Take a fresh look at your lifestyle.

గిరిజన సర్పంచ్‌ను విడుదల చేయండి డీజీపీని కలిసిన టీ కాంగ్రెస్‌ ‌నేతలు

భద్రాచలం పులిగొండల సర్పంచ్‌ను విడుదల చేయాలని డీజీపీ మహేందర్‌ ‌రెడ్డికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ ఇచ్చారు. మంగళవారం సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌లు డీజీపీని కలిసి రిప్రెసెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ… భద్రాచలం పులిగుండాకు చెందిన
గిరిజన సర్పంచ్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని, మావోయిస్టులకు సహకరిస్తున్నారని  సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్ట్ ‌చేయడం దారుణమని అన్నారు. పోలీసులు చెప్పినట్లు మావోయిస్టు భావజాలం ఉంటే ఎన్నికల్లో చలపతి పోటీ చేసేవారు కాదని భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి చలపతి అని, అర్ధరాత్రి అన్నం కోసం ఎవరు వచ్చినా అన్నం పెడతామని అన్నారు. అడవిబిడ్డ, బోయకులానికి చెందిన గిరిజన వ్యక్తి చలపతి ఇలాంటి సర్పంచ్‌లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరిస్తే కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని అన్నారు. వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ముంపుకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

కేసీఆర్‌ ‌దొరగారి పరిపాలనా వైఫల్యంపై…
పెద్ద గ్రంథమే రాయవచ్చు : విజయశాంతి

: కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌పాలనపై మరోసారి మాజీ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ చైర్‌ ‌పర్సన్‌, ‌ఫైర్‌ ‌బ్రాండ్‌ ‌విజయశాంతి విమర్శల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనమని మండిపడ్డారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్‌ ‌కూడా బలైందని ధ్వజమెత్తారు. ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అత్యంత ప్రధానమైనదిగానూ, కోవిడ్‌ ‌చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ హాస్పిటల్‌ ‌పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా, అక్కడ ఫైర్‌ ‌సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందని విమర్శించారు. ఇక కోవిడ్‌ ‌చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వ హాస్పిటళ్లు, ఇటు ప్రయివేట్‌ ‌హాస్పిటళ్లలోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యమన్నారు. ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్‌ ‌టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి ఉందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్‌ ‌దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చని అన్నారు. ఇకనైనా మేలుకోండి పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దండని సూచించారు.

Leave a Reply