బక్రీద్ పర్వదినం సందర్భంగా అక్రమ జంతు వధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల వధ చేసినా అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బక్రీద్ సందర్భంగా ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దనీ, జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జంతు మాసం విచ్చలవిడిగా విక్రయించడం ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందనీ, చైనాలో గబ్బిలాలను తినడం వల్ల కొరోనా వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ అధికారులు మాంసం దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనీ, రెండు వారాల్లోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.