Take a fresh look at your lifestyle.

అపెక్స్ ‌కౌన్సిల్‌లో తోక ముడిచిన కేసీఆర్

కేంద్రంపై నిందలు మోపి…ఇప్పుడేం చేస్తారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

‌నదీ జలాల పంపిణీపై నిన్నటి దాకా తొడకొట్టిన సీఎం కేసీఆర్‌ అపెక్స్ ‌కౌన్సిల్‌లో తోక ముడిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. నీటి పంపకాల విషయంలో ఇప్పటి వరకూ కేంద్రంపై నిందలు మోపిన కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు తలదించుకుంటున్నారని పేర్కొన్నారు. నీటి పంపకాల విషయంలో తన వైఫల్యాలను అంగీకరిస్తూ కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

అపెక్స్ ‌కౌన్సిల్‌కు ముందే కేసీఆర్‌ ఎజెండా పంపి ఉంటే పోతిరెడ్డిపాడు తదితర అంశాలపై చర్చ జరిగేదన్నారు. సుప్రీంలో కేసు వేసింది కేసీఆర్‌యేననీ, కేసు నడుస్తుండగా ట్రిబ్యునల్‌ ‌వేసే అవకాశం లేదనీ, 6 సంవత్సరాలుగా ట్రిబ్యునల్‌ ‌పేరుతో కేసీఆర్‌ ‌కాలయాపన చేయడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. నిన్నటి దాకా డీపీఆర్‌లు అడిగితే ససేమిరా అన్న కేసీఆర్‌ ఇప్పుడు అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో తోక ముడిచి డీపీఆర్‌లు సమర్పించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ప్రెస్‌ ‌నోట్‌ ‌విడుదల చేసి మంచి పని చేసిందనీ, లేకుంటే కేసీఆర్‌ ‌తప్పుడు లీకేజీలతో పేపర్లలో తప్పుడు వార్తలు రాయించుకునే వారని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply