్‌ ‌వార్తా పత్రికకు కాందహార్‌లోని ఒక విద్యార్థిని ఇలా చెప్పింది. ‘‘విశ్వవిద్యాలయం ఆడా..మగ విద్యార్థులకు విడివిడిగా బోధించలేమని తెలియజేసింది.’’ హెరాత్‌ ‌విశ్వవిద్యాలయంలోని ఒక ప్రొఫెసర్‌ ‌తాలిబాన్‌ ‌విద్యా విధానంలోని మరో లోపాన్ని ఎత్తి చూపారు. ‘‘కొన్ని సబ్జెక్టులలో  అనేక మంది మహిళా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకున్నారు. అయితే వారికి బోధించడానికి ఒక్క మహిళా ప్రొఫెసర్‌ ‌లేరు’’.

ఇప్పటికే అనేక మంది మహిళలు అనేక కోర్సుల నుండి తప్పుకున్నారని ఆయన తెలిపారు. మహిళా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భద్రతా సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది మహిళలు విశ్వవిద్యాలయాలకు హాజరు కావటం లేదు. వీరు కనీసంగా వీధుల్లో నడవడానికి భయపడుతున్నారు.‘‘ఆఫ్గనిస్తాన్‌ ‌ప్రాథమిక పాఠశాలలో 2001లో బాలికల సంఖ్య దాదాపు సున్నా. ఇది 2018లో 2.5 మిలియన్లకు పెరిగింది. 2021లో చూస్తే ప్రాథమిక విద్యలో 10  మంది విద్యార్థులలో నలుగురు బాలికలు ఉన్నారు’’ అని  యునెస్కో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

తాలిబాన్‌ ‌మొదటి పాలన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ ‌లో గత 20 సంవత్సరాలలో విద్యా రంగంలో మహిళలు చూపిన ప్రతిభ ఒక పెద్ద ముందడుగు. యునెస్కో నివేదిక ప్రకారం, 2001 నుండి స్త్రీ అక్షరాస్యత 17 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. దాదాపు రెట్టింపు అయింది. ఇప్పుడు మళ్ళీ తాలిబాన్‌ ‌రెండవ సారి అధికారంలోకి వొచ్చాక మహిళల చదువుకి బ్రేకులు పడుతున్నాయి. ఇది ఆఫ్గనిస్తాన్‌ ‌ప్రగతికి తీవ్ర అవరోధం కానున్నది.

Leave a Reply