Take a fresh look at your lifestyle.

సర్జికల్ స్ట్రయిక్’ ప్రస్తావన అసంగతం..!

“కేంద్రం రాష్ట్రాలకూ, మహానగరాల అభివృద్దికి చేస్తున్న, చేయదల్చిన సాయం గురించి ప్రస్తావించడం చాలా ముఖ్యం.అందుకు తగిన సమాచారం లేనందునే జనాన్ని పక్కదారి పట్టించేందుకు రొహింగ్యా ముస్లింల ప్రస్తావన చేయడం ఎంతమాత్రం తగదు. అంతేకాక, శత్రు శిబిరాలపై జరిపే మెరుపు దాడులను నగరాలపై జరుపుతామనడం ఎంత మాత్రం సమర్దనీయం కాదు. ఈ విషయమై కమలనాథులు తమ తప్పును దిద్దుకోవాలి.”

హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చైనా, పాకిస్తాన్, రొహింగ్యా ముస్లింల ప్రస్తావన ఎందుకో కమలనాథులు చెప్పాలి. భిన్న సంస్కృతుల సమాహారంగా హైదరాబాద్ దశాబ్దాలుగా ప్రపంచ దేశాల మన్ననలను అందుకుంటోంది. ఈ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి వొచ్చిన వారే కాకుండా, ఇతర దేశాల నుంచి వొచ్చిన వారు దశాబ్దాల క్రితం స్థిర నివాసం ఏర్పరుచుకుని స్థానికులతో కలిసిమెలిసి జీవిస్తున్నారు.అటువంటి వారిపై ఇప్పుడు రొహింగ్యాలని ముద్ర వేసి పొమ్మనమంటే ఎక్కడికి పోతారు. వీరు కొత్తగా వొచ్చినవారు కారు. కేంద్ర ప్రభుత్వం వద్ద రొహింగ్యా ముస్లింల జాబితా ఉంది. గణాంకాల వివరాలు ఉన్నాయి. వారు ఏయే నగరాల్లో ఉన్నారో సమస్త సమాచారం ఉంది . ప్రస్తుత మయన్మార్ తో మన దేశానికి శతాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా, పూర్వపు బర్మా అయిన మయన్మార్ లో తెలుగువారు దశాబ్దాల క్రితం వ్యాపారాలు చేసి కొందరు అక్కడ స్థిర పడగా, మరి కొందరు అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ ఆస్తులు కొనుక్కున్నారు. బర్మాకు పూర్వపు రాజధానిగా రంగూన్ ఉండేది.రంగూన్ రౌడీ పేరిట తెలుగులో నాటకం వొచ్చింది. సినిమా కూడా వొచ్చింది. తెలుగువారితో పాటే కొందరు ముస్లింలు కూడా ఇక్కడే స్థిర పడ్డారు.అప్పట్లో వారికి ఆశ్రయం కల్పించడం వల్ల స్థానిక ముస్లిం కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకున్నారు.ఇది బహిరంగ రహస్యం.

రొహింగ్యా ముస్లింలుగా పేరొందిన వీరిని అన్ని రాజకీయ పార్టీలూ వోటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. సరిహద్దు రాష్ట్రాలైన అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువ.ఈ సంగతి అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. రొహింగ్యా ముస్లింలు సామాజికంగా,ఆర్థికంగా బాగా వెనుకబడినవారు. వీరిని వోటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప వీరి ఆర్థికాభ్యున్నతికి ఏ ప్రభుత్వమూ కృషి చేయలేదు. భారతీయ జనతాపార్టీ త్రిపురలో అధికారంలోకి రావడానికి రొహింగ్యా ముస్లింలు తోడ్పడినట్టు ఆరోపణలు వొచ్చాయి. త్రిపుర, అసోం, బెంగాల్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ కాంగ్రెస్ మాదిరిగానే ఆయా రాష్ట్రాల్లో బలాధిక్యత గల మైనారిటీ వర్గాలను మచ్చిక చేసుకుంటోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఎన్నికలలో రొహింగ్యాల ప్రస్తావన వొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో రొహింగ్యాలు ఉన్నా వారి సంఖ్య చాలా తక్కువ. అయితే, పాత బస్తీలో ఎంఐఎం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో మైనారిటీ వర్గాలకు ఆశ్రయం కల్పించి వారిని వోటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. ఆ విషయంలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా వారిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం అసంగతమే కాకుండా, వోట్లు సంపాదించాలనే దురుద్దేశ్యం కూడా ఉంది. రొహింగ్యాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రయిక్ చేయిస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రకటన ఆవేశకావేశాలను రెచ్చగొట్టింది.ఆయనేదో ప్రస్తావన పూర్వకంగా అన్నారనుకుంటే, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా అదే కోరస్ అందుకున్నారు. కమలనాథులు రొహింగ్యాల పేరు ప్రస్తావించి ప్రజల్లో చీలికలను తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎంఐఎం, తెరాసలు ఆరోపిస్తున్నాయి.

కార్పొరేషన్ ఎన్నికలలో పార్లమెంటు ఎన్నికల స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తూ, కేంద్ర మంత్రులనూ , బీజేపీ అగ్రనాయకులనూ ప్రచారానికి పంపడం వెనుక ఆ పార్టీ చాలా భారీ వ్యూహాన్నే అనుసరిస్తోన్నట్టు స్పష్టం అవుతోంది. హైదరాబాద్ పాలనా అధికారాన్ని సంపాదించేందుకు పొరుగుదేశాల, పొరుగుదేశాల్లోని మైనారిటీల సంస్థల గురించి పదే పదే ప్రస్తావించడం వల్ల ఇప్పటికే పొరుగుదేశాలతో తగాదాలను పరిష్కరించలేక సతమతమవుతున్న కేంద్రం పై ఇంకా ఎక్కువ ఒత్తిడి రావొచ్చు.అసలు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా మద్దతును పెంచుకోవాలన్నదే కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ స్థాయికి ఎదిగిన భాగ్య నగరంలో స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి పరిష్కారానికి తాము చేయాల్సినదేమిటో చెప్పి వోటర్లను ఆకర్షించడం ఒక పద్దతి. రెండు రోజుల క్రితం వరకూ అలాగే జరిగింది.

వరదలు, మురుగు నీటిలో తేలియాడుతున్న కాలనీలు, వరద బాధితుల ఇబ్బందులు, వరద సాయం నిలిపివేయడం, పక్కదారి పట్టడం వంటి అంశాల కే పరిమితమైన ప్రచారం ఒక్కసారిగా రొహింగ్యా ముస్లింల వైపునకు మళ్ళింది. ఈ సమస్య జాతీయ స్థాయిలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్య. దీనిని పరిష్కరించడం కోసమే కేంద్రంలో మోడీ ప్రభుత్వం నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్ పిఆర్), సిఏఏ వంటి చట్టాలను తెచ్చింది.వాటిపై వివాదాలు చెలరేగి హింస కూడా చోటు చేసుకుంది. ఢిల్లీలో గత జనవరిలో జరిగిన సంఘటనలు ఇంకా మన స్మృతి పథంలోనే ఉన్నాయి. కొరోనా వ్యాప్తి వల్ల పరిస్థితి చల్లబడినప్పటికీ నివురు గప్పిన నిప్పులా ఆ ఆవేశాలు ఇప్పటికీ చల్లారలేదు. ఈ తరుణంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ అంశాలను ప్రస్తావించడం పూర్తిగా అసంగతం. కేంద్రం రాష్ట్రాలకూ, మహానగరాల అభివృద్దికి చేస్తున్న, చేయదల్చిన సాయం గురించి ప్రస్తావించడం చాలా ముఖ్యం.అందుకు తగిన సమాచారం లేనందునే జనాన్ని పక్కదారి పట్టించేందుకు రొహింగ్యా ముస్లింల ప్రస్తావన చేయడం ఎంతమాత్రం తగదు. అంతేకాక, శత్రు శిబిరాలపై జరిపే మెరుపు దాడులను నగరాలపై జరుపుతామనడం ఎంత మాత్రం సమర్దనీయం కాదు. ఈ విషయమై కమలనాథులు తమ తప్పును దిద్దుకోవాలి.

Leave a Reply