సూర్యాపేట, సెప్టెంబర్11, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి 65పై పోలీసు నిఘా కట్టుదిట్టం చేశామని,పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ పెంచినట్లు జిల్లా ఎస్పి ఆర్.భాస్కరన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతు జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వీటి నివారణకు ట్రాఫిక్ ఇంజనీరింగ్ టీమ్స్‌తో పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు, సజ్ఞలను ఇప్పటికే ఏర్పాటుచేశామని అన్నారు.
ప్రమాదాలకు కారణం ఎక్కువగా వేగం, అనధికార వాహనాల పార్కింగ్‌లే అని స్పష్టం చేశారు. వాహనాల వేగం నియంత్రించడానికి అధునాతన స్పిడ్ లేజర్ గన్స్‌తో కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామని పేర్కొన్నారు. రహదారుల వెంట వాహనాలు నిలపడానికి ఎటువంటి అనుమతి లేదని, రహదారుల వెంట గ్రామాల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్రూట్లో వాహనాలు నడపవొద్దని, ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గత 10రోజుల్లో అధిక వేగంపై 3వేలకు పైగా వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని, 950వాహనాలపై అనధికార పార్కింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు.