Take a fresh look at your lifestyle.

సూర్య గమనం సంక్రాంతి

విష్ణుమూర్తి రాక్షసజాతిని అంతమొందించిన రోజు మకర సంక్రాంతి. తమను అనేకరకాలుగా హింసిస్తోన్న అసురుల చర్యలకు తాళలేక దేవతలు మొర పెట్టుకోగా, విష్ణుమూర్తి రాక్షసులను హతమార్చి మందరపర్వతం కింద పాతిపెట్టాడు. కనుకనే మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకుంటాం. అశుభాలు, అపజయాలను తుదముట్టించిన దినంగా భావిస్తారు. అందుకే ఉదయానే నదీస్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకుంటారు. నది గానీ చెరువు గానీ దగ్గర్లో లేకుంటే ఇంట్లోనే స్నానం చేసి సూర్యనమస్కారం చేస్తారు. ఇలా చేయడంవల్ల మనసు స్వచ్ఛమై ప్రశాంతత చేకూరుతుంది. మకర సంక్రాంతికి శాస్త్రీయంగా ఓ ప్రత్యేకత వుంది. అదేమంటే… మొత్తం నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. అన్నీ కలిసి 108 పాదాలు. అవి 12 రాశుల కిందికొస్తాయి. సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆరోజు మొదలు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు ఉత్తరాయణం. ఉత్తరాయణకాలం దేవతలకు పగటిపూట. ఈ కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ పుణ్యకాలం స్వర్గప్రాప్తినిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ కాలంలో మరణాన్ని కోరుకున్నాడు.

సంక్రాంతి – సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల లోకీ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

దక్షిణాత్యులకు అందునా తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతి. ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ అనే వాక్యానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది, ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటకలో సంక్రాంతి అనిబీ తమిళనాడులో పొంగల్‌ అనిబీ మహారాష్ట్ర, గుజరాత్‌ ‌లలో మకర్‌సంక్రాంతి అనిబీ పంజాబు, హర్యానాలలో లోరీ అని వ్యవహరించే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి, రెండవ రోజును సంక్రాంతి, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు.  శ్రమ ఫలించి పంట ఇంటికి వచ్చే సమయం కనుక రైతులు సంక్రాంతిని మరీ  ఇష్టంగా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రమణం, కనుమ – ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. గంగిరెద్దులు, బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే – అంటే ధనుర్మాసం ఆరంభం నుండే – ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి.

సంక్రాంతి పండుగ ముందురోజు భోగి. భోగినాడు తెల్లవారకముందే ఇళ్ళముందు భోగిమంటలు వేస్తారు. ఇళ్ళలో పేరుకుపోయిన కర్రలు, త్వరగా దహనమయ్యే వస్తు సామగ్రి, లాంటివి భోగిమంటల్లో వేస్తూ తమ జీవితాల్లో కొత్తదనం రావాలని కోరుకుంటారు. అలాంటి చెక్క సామగ్రి కనుక లేకుంటే ఎండిపోయిన కట్టెలతో భోగిమంట వేసి వినోదిస్తారు. చలి కాచుకోవడంతో పాటు మనసుల్లో చేరిన చెడును విడిచి పెట్టాలనేది భోగిమంటలు వేయడం వెనుక దాగున్న అంతర్‌సూత్రం. భోగినాడు స్త్రీలు గొబ్బి గౌరీ వ్రతం చేస్తారు. సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు.
రెండో రోజు సంక్రాంతి – పెద్ద పండుగ. కొత్త అల్లుళ్ళు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తారు. మరదళ్ళు ఆటపట్టించడం ఆనవాయితీ… కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు ఆడపిల్లల పట్టు పరికిణీలి.. పేరంటాలు,  బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణ. పిండివంటలు, కొత్త బట్టలు, విందులు, ఆలయ దర్శనలు, బంధువుల సందడితో ఇళ్ళు కళకళ లాడతాయి.

సంక్రాంతి తర్వాతి రోజు కనుమ. ఇది ముఖ్యంగా పాడి పశువులను ఆరాధించే పండుగ. రైతులు నిత్యం తమకు సహకరించే పాడి పశువులకు కృతజ్ఞత తెలియజేస్తారన్నమాట. ఉదయాన్నే పశువుల కొట్టాలను, పశువులను శుభ్రంచేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొడ్తారు. అందాకా ముగ్గుల్లో వుంచిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పక్కన వుంచుతారు. వాటి మంటతో పొంగలి తయారుచేసి దేవుడికి నైవేద్యం సమర్పించి కొంత ప్రసాదంగా సేవిస్తారు. మిగిలిన పొంగలిని పొలంలో చల్లుతారు. దీన్నే ‘పొలి చల్లడం’ అంటారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారు. కనుమ మర్నాడు ముక్కనుమ. ఆరోజున మాంసాహారం అలవాటున్నవారు ప్రత్యేకంగా చేసుకుని ఇష్టంగా తింటారు.
– నందిరాజు రాధాకృష్ణ,  98481 28215

Leave a Reply