- సమస్యలు రాకుండా చూసుకోండి
- విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్‌శాఖ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. విద్యుత్‌శాఖ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు. చాలాచోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని అభినందించారు. వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిపై సీఎంకు విద్యుత్ సంస్థ సీఎండీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని, స్తంభాలు దెబ్బతిన్నాయని, వైర్లు తెగిపోయాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదని, హైదరాబాద్‌తో పాటు చాలా పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు నీటితో నిండి ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగిందని, పరిస్థితిని బట్టి మళ్లీ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు సీఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు కరెంట్ డిమాండ్ డిమాండ్ చాలా తక్కువగా ఉందని, తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణశాఖ హెచ్చరికలు, సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాము అప్రమత్తమయ్యామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2660 డిమాండ్‌కు పడిపోయిందని తెలంగాణా ఏర్పడ్డాక ఇదే అత్యల్పమని అన్నారు. ఎన్టీపీసీ వారి సహకారంతో గ్రిడ్‌కు ఇబ్బంది లేకుండా చేశామని, తమ ఇంజనీర్స్, అధికారులు, తాను కూడా మంగళవారం రాత్రంతా మానిటరింగ్ చేశామని అన్నారు.
మంచి ఇంజనీర్స్ ఉన్నారన్న ఆయన మన గ్రిడ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఎంత తగ్గిన ఎంత పెరిగిన మన గ్రిడ్ ఎలాంటి ధోకా లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలో విద్యుత్ లేకపోవడం కరెంట్ సప్లై లేక కాదని అపార్ట్‌మెంట్లలోకి నీరు రావడంతో తామే నిలిపి వేశామని అన్నారు. చాలా చోట్ల సబ్ స్టేషన్‌లలో నీరు చేరిందని, దీనితో ఇంజనీర్స్ విద్యుత్ నిలిపివేశారని, నీరు తొలిగిపోగానే విద్యుత్ పునరుద్ధరణ చేస్తామని అన్నారు. మూసినది ప్రవాహంలో 200 ట్రాన్స్ఫార్మర్స్‌లో కొట్టుకుపోయాయరి, ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని అన్నారు. ఎక్కడైనా స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వండని కోరారు. స్తంభాలు కూలిపోవడంతో వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. హైడల్ విద్యుత్ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కానీ 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అన్నారు.