Take a fresh look at your lifestyle.

వ్యూహాత్మకంగానే వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్‌

ఆలస్యంగానైనా పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో టిఆర్‌ఎస్‌ ఆచితూచి అడుగులు వేసినట్లు కనిపిస్తున్నది. ఈ ఎన్నికలో పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల ఆలోచనకు అందకుండా వ్యూహాత్మకంగా సురభి వాణిదేవీని టిఆర్‌ఎస్‌ ‌రంగంలోకి దింపింది. అయితే ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు, ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఒక దెబ్బకు రెండు పిట్లలన్నట్లుగా కాంగ్రెస్‌, ‌బిజెపి వోటు బ్యాంకుకు చెక్‌ ‌పెట్టేందుకే వాణిదేవి ఎంపిక జరిగినట్లు భావిస్తున్నారు.

రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఇప్పటికే వరంగల్‌, ‌నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపేరు ను టిఆర్‌ఎస్‌ ‌ప్రకటించడంతో ఆయన ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాడు. కాగా హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ‌స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంలో టిఆర్‌ఎస్‌ ‌తీవ్ర జాప్యం చేసింది. ఆ పార్టీనుండి పోటీచేసేందుకు సరైన అభ్యర్థియే లేడంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో అనూహ్యంగా టిఆర్‌ఎస్‌, ‌నామినేషన్‌ల గడవు చివరి రోజున వాణీదేవి పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది ఆ పార్టీ. కాగా ప్రముఖ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ఈ ‌స్థానంనుండి మరోసారి పోటీలో నిలబడ్డారు. అయితే టిఆర్‌ఎస్‌ అభ్యర్థి విషయంలో జాప్యం చేస్తుండడంతో ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌కు మద్దతిస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాని, అనూహ్యంగా టిఆర్‌ఎస్‌ ‌దివంగత ప్రధాని పి.వి. నరసింహారావు కుమార్తెను ప్రకటించడంద్వారా అటు కాంగ్రెస్‌కు, ఇటు బిజెపికి చెక్‌ ‌పెట్టినట్లైంది.

రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి చివరివరకు కాంగ్రెస్‌ ‌వాదిగానే ఉన్న మాజీ ప్రధాని పి.వి కూతురు కావడంతో సహజంగానే పి.వి. అభిమానులు, సానుబూతిపరులతో పాటు కాంగ్రెస్‌ ‌వాదులు పలువురు ఆమె వైపే మొగ్గుచూపే అవకాశాలుంటాయి. ఈ విషయంలో సిఎం చంద్రశేఖర్‌రావు చాలా ముందస్తు ఆలోచనతోనే ఉన్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ను నైతికంగా దెబ్బతీస్తూ పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాలను రాష్ట్రంలో ఈ ఏడాదంతా నిర్వహిస్తుండడం, ఆ ఉత్సవా నిర్వహణలో పివి కూతురు వాణీదేవి సూచనలు, సలహాలను తీసుకోవడం ద్వారా ఆమెకు తగిన ప్రాధాన్యతను కల్పించడం, ఆప్పట్లోనే రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడం లాంటి చర్యలద్వారా ఒక ఎంఎల్‌సి స్థానాన్ని ఆమెకు కేటాయించాలన్న ఆలోచన ముందునుండే కెసిఆర్‌కు ఉండి
ఉంటుందనుకుంటున్నారు.

అందుకే అభ్యర్థి విషయంలో పెద్దగా కసరత్తు చేయకుండానే నామినేషన్‌ల గడవు చివరివరకు సస్పెన్స్‌లో పెట్టి ఆఖరి క్షణంలో ఆమె పేరును ప్రకటించి ప్రతిపక్షాలను విస్మయంలో పడేశారు. జెఎన్‌టియు నుంచి ఫైన్‌ ఆర్టస్ ‌లో డిప్లొమా చేసిన వాణి సురభి ఎడ్యుకేషనల్‌ ‌సొసైటీ ద్వారా పలు విద్యాసంస్థలను నెలకొల్పి ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దడమేకాక, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నది.

ఇక్కడ బిజెపి అభ్యర్థిగా రంగంలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో బ్రాహ్మణులు సహజంగానే తమ సామాజిక వర్గీయుడికి వోట్లు వేసే అవకాశాన్ని దెబ్బ తీయడంద్వారా బిజెపికిహొవోట్లను తగ్గించవచ్చని టిఆర్‌ఎస్‌ ఎత్తుగడలో భాగంగానే వాణీదేవిని ఎంపిక చేయడమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉంటే పివి పేరు వాడుకుని రాజకీయ లబ్ధిపొందాలని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఎత్తుగడంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వాస్తవంగా పివిపై అంత ప్రేమ ఉంటే గెలుస్తుందో లేదో తెలియని స్థానంలో నిలబెట్టి, ఫలితాలను దైవాధీనానికి వదిలేసేకన్నా, రాజ్యసభ స్థానాన్నో, లేదా గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీగా చేసి ఉండాల్సిందని పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌లాంటి వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక వేళ వాణీదేవి ఓడిపోతే ఆ ఓటమిని తన ఖాతాలో కాకుండా పివీ కుటుంబ ఖాతాలో వేసి చేతులు దులుపుకోవాలని కెసిఆర్‌ ఎత్తుగడని ఆ పార్టీ ఎంపి రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోటీ చేయకుండా పీవీ గౌరవాన్ని కాపాడాలని వారు పిపీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని తెరాస కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్న డి . దేవీప్రసాద్‌ ‌బిజెపి అభ్యర్థి, న్యాయవాది అయిన రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. అయితే మరోసారి ఈ స్థానాన్ని కోల్పోకూడదన్న ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్‌ ఉం‌ది. అందుకే అటు కాంగ్రెస్‌ అభిమానుల, ఇటు గతంలో బిజెపి అభ్యర్థి బ్రాహ్మణుడు కావడంతో అప్పుడు గంపగుత్తాగా పడిన బ్రాహ్మణ వోటర్లను ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌వైపు ఆకర్షించడం ద్వారా రెండు పార్టీలకు చెక్‌ ‌పెట్టాలన్న ఎత్తుగడలో భాగమే వాణీదేవి ఎంపికగా భావిస్తున్నారు.

Leave a Reply