దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం తెలియందికాదు. దేశ వ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వందలకోట్ల విలువైన రైల్వే ఆస్తులు, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయినాయి.. దగ్ధమైనాయి. ఈ సందర్భంగా జరిగిన ఫైరింగ్‌లో సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో వరంగల్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతిచెందగా, పలువురు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన విషయం తెలియందికాదు. ఇందుకు సంబంధించి వందలాది మంది పోలీసు ఆదుపులో ఉన్నారు. విచిత్రమేమంటే కేవలం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన రిక్రూట్ మెంట్ విధానాన్ని, నాలుగు ఏళ్ళ ఉపాధిని వ్యతిరేకించేందుకు గుమికూడిన యువత హింసాత్మక సంఘటనతో ఇప్పుడు జీవితాంతం ఉద్యోగావకాశాన్ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి సన్నివేశం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగులకు ఇది పెద్ద శాపంగా పరిణమిచ్చేదిగా ఉంది. ఎనిమిదేళ్ళ కింద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రైళ్ళు ఆపినందుకే వారిపైన పెట్టిన కేసులనుండి ఇప్పటికీ వారు కోలుకోలేకపోతున్నారు.
ఈ సంఘటనలో రైల్ బోగీలను కాల్చడంతో కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు ఎన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని కేంద్రంతో పాటు త్రివిధ• దళాల అధిపతులు స్పష్టంచేయడంతో మిలటరీలో చేరాలనుకున్నవారికి ఇప్పుడు ఇదే ఆప్షన్ అయింది. దీనికి తగినట్లు ఉద్యోగాల చేరికకు సంబంధించి వారు షెడ్యూల్కూడా విడుదల చేయడంతో, పోలీసుల అదుపులో ఉండి, కేసులు మోపబడిన యువకుల పరిస్థితి వర్ణనాతీతం. వీరిలో చాలా వరకు నిరుపేద కుటుంబాలనుండి వొచ్చినవారే. తమ కుమారుడు ఏదోవిధంగా ప్రయోజకుడవుతాడని ఎంతో ఆశగా ఇంతకాలం ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పోలీసుల అదుపులో పదుల సంఖ్యలో ఉన్న యువకులను చూసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి తల్లిదండ్రుల దీనపరిస్థితి చూస్తేనే వారు ఎంత కుమిలిపోతున్నారో అర్థమవుతున్నది. ఈ విషయంలో ప్రతిపక్షాలకు చెందిన కొన్ని పార్టీలు ఇచ్చిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందనే వొచ్చిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వెసులబాటును కూడా కల్పించింది. పథకం ప్రకటించినప్పుడు వయస్సు పరిమితి 21 సంవత్సరాల వరకే ఉండింది. చాలాకాలంగా రిక్రూట్మెంట్ లేకపోవడం, కొరోనా పరిస్థితుల దృష్ట్యా నిరుద్యోగ యువతకోసం వయోపరిమితిని 23కు పెంచింది. అయితే ఈ పెంచిన పరిమితి కేవలం ఈ ఒక్క సంవత్సరానికేనని ప్రకటించింది. సమకాలీన సాంకేతిక విషయాలపై అవగాహన కలిగి, ప్రతిభ కలిగిన యువతను ఆకర్షించి, వారిని నైపుణ్యం కలిగిన మానవ వనరుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యంగా చెబుతోంది కేంద్రం. ఈ పథకం కింద మొదటిసారిగా సుమారు 46 వేల నియామకాలు జరిపేందుకు త్రివిధ• దళాల సైనిక అధికారులు అప్పుడే తమ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. దీంతో ఇక ఎట్టి పరిస్థితిలో ఈ పథకం విషయంలో కేంద్రం వెనక్కు తగ్గేదిలేదని స్పష్టమవుతున్నది.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకంపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో మూడు పిటీషన్లు దాఖలైనాయి. దేశ మిలటరీని అవమాన పర్చేదిగా ఈ పథకం ఉందని, నిరుద్యోగంతో తల్లడిల్లితున్న యువతకు ఈ పథకం కేవలం నాలుగు ఏళ్ళు మాత్రమే ఉపాధి కల్పిస్తుందని, ఆ తర్వాత వారు తిరిగి ఉపాధికోసం పాకులాడాల్సి వొస్తుందన్నది పిటీషన్ల వాదన. అయితే దేశంలో ఈ విధానాన్ని సమర్థిస్తున్నవారు కూడా ఉన్నారు. ప్రధానంగా కార్పోరేట్ సంస్థలు మద్ధతు పలుకుతున్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఉపాధి విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వారు చెబుతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహేంద్ర గ్రూప్ చైర్మన్ అనంద్ మహేంద్ర తన ట్విట్టర్లో నాలుగేళ్ళ తర్వాత బయటికి వొచ్చేవారికి తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని ప్రకటించారు.
వ్యవసాయ పనిముట్లు మొదలు వైమానికిరంగ సముదాయాల వరకు అనేక అవకాశాలున్నాయని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. సమర్థులకు బోలెడు ఉద్యోగాలుంటాయన్నారు. జెఎస్డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అగ్నివీరులను ఆదుకునేందుకు తమ సంస్థ సిద్దంగా ఉందన్నారు. అలాగే ఫిక్కా సంస్థ ప్రసిడెంట్ సజీవ్ మెహతా ఈ పథకం చాలా ఆత్యున్నతమైనదన్నారు. అలాగే ఆర్పి గ్రూప్, నిర్వాహకులు గోయంక, టివిఎస్ మోటార్స్ కంపెనీ ఎండి సుదర్శన్ వేణు ఇలా అనేక మంది కార్పోరేట్ సంస్థలు మోదీ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు తమ సంపూర్ణ మద్దతును తెలుపుతుండగా, తాజాగా కర్ణాటకలో మోదీ మాట్లాడుతూ సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా, కాలానుగుణంగా వాటి లాభాన్ని దేశం అందుకుంటుందన్నారు. మనం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అన్యాయంగా అనిపించినా అవి దేశ నిర్మాణానికి ముఖ్యమైనవిగా పేర్కోవటం చూస్తుంటే కేంద్రం ఎట్టిపరిస్థితిలోనూ ఈ పథకం విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయదన్నది స్పష్టమవుతున్నది.