Take a fresh look at your lifestyle.

ఉద్యోగ ఉపాధుల కోతతో సుస్థిరాభివృద్ధికే విఘాతం

‘‘‌కొరోనా మహమ్మారి వ్యాప్తికి పూర్వమే ప్రపంచ ఆర్థిక ప్రగతి మందగించడం చూశాం. కోవిడ్‌-19 ‌విపత్తు అనంతరం విశ్వమానవాళిలో నిరుద్యోగం, పేదరికం తీవ్రంగా ప్రభావితం కావడం చూస్తున్నాం. ఉద్యోగ ఉపాధుల ద్వారా సేవలందించే ప్రజల్లో కరోనా అనంతరం 2020 ప్రథమార్థంలో 8.8 శాతం పని గంటలు తగ్గడంతో 255 మిలియన్ల ఉద్యోగుల శ్రమశక్తికి సమానం నిరుద్యోగం పెరగడం, 2020 చివరి నాటికి 14 శాతానికి పని గంటలు పడిపోవడంతో 400 మిలియన్ల శ్రమశక్తికి సమానంగా నిరుద్యోగం పెరగడమే కాకుండా పేదరికం కూడా పెరిగిందని 2021 నివేదిక తెలియజేయడం గమనించాలి.’’

(యుయన్‌ ‘‌సస్టేనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌గోల్స్-2030’ ‌నివేదిక-2021 ఆధారంగా)
2015లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ‘2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు’ చేపట్టాలనే సదుద్దేశంతో 17 ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను ‘2030 ఎజెండా’ అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం – మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలు తీసుకోబడినవి. అర్హతకు తగిన పని కల్పన జరిగినపుడే అన్ని వర్గాల ప్రజల సుస్థిర ఆర్థికాభివృద్ధి సులసాధ్యమని ఐరాస రూపొందించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’లో 8వ లక్ష్యంగా ‘అర్హతకు తగిన పని – సుస్థిర ఆర్థికాభివృద్ధి (డీసెంట్‌ ‌వర్క్ అం‌డ్‌ ఎకనమిక్‌ ‌డెవలప్‌మెంట్‌)’ అం‌శాన్ని తీసుకొని అధ్యయనం చేశారు.

కొరోనా మహమ్మారి వ్యాప్తికి పూర్వమే ప్రపంచ ఆర్థిక ప్రగతి మందగించడం చూశాం. కోవిడ్‌-19 ‌విపత్తు అనంతరం విశ్వమానవాళిలో నిరుద్యోగం, పేదరికం తీవ్రంగా ప్రభావితం కావడం చూస్తున్నాం. ఉద్యోగ ఉపాధుల ద్వారా సేవలందించే ప్రజల్లో కరోనా అనంతరం 2020 ప్రథమార్థంలో 8.8 శాతం పని గంటలు తగ్గడంతో 255 మిలియన్ల ఉద్యోగుల శ్రమశక్తికి సమానం నిరుద్యోగం పెరగడం, 2020 చివరి నాటికి 14 శాతానికి పని గంటలు పడిపోవడంతో 400 మిలియన్ల శ్రమశక్తికి సమానంగా నిరుద్యోగం పెరగడమే కాకుండా పేదరికం కూడా పెరిగిందని 2021 నివేదిక తెలియజేయడం గమనించాలి. కొరోనా విజృంభనతో అసంఘటిత, మహిళ, యువ వర్గాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. క్రమంగా కొరోనా టీకాలు అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక ప్రగతి వేగం ఊపందుకోవడం సంతోషదాయకం. 2019లో ఆర్థికవృద్ధి 1.3 శాతం పెరుగగా, 2020లో 4.6 శాతం పడిపోవడం చూస్తున్నాం. కొన్ని దేశాల్లో కోవిడ్‌-19 ‌పూర్వపు ఆర్థిక స్థితులు రావడానికి మరో 2 ఏండ్లు పట్టవచ్చుని వింటున్నాం. ఐరాస తలపెట్టిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 ప్రకారం ఆర్థికవృద్ధి 7 శాతం ఉండాల్సి ఉండగా వాస్తవ ఫలితాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. 2020లో నిరుద్యోగం గత ఏడాదితో పోల్చితే 1.1 శాతం తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల ఉద్యోగులు, 81 మిలియన్ల కార్మిక వర్గాలు పని కోల్పోవడం జరిగింది. 2020 వివరాల ప్రకారం మహిళల్లో 5.0 శాతం, యువతలో 8.7 శాతం ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగ ఉపాధుల్లో మార్పులతో లింగ అసమానతలు పెరగడం చూశారు. పిల్లలు బడులకు దూరంగా ఉండడంతో బాలకార్మికులుగా మారడం, బాల్యవివాహాల ఉచ్చులో పడడం జరిగింది.

ప్రపంచ అసంఘటిత రంగంలో 60.2 శాతం ఉద్యోగ ఉపాధులు (2 బిలియన్లు) ఉండగా, వారికి ఉద్యోగ సామాజిక భద్రత, కనీస వేతనాలు, ఆరోగ్యకర పని వాతావరణాల వసతులు లేకపోవడం గమనించారు. కోవిడ్‌-19 ‌కోరల్లో చిక్కి నలిగిపోయిన ప్రధాన రంగంగా పర్యాటక విభాగం 2019 నుంచి 2020 వరకు విదేశీ పర్యాటకులు 1.5 బిలియన్ల నుంచి 381 మిలియన్లకు పడి పోవడంతో 74 శాతం పర్యాటకం తగ్గడం, దాదాపు 120 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోవడం జరిగింది. పర్యాటక రంగం తీవ్ర ప్రభావానికి లోనైన కారణంగా 1.3 ట్రిలియన్‌ ‌డాలర్ల పర్యాటక వ్యాపారం పడిపోయింది. 2019లో 22 శాతం యువత విద్య, ఉద్యోగం, శిక్షణలకు దూరంగా ఉన్నారు. ఆదాయ భద్రత, కనీస వేతనాలు, సామాజిక రక్షణ కలిగిన ఉద్యోగాలను ‘అర్హతకు తగిన ఉద్యోగం’ అంటాం. మహిళలతో పోల్చితే పురుషులు 12.5 శాతం అధిక ఆదాయాన్ని పొందడం 40 దేశాల్లో గమనించబడింది. ప్రపంచ స్త్రీ పురుష ఆదాయ వ్యత్యాసం 23 శాతం ఉందని, దీనిలో సమానత్వ సాధనకు మరో 68 ఏండ్లు పడుతుందని ఐరాస అంచనా వేసింది. ఉపాధులు చేజిక్కించుకోవడంలో పురుషులు 94 శాతం, స్త్రీలు 63 శాతం సఫలం అవుతున్నారు.

యువతలో విద్య, నైపుణ్య వికాసనం సత్వరమే పెంచే చర్యలు తీసుకొనుటతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత, సరైన వేతనం, సామాజిక భద్రత, పని ప్రదేశంలో ఆరోగ్య భద్రతా చర్యలు తీసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మానవాళికి లింగ భేదం లేకుండా తగిన వయస్సులో అర్హతకు తగిన యోగ్యమైన ఉద్యోగం చేసే అవకాశాలను కల్పించినపుడు ఉద్యోగుల కార్యదక్షత పెరిగి సుస్థిర సమగ్రాభివృదికి బీజాలు పడతాయి. మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చినపుడు పురుషుల కన్న మెరుగ్గా పని తీరును ప్రదర్శించడంతో క్రమంగా ఉద్యోగ, వేతన రంగంల్లో లింగ సమానత్వం సమకూరుతుంది. కరోనా తీవ్రత తగ్గిన వేళ దేశవిదేశ పర్యాటక దారులు సత్వరమే తెలుచుకోని, ఆ రంగంలో ఉద్యోగాలు క్రమంగా పెరుగుతూ పూర్వ స్థితికి తీసుకు రావాలి. విశ్వ మహమ్మారి లోకాన్ని కమ్మిన వేళ ప్రపంచ మానవాళి ఆందోళనలకు లోనవుతూ సామాజిక, మానసిక, ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయారు. వైరస్‌ ‌మబ్బులు తొలుగుతున్న తరుణంలో మానవాళి తమ తమ నైపుణ్యాలను పెట్టుబడిగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎదుగుతూ అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి దిశలో పయనించుట తథ్యమని తెలుసుకోవాలి.

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply