Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ 26 ‌వరకు ఢిల్లీలో తాలా బంద్‌..!

  • ఆరు రోజుల పాటు హస్తినలో లాక్‌ ‌డౌన్‌..
  • ‌లిక్కర్‌ ‌షాపుల ముందు భారీ క్యూలు
  • అందరికీ టీకాతో పాటు రేషన్‌ ‌పంపిణీ చేయాలని ఢిల్లీ లెఫ్ట్ ‌పార్టీల డిమాండ్‌

దేశ రాజధాని ఢిల్లీలో కొరోనా వైరస్‌ ‌రెండో దశ ఉధృతి రోజురోజూకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో వైరస్‌ ‌కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం సుమారు ఆరు రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌విధించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సోమవారం మీడియా ముందు ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ ‌సోమవారం (ఏప్రిల్‌ 19) ‌రాత్రి 10 గంటల నుంచే షురూ అవుతుందని వొచ్చే సోమవారం(ఏప్రిల్‌ 26) ఉదయం ఐదు గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. హస్తినలో కొరోనా తీవ్ర విజృంభణ నేపథ్యంలో తాజా పరిస్థితిపై లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌తో చర్చలు జరిపిన అనంతరం ప్రకటన చేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ ‌వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ ‌తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వైరస్‌ ‌కట్టడికి విధించిన ఆంక్షలను కఠినంగా పాటించాలని సూచించారు. ప్రస్తుత కష్ట కాలాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న సుమారు రెండు కోట్ల మంది ఐకమత్యంగా… సమష్టిగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఢిల్లీలో కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌విధించాల్సిన అవసరముంది. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి వొచ్చే సోమవారం ఉదయం ఐదు గంటల వరకు ఆరు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నాం. ఈ సమయంలో అత్యవసర సేవలు కొనసాగుతాయి. ఆహార పదార్థాలు, వైద్య సేవలు నడుస్తాయి. ఇది వివాహాల సీజన్‌. ‌ప్రజలంతా ఎంతో ఆనందంతో పెళ్లిళ్లు జరుపుకుంటారు. వారి సంతోషాన్ని మేము దూరం చేయం. కేవలం 50 మంది అతిథులతో వివాహాలు జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం.’ అని సీఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరోగ్య వ్యవస్థ పరిమితికి మించి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ‌నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.  గడిచిన 24 గంటల్లో సుమారు 23,500 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయినట్టు వివరించారు. గత మూడు, నాలుగు రోజులుగా ఇదే విధంగా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. తమ ఆరోగ్య శాఖ విభాగం అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టడం లేదని… పాజిటివ్‌ ‌రేటు 29.74 శాతంగా వొస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కొరోనా పాజిటివిటీ రేటు, ఇన్‌ఫెక్షన్‌లు భారీగా పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉన్న హాస్పిటళ్లలో పడకల కొరత ఏర్పడిందని స్పష్టం చేశారు. హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య ఈ స్థాయిలో పెరిగితే… మొత్తం ప్రజారోగ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే లాక్‌డౌన్‌ ‌నిర్ణయం తీసుకున్నట్టు కేజ్రీవాల్‌ ‌వెల్లడించారు. ఈ ఆరు రోజుల్లో హాస్పిటళ్లలో పడకలు, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది స్వల్పకాలిక లాక్‌డౌన్‌ ‌మాత్రమేనని, వలస కూలీలు ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ ‌ప్రకటనతో ఢిల్లీ లిక్కర్‌ ‌షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌లాక్‌డౌన్‌ ‌ప్రకటనతో నగరంలోని లిక్కర్‌ ‌షాపుల ముందు పెద్ద ఎత్తున క్యూ పెరిగింది. ఖాన్‌ ‌మార్కెట్‌, ‌పహార్‌ ‌గంజ్‌, ‌గోల్‌ ‌మార్కెట్‌, ‌కరోల్‌ ‌బాగ్‌, ‌కన్నాట్‌ ‌ప్లేస్‌ ‌తదితర ప్రాంతాల్లోని వైన్‌ ‌షాపుల ముందు ఢిల్లీ వాసులు బారులు తీరారు. దాదాపు వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ‌విధించడంతో అందరూ పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేయడం అన్ని చోట్ల కనిపించింది. అయితే, చాలా చోట్ల స్థానిక అధికారులు కోవిడ్‌ ‌ప్రోటోకాల్‌ ‌పాటించే విధంగా తగు చర్యలు తీసుకున్నారు. అందరికీ టీకాతో పాటు రేషన్‌ ‌సరకులు పంపిణీ చేయండి అంటూ ఢిల్లీ సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు డిమాండ్‌ ‌చేసాయి. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడకుండా రేషన్‌ ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీలు డిమాండ్‌ ‌చేశాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీల ఢిల్లీ శాఖ కార్యదర్శలులు నత్తు ప్రసాద్‌, ‌దినేష్‌ ‌వర్షిణీ సంయుక్తంగా సీఎం కేజ్రీవాల్‌కి లేఖ రాశారు.

కొరోనా సామాన్య ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టుల సంఖ్య పెంచి, వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్‌తో పాటు ఢిల్లీవాసులందరికీ టీకా వేసే పక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కొరోనాపై సంయుక్తంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. అందుకు తమ పార్టీలు ఏ విధమైన సాయమైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తమ సంసిద్ధతని వ్యక్తం చేశారు.

Leave a Reply