Take a fresh look at your lifestyle.

ఆటోలో తీసుకెళ్లండి…ఖర్చులు పంచాయతీ నుంచి తీసుకోండి

  • వొచ్చే రెండు వారాల్లో అర్హులందరూ కోవిడ్‌ ‌టీకా తీసుకునేలా చూడండి
  • బాధ్యత సర్పంచి, కార్యదర్శిదే
  • 100 శాతం పూర్తి చేసిన వారికి సత్కారం
  • మండలానికి అవార్డు
  • సెల్‌ ‌కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట జిల్లాలో కోవిడ్‌ ‌నిర్థారణ పరీక్షలు, వాక్సినేషన్‌ ‌కార్యక్రమం అమలు తీరు, సెకెండ్‌ ‌వేవ్‌ ‌సన్నద్ధతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సోమవారం కలెక్టరేట్‌ ‌మీటింగ్‌ ‌హల్‌లో జిల్లా కలెక్టర్‌ ‌పి వెంకట్రామరెడ్డితో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌రావు సుదీర్ఘంగా సమీక్షించారు. వొచ్చే రెండు వారాల్లో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ ‌టీకా తీసుకునేలా చూడాలనీ అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు  జిల్లాలోని సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ఎంపి, ఎమ్మెల్యేలు,  రైతు సమన్వయ సమితి సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తంగా కలిపి 3500 మందితో సెకండ్‌ ‌వేవ్‌ ‌సమర్థంగా ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కార్యక్రమం సజావుగా అమలయ్యేందుకు తీసుకోవల్సిన చర్యలపై సెల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… స్థానిక సర్పంచులు, కార్యదర్శులు ప్రతి గ్రామం నుంచి కనీసం రోజుకు 20 మందిని ఆటోలో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి టీకా వేయించాలన్నారు. ఆటో ఖర్చులను స్థానిక గ్రామ పంచాయతీ నిధుల నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతిఒక్కరూ కోవిడ్‌ ‌టీకా వేసుకునేలా చూడాల్సిన బాధ్యత ఆ గ్రామ సర్పంచి, కార్యదర్శిదేననీ స్పష్టం చేశారు. కోవాక్సిన్‌, ‌కొవిషీల్డ్ ‌వాక్సినేషన్‌కు తేడా లేదనీ, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కోవాక్సిన్‌, ‌కొవిషీల్డ్ ‌రెండు ఒకే మాదిరిగా సమర్థవంతంగా పని చేస్తాయనీ,  సైడ్‌ ఎఫెక్టస్ ఏమీ లేవని అనుభవపూర్వకంగా తెలుస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 39 ప్రాథమిక హెల్త్ ‌కేంద్రాల్లో టీకాలు అందిస్తున్నారని తెలిపారు.45 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ ‌వేసుకునేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్‌ ‌వల్ల కోవిడ్‌ ‌వ్యాప్తి నుంచి రక్షణ కల్పించుకోవచ్చన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిజమైన ప్రజా సేవ అని పేర్కొన్నారు. రేపు టీకా వేసే వారి వివరాలను ఒకరోజు ముందే తెలుపాలన్నారు. తమ గ్రామంలో 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు హెల్త్‌కేర్‌  ‌వర్కర్స్, ‌ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌కు మొదట 100శాతం వ్యాక్సినేషన్‌ ‌పూర్తిచేసిన గ్రామ పంచాయతీ సర్పంచి,  కార్యదర్శిని  సత్కరిస్తామని  మంత్రి తెలిపారు. అలాగే, 100శాతం వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేసిన మొదటి మండలానికి అవార్డును అందిస్తామని తెలిపారు. జన రద్దీ ప్రాంతాలకు, జాతరలు, వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి కోరారు.

రిజ్వీ,  వాకాటి కరుణకు మంత్రి ఫోన్‌
‌కోవిడ్‌పై సుదీర్ఘ సమావేశం, సెల్‌ ‌కాన్ఫరెన్స్ ‌జరిగిన క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ‌వాకాటి కరుణకు సమావేశం నుంచి మంత్రి హరీష్‌రావు ఫోన్‌ ‌చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆర్‌టిపిసిఆర్‌ ‌టెస్టులు, రాపిడ్‌ ‌టెస్టులు సంఖ్య పెంచేందుకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే వ్యాక్సినేషన్‌ 100 ‌శాతం లక్ష్యం పూర్తి చేసేందుకు అవసరమైన డోస్‌లను పంపించాలని మంత్రి కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పూర్తి సహాకారం అందిస్తే వచ్చే వారం రోజుల్లో సిద్దిపేట జిల్లాను వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే, మంత్రి విజ్ఞప్తికి స్పందించిన ఇరువురు అధికారులు సానుకూలంగా స్పందించారు.
మాస్కు ధరించకపోతే 1000 ఫైన్‌ : ‌సిపి
ఇక నుంచి బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందేనని సిపి  జోయల్‌ ‌డేవిస్‌ ‌స్పష్టం చేశారు. మాస్కు ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేస్తూ… జరిమానాతో పాటు డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌యాక్ట్-2005, ఐపిసి సెక్షన్‌ 188,‌హొ 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మీరంతా ఒక్కమాటపైకొచ్చి ఆశీర్వదించాలి : మంత్రి హరీష్‌రావు
మీ పేరిట పట్టా చేశాం. ఏండ్ల నుంచి మీకున్న దిగులు దూరం చేశాం. మునిసిపాలిటీలో సైతం ఆన్‌లైనులో మీ ఇల్లు పేరిట అసెస్మెంట్‌ ఎం‌ట్రీ చేశాం. ఇవాళ్లీ  నుంచి సర్వ హక్కులు మీకే ఉండేలా భద్రత కల్పించి పట్టా ధృవీకరణ పత్రాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం లింగారెడ్డిపల్లి – ఇందిరమ్మ కాలనీకి చెందిన 800 మందికి ఇండ్ల ధృవీకరణ పట్టా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏండ్ల కింద స్థలం కొని ఇండ్లు కట్టుకుని సంబంధిత ఇల్లు పట్టా కాగితం లేక దిగులు చెందుతున్న మీకు ఇవాళ్లీ నుంచి మీరు కట్టుకున్న ఇండ్లపై సర్వ హక్కులు మీకే ఉండేలా భద్రత కల్పించి పట్టా ధృవీకరణ పత్రాలు అందించామని పేర్కొన్నారు. మీ కష్టసుఖాల్లో ఉండే వ్యక్తిని మీకు తోడుగా పంపిస్తానననీ, మీ మంచి మనస్సుతో మీరంతా ఒక్కమాటపైకొచ్చి ఆ మంచి మనిషిని ఆశీర్వదించాలని పరోక్షంగా సిద్ధిపేట మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి హరీష్‌రావు కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, సుడా డైరెక్టర్‌ ‌మచ్చ వేణుగోపాలత్‌రెడ్డి, బర్ల మల్లిఖార్జున్‌, ‌తహశీల్దార్‌ ‌విజయ్‌, ‌డిప్యూటీ తహశీల్దార్‌ ‌రాజేశం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply