Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌లో సస్పెన్షన్లు షురూ

Suspensions Start in TRS Party

  • మాట వినని నేతలపై వేటుకు వెనకాడని గులాబీ బాస్‌
  • ‌బరిలో కొనసాగుతున్న రెబల్స్
  • అధికార పార్టీ అభ్యర్థుల వెన్నులో వణుకు

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ టీఆర్‌ఎస్‌ ‌రెబల్స్‌పై ఆ పార్టీ అధిష్టానం కొరడా ఝళిపించింది. మాట వినని నేతలపై వేటు వేసే ప్రక్రియను ప్రారంభించింది. మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌నుంచి పోటీ చేయాలని భావించిన ఆశావహుల సంఖ్య ఆ పార్టీ ఆశించిన సంఖ్య కంటే మరీ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌టికెట్లు దక్కని నేతలను బుజ్జగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పక్షంలో భవిష్యత్తులో నామినేటెడ్‌ ‌పదవులతో పాటు కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మాట వినని నేతలపై వేటుకు కూడా వెనకాడబోమనీ తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని కూడా స్పష్టం చేశారు. అయితే, ఈ టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలను దారికి తెచ్చుకునేందుకు ఈ హెచ్చరిక కొంత మేర ఫలించినప్పటికీ కొన్ని జిల్లాలలో మాత్రం అసమ్మతులు ససేమిరా అంటున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడి పనిచేస్తే చివరికి తమకు టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ రెబల్స్‌గా బరిలోకి దిగాం కదా పోరాడితే పోయేదేముంది అనే భావనతో అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా ప్రచారం నిర్వహిస్తూ వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు సైతం ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలుగా వారికి సైతం ప్రజలలో పలుకుబడి ఉండటంతో వారి పలుకుబడిన తమ విజయానికి ఎక్కడ ఆటంకంగా మరుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, హుజూర్‌నగర్‌, ‌నల్లగొండ, కోదాడ మున్సిపాలిటీలలో అధికార పార్టీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులకు రెబల్స్ ‌బెడద ఎక్కువగా ఉంది.

ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి రెబల్స్ ‌వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఎంతగా నచ్చజెప్పినప్పటికీ రెబల్స్ అధిష్టానం మాటను ఖాతరు చేయలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీలలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో ఉన్న నేతలపై సస్పెన్షన్‌ ‌వేటు వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు, మరోవైపు, ఇదే పరిస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని కొల్లాపూర్‌ ‌మున్సిపాలిటీలోనూ నెలకొంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన పలువురు నేతలు ఎన్నికల బరిలో కొనసాగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి కూడా టీఆర్‌ఎస్‌ ‌రెబల్స్‌గా ఉన్న వారు ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే, వీరి పట్ల పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కొల్లాపూర్‌లో రెబల్స్‌గా బరిలోకి సైతం దారికి వస్తున్నారని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రకటించారు. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా రెబల్స్‌ను బరిలోకి దింపిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు కావడం గమనార్మం. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్‌ ‌రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగి న నేతలకు మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తుండటం ఆయా మున్సిపాలిటీలలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు లేని మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ ‌రెబల్స్‌కు మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ‌రెబల్స్ ‌గెలిచిన పక్షంలో వారిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముందు జాగ్రత్తతో వారిని ఎలాగైనా ఓడించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలపై, గెలిపించే బాధ్యతను అక్కడి మంత్రులకు పార్టీ అధినేత కేసీఆర్‌ అప్పగించడంతో తమ పదవులు కాపాడుకోవడం కోసమైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న పట్టుదలతో మంత్రులు ఉన్నారు.

Tags: Suspensions Start,TRS Party, trs party rebels, municipal elections

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!