Take a fresh look at your lifestyle.

అ‌క్రమ హాస్పిటల్స్ ‌భరతం పట్టాల్సిందే..

కొరోనా విపత్తు వేళ ప్రజలకు మానవీయ కోణంలో వైద్య సేవలను అందించాల్సిన ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లు రోగుల రక్తాన్ని పీల్చేస్తున్న సంఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయనీ, ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా ప్రైవేటు హాస్పిటళ్ల తీరు మారక పోవడం సహించరాని విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా పరీక్షలపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ ప్రతిపక్షాలు తమకు అందిన సమాచారాన్ని సభకు సమర్పిస్తే, దోషులపై చర్యలకు వెనకాడబోమనీ, ఆ హాస్పిటళ్లను నిర్వహించేవారు ఎంతటి వారైనా, వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. పేలవమైన ఆరోపణలతో ప్రభుత్వం పరువు తీయవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. తెలంగాణలో కొరోనా వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిజానికి అన్ని రాష్ట్రాల కన్నా కొరోనా పరీక్షల విషయంలో ముందే సమర్థమంతమైన చర్యలను తమ ప్రభుత్వమే తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాం..కాంగ్రెస్‌ ‌నాయకుడు భట్టి విక్రమార్క చేసిన సూచనల్లో మంచి సూచనలు పరిశీలిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 సేవలు ఆపత్కాలంలో రోగులకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. అందుకే వాటిని కొనసాగిస్తున్నాం. మాకు ఎటువంటి భేషజం లేదని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. పాలకులు ఎంత ఉదారంగా ఉండాలో, అవసరమైనప్పుడు అంత కఠినంగాను ఉండాలన్నది తమ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కొరోనా కేసుల గురించి వస్తున్న ఆరోపణలకు ఆయన తీవ్రంగా స్పందించారు. కొరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం కప్పి పుచ్చుతోందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అలా దాస్తే మృతుల బంధువులు ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. సంచలనాలను సృష్టించడానికి ఎవరో ఏవో ఆరోపణలు చేస్తే వాటికి ప్రభుత్వం బాధ్యత ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొరోనా పరీక్షల విషయంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించామనీ, రికవరీలో ఎంతో ప్రగతి సాధించామని అన్నారు. తెలంగాణ ఇమేజ్‌ని దెబ్బతీయవద్దని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ఆయన ప్రసంగం భావోద్వేగ పూరితంగా సాగింది. కొరోనా పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ లోపాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే జాతీయ రాజధాని ఢిల్లీలోనే మొదట్లో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఆరోపణలు వచ్చాయి. వైద్య రంగం ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలూ మొదటి నుంచి సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో అసత్యం ఏమీ లేదు. వైద్యులు, హాస్పిటళ్ల సిబ్బంది అందరూ ఒకే తీరులో లేరు. వారిలో పని చేసేవారూ ఉన్నారు. అయితే, సరైన సదుపాయాలు లేకుండా వారిని పని చేయమంటే ఎలా చేస్తారు. ఈ లోపాన్ని గ్రహించడం వల్లనే హాస్పిటళ్ల పని తీరును ఎప్పటికప్పుడు పసిగట్టి నివేదికలను అందజేయడానికి ఐఏఎస్‌ అధికారులతో టాస్క్ ‌ఫోర్స్ ‌నియమిస్తున్నట్టు, టాస్క్ ‌ఫోర్స్ ‌నివేదిక ప్రతులను ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలకు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేసీఆర్‌ ‌వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రతిపక్షాల సూచనలనూ, అభిప్రాయాలనూ పరిగణన లోకి తీసుకోవడం చాలా మంచి పరిణామం. ఇది ఒక్కటే కాదు. అన్ని సమస్యలపైనా ప్రతిపక్షాలను సంప్రదించడం, అవి ఇచ్చే సలహాలను స్వీకరించడం మంచి సంప్రదాయం. మద్యం దుకాణాల విషయంలో కాంగ్రెస్‌ ‌నేతలు చేసిన ఆరోపణలను కూడా ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందనీ, ఎక్కడైనా లోపాలుంటే సరిచేసుకుంటామని అన్నారు. కేసీఆర్‌ ఈ ‌మాదిరి గా మాట్లాడటం ఈ మధ్య కాలంలో కొత్తగా అనిపించింది.

అంతిమంగా ప్రజలకు మేలు జరగాలన్నదే తమ అభిమతమన్నారు. పాలకులు ఏ పార్టీ వారైనా, ప్రభుత్వాలు అనుసరించే విధానాలతో ప్రజలకు మంచి జరిగినప్పుడే వారు కలకాలం గుర్తుండి పోతారు. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి మరణించి పదకొండేళ్ళు పూర్తి అయినా, ఆయన ప్రవేశ పెట్టిన పథకాల్లో ప్రజోపయోగమైనవి ఉన్నాయి కనుకనే ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నారు. 108 సర్వీసులు అత్యవసర వేళ రోగులను హాస్పిటళ్లకు చేర్చేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే, ఇవి కూడా పూర్తిగా లోపరహితంగా పని చేస్తున్నాయని అనలేం. ఫోన్‌ ‌చేసిన వెంటనే అంబులెన్సులు వచ్చి వాలే ఏర్పాట్లు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ఈవిషయమై వచ్చిన ఫిర్యాదులపై ఇటీవల ఘాటుగా స్పందించారు. సంబంధిత అధికారులను హెచ్చరించారు. కొరోనా పరీక్షల విషయంలో కూడా తేలిగ్గా తీసుకోవద్దనీ, జవాబుదారీ ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కొరోనా పరీక్షల విషయంలో వాస్తవాలను గుర్తించకుండా కేవలం రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అంబులెన్స్ ‌సర్వీసులు తెలుగుదేశం హయాంలో స్తంభించి పోయిన సంగతిని ప్రజలు మరవలేదు. ఆరోగ్య శ్రీ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రోగాలకు విస్తరించారు. తెలంగాణలో కొరోనా సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌కు మాత్రం కేసీఆర్‌ ‌తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించింది. కోరనా పరీక్షలు, చికిత్సల విషయంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ‌హాస్పిటళ్ల దందాను అరికట్టగలిగితే రోగులకు ప్రాణ దానం చేసినట్టే. కార్పొరేట్‌ ‌హాస్పిటళ్లను వెనకేసుకొచ్చే ప్రతిపక్షాలు ఉన్నాయనడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. తన, పర భేధం లేకుండా తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకున్నప్పుడే అధికారంలో ఉన్న వారి పారదర్శకత బహిర్గతం అవుతుంది.

Leave a Reply