బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
కృష్ణుడు, బలరాముడూ కూడా స్వయంవర వేడుకలకు వచ్చారు. కృష్ణుడు రహస్యంగా బలరాముని చెవిలో పాండవులు అదుగో అంటూ చూపించాడు. పాండవులు సజీవంగా ఉన్నందుకు బలరాముడు ఎంతగానో సంతోషించాడు. రాకుమారులందరూ ఒక్కొక్కరే వెళ్ళి మత్య్సయంత్రాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. విఫలులవుతున్నారు. సాల్వ, శల్య, సునీధప్రభువులూ, అశ్వత్థామ, దుర్యోధనుడూ, కర్ణుడూ కూడా ప్రయత్నించి తిరిగివచ్చారు. శిశుపాల, జరాసంధులు కూడా ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. చివరకు వేదవేదాంగ విదులందరూ కూర్చునే చోట నుండి ఒక మహోన్నత శరీరుడు లేచాడు. క్షత్రియ వీరులు చేయలేనిది ఈ విప్రుడు చేస్తాడా అంటూ అందరూ ఆశ్చర్యపడసాగారు. కొందరు పెదవి విరిచారు. విప్రులు మాత్రం పరశురామునీ, అగస్తునీ తల్చుకుంటూ ఆనందంగా చూస్తూవున్నాడు. వారు ఆశీర్వదిస్తూ వుంటే అర్జునుడికి మరింత ఉత్సాహం కలిగింది. ధనుస్సును సమీపించాడు. పార్వతీపతికి నమస్కరించాడు. రెప్పపాటులో ధనుస్సును ఎక్కుపెట్టడమూ అయింది. అయిదు బాణాలూ తొడిగి మత్స్యయంత్రాన్ని ఛేదించిన తీరు ఒక ఇంద్రజాలంలా సాగింది. విప్రులందరూ హర్షధ్వానాలు చేశారు. వందమాగదులు జయజయధ్వానాలు గావించారు.
ద్రౌపది చిరునవ్వులు చిందిస్తూ పూలదండను అర్జునుడి మెడలో అలంకరించింది. పూలవానకురిసింది సభాభవనంలో ద్రౌపదీ సహితుడై అర్జునుడు రంగభూమినుండి నిష్క్రమించగానే, రాజకుమారులందరూ ఒక రాజకన్య సామాన్య విప్రచాలుని వరించడం సహించలేకపోయారు. కత్తులు దూశారు. అప్పుడు భీముడు ఒక పెద్ద వృక్షాన్ని పెకిలించి వారి ముందు నిలిచాడు. అర్జునుడు ధనుస్సు ఎక్కుపెట్టి ఎదురునిల్చిన కర్ణుడితో తలపడ్డాడు. కొంతసేపు పోరు సాగిన తరువాత కర్ణుడు అర్జునుని పరశురామునిలా యుద్ధం చేస్తున్నావంటూ ప్రశంసించాడు. బ్రహ్మవేత్తలతో యుద్ధం మంచికాదంటూ కర్ణుడు నిష్క్రమించాడు.
(మిగతా..వొచ్చేవారం)