Take a fresh look at your lifestyle.

‘‌స్వరాజ్యం’ మాటే తుపాకీ తూట

‘‘తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల కోసమే తన తనువని, బడుగులే తన బంధువులని పేదోడి గుండెలో నిలిచిన తెలంగాణ సాయుధ దళ పోరాట ధీర వనిత మన కామ్రేడ్‌ ‌మల్లు స్వరాజ్యం.’’

(తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అమరత్వానికి స్పందనగా)

మహిళంటే అబలంటే కాదని, వనితంటే వంటింట కుందేలు కాదని, పిడికిల బిగించడం పురుష లక్షణం మాత్రమే కాదని, మహిళ కూడా ఆయుధంతో ఘర్జించగలదని రుజువు చేసిన ‘తెలంగాణ ఝాన్సీ రాణి’ మన మల్లు స్వరాజ్యం. తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల కోసమే తన తనువని, బడుగులే తన బంధువులని పేదోడి గుండెలో నిలిచిన తెలంగాణ సాయుధ దళ పోరాట ధీర వనిత మన కామ్రేడ్‌ ‌మల్లు స్వరాజ్యం. 1931లో నాటి హైదరాబాద్‌? ‌స్టేట్‌లోని నల్గొండ జిల్లా, సూర్యపేట తాలుకా, కర్విరాల కొత్తగూడెం గ్రామంలోని భూస్వామ్య కుటంబంలో భీమిరెడ్డి చుక్కమ్మ, రామిరెడ్డి దంపతులకు జన్మించిన మల్లు స్వరాజ్యం 5వ తరగతి వరకు చదివి 10వ ఏటనే మాక్సిమ్‌ ‌గోర్కీ రచించిన ‘మదర్‌’ ‌పుస్తకం చదివి ప్రభావితం అయ్యారు. మహాత్మాగాంధీ చేపట్టిన స్వతంత్ర పోరాటం ‘సత్యాగ్రహం’ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబ సభ్యుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న స్వరాజ్యం సిపిఐ శాఖ ‘ఆంధ్ర మహిళా సభ’ పిలుపుతో 11వ ఏటనే నిజాం రజాకార్ల విధ్వంసకర దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ గళం ఎత్తి పిడికిల బిగించారు. కుటుంబ ఆచారాలకు వ్యతిరేకంగా, తన బంధువర్గం నిరాకరించినా జడవక వెట్టిచాకిరి దురాచారానికి వ్యతిరేకంగా తమ భూములలో పండిన ధాన్యాన్ని ఉచితంగా నిరుపేదలకు వితరణలు చేశారు. కమ్యునిస్ట్ ‌పార్టీ విడిపోయిన తరువాత సిపియంలో కొనసాగారు.

తెలంగాణ సాయుధ పోరాట దళ కమాండర్‌(1945-51)‌గా ఆయుధాలు చేతబూని నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ నిజాం రాక్షస పాలన, జమిందారీ వ్యవస్థను వ్యతిరేకించారు. నాటి నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంతో పట్టి ఇచ్చిన వారికి రూ: 10,000/- నగదు కూడా ప్రకటించడం ఆమె ధీరత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నది. మల్లు స్వరాజ్యం జీవితాన్ని సిపియం నాయకులైన భర్త మల్లు వెంకటనరసింహా రెడ్డి, సోదరుడు భీంరెడ్డి నరసింహ రెడ్డి (నాటి యంపి) ఎంతగానో ప్రభావితం చేశారు. భర్త మల్లు వెంకట నరసింహ రెడ్డి సిపియం పాలిట్‌ ‌బ్యూరో సభ్యుడిగా, నల్గొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా సేవలు అందించిన విషయం మనకు తెలుసు. వెట్టిచాకిరి, జమిందారీ వ్యవస్థ, నిరంకుశ నిజం రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా తన జీవితాన్ని ధారపోసిన మల్లు స్వరాజ్యం 1978, 1983 ఎన్నికలలో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి యంయల్‌ఏగా (1978-1984) ఎంపికై పేదల పక్షపాతిగా వ్యవహరించారు. వామపక్ష మహిళాపత్రిక ‘చైతన్య మనవి’ ఎడిటోరియల్‌ ‌బోర్డు సభ్యురాలిగా పని చేశారు. ‘నా మాట తుపాకి తూట’ పేరుతో ఆత్మకథను రచించిన మల్లు స్వరాజ్యం ‘ఐద్వా’లో క్రియాశీలంగా సేవలణదించారు.

20వ శతాబ్దపు సామాజిక-రాజకీయ తెలంగాణ సాయుధ పోరు చరిత్రలో మల్లు స్వరాజ్యం పేరు సువర్ణాక్షరాల్లో లిఖించబడి ముందు వరసలో ఉంటుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా బడుగుల సేవలో తెలంగాణ జిల్లాలను విస్తృతంగా పర్యటించి సమకాలీన సమస్యల సాధనకు చివరి క్షణం వరకు అవిశ్రాంతంగా తపన పడ్డారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెకు తల్లిగా, పేదలకు ఆశాదీపంగా, సిపియం పార్టీకి క్రమశిక్షణగల నిస్వార్థ సేవకురాలిగా బహుపాత్రలను సమర్థవంతంగా నిర్వహించిన స్వరాజ్యం 91వ ఏట 19 మార్చి 2022న బహుఅవయవ వైఫల్యంతో హైదరాబాదులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మరణం తరువాత తన పార్థివ దేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేయాల్సిందిగా వీలునామా సంతకం చేశారు. ఎలాంటి అంతిమ సంస్కారాలు లేకుండా వారి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయన నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు అప్పగించనున్నారు. దేశ మహిళలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతీయువకులకు ఉక్కు సంకల్పం కలిగిన మల్లు స్వరాజ్యం నిస్వార్థ జీవితం ఓ నిత్య ప్రేరణ కావాలి, ఆమె పోరాట పటిమ దీపస్తంభం కావాలి.

Leave a Reply