- సాగుపై రైతులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలి
- వైద్య, ఆరోగ్య రంగంపై సిఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
- డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
- సిద్ధిపేట జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట జిల్లాలో 50వేల ఎకరాలలో పామాయిల్ సాగుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామనీ, పామాయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వవస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాలులో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..పామాయిల్ పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తుందనీ, పామాయిల్ సాగుకు చీడ పీడల బెడద ఉండదనీ, అటవీ జతుల బాధులు అసలే ఉండవన్నారు. పామాయిల్ సాగుపై కరపత్రాలతో పాటు బహుళ ప్రసార మాధ్యమాల ద్వారా పామాయిల్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలనీ ప్రజాప్రతినిధులకు సూచించారు. పామాయిల్ పంట సాగుతో పాటు పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక ఆదాయం వస్తుందనీ, పామాయిల్ పంట, పట్టు పురుగుల పెంపకంను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, రైతులకు కర్ణాటక, ఖమ్మం జిల్లాలకు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామన్నారు.
పంట కల్లాలకు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన పూర్తి లక్ష్యం సాధించాలనీ, పంట కల్లాల నిర్మాణ ప్రగతిపై ఎంపిపిలు, జడ్పిటిసిలు క్షేత్ర స్థాయిలో సమీక్షించాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్య రంగంలో గుణాత్మ•మైన మార్పులు వచ్చాయనీ, వైద్య ఆరోగ్య రంగం పై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకంటే ఆధునాతన సాంకేతికతతో కూడిన డయాగ్నొస్టిక్ సెంటర్‌ను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సిద్ధిపేటలోనే డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 2.5 కోట్ల రూపాయతో ఈడయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామనీ, ఈ డయాగ్నొస్టిక్ సెంటర్‌తో పూర్తి ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రక్త, మూత్రం ఇచ్చిన 12 గంటల్లో పరీక్ష ఫలితాలు ఇవ్వనున్నారనీ, పరీక్ష ఫలితాలను మానవ ప్రమేయ లేకుండా డయాగ్నొస్టిక్ యంత్రమే నేరుగా సంబంధిత వ్యక్తి చరవానీకి పంపడంతో పాటు ఆరోగ్య కేంద్రంకు పంపుతామన్నారు.
15 రోజుల్లో రూ.2 కోట్లతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎక్స్- రే, ఈసిజి, 2డి ఎకో సేవలు అందుబాటులోకి తెస్తున్నామనీ, సిద్దిపేట, గజ్వేల్‌లో ఉన్న డయాలసిస్ కేంద్రాలలో పడకల సంఖ్యను పెంచుతామనీ, అలాగే, సిద్దిపేట ఐసియూలో ప్రసుతం ఉన్న 20 పడకలను త్వరలో 40కి పెంచుతామన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హార్ట్స్టెబిలైజేషన్లో వైద్యులకు తర్ఫీదును ఇచ్చామనీ, కావాల్సిన పరికరాలను సమకూర్చామన్నారు. జిల్లాలో అప్పుడే పుట్టిన పిల్లలకు సాధారణంగా వచ్చే 33 రకాల యూనివర్సల్ స్క్రీనింగ్‌లు నిర్వహించనున్నామనీ, జిల్లా ప్రజల సౌకర్యార్థం రూ.2.58 లక్షలతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచిత సిటీ స్కాన్ సేవలు అందించున్నట్లు తెలిపారు.
పేద ప్రజల సౌకర్యార్థం దృష్టి సమస్యలను సవరించేందుకు, శస్త్ర చికిత్సలు చేసేందుకు సిఎస్ఆర్ నిధులతో రూ.5 కోట్లతో ప్రతిష్ఠాత్మక ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రినీ ఏర్పాటు చేశామనీ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి అనుబంధంగా 10 సబ్ సెంటర్లనూ ఏర్పాటు చేశామనీ, వీటిని సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపి ప్రారంభించాలన్నారు. జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాకలలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ సంబంధిత వైద్యాధి•కారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమనీ, వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు తీర్మానం చేశారు. సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవనేని రఘునందన్‌రావు, వొడితెల సతీష్‌కుమార్, రసమయి బాల్కిషన్, కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఎంపిపిలు, జడ్పిటిసి సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.