వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉద్యానవన అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఉద్యమంలా నిర్వహించాలని హరితహారం కార్యక్రమ కార్యాచరణపై అధికారులతో చర్చించి వాటి సంరక్షణ బాధ్యత చర్యలు ఏ విధంగా ఉండాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ నగరంలోని ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలన్నారు.
నగరంలోని ప్రతి ఒక్కరినీ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని, హరితహారం కార్యక్రమంతోనే పర్యావరణం సమతుల్యాత చెందుతుందన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పండుగలా నిర్వహించాలన్నారు. హరితహారం కార్యక్రమంతో నగర వాసులు ఎదుర్కొంటున్న కాలుష్య వాతావరణాన్ని అధిగమించడమే కాకుండా ముందు తరాలకు మంచి భవిష్యత్తు అందించేందుకై దోహద పడుతుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ పచ్చగా మారాలని, నూతనంగా నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున హరితహారం కార్యక్రమానికి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు సునిత, శంకర్ పాల్గొన్నారు.