Take a fresh look at your lifestyle.

‘సర్జికల్’ వార్ …!

“రాష్ట్రానికిగాని,  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం ఇంతవరకు అందించిన సహాయమేంటి, ఇచ్చిన నిధులేంటి  విషయాలతోపాటు భవిష్యత్‌లో తామందిచ్చే సహకారమేంటన్న విషయాలను మాట్లాడకుండా సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌లాంటి  తీవ్ర పదాలను వాడడాన్ని  బిజెపి పార్టీ నేతలుకూడా ఖండించకపోడం చూస్తుంటే ఆ పార్టీకి హైదరాబాద్‌పై ఉన్న ప్రేమేంటన్నది అర్థమవుతోంది. ఈలాంటి పరిస్థితిలో బిజెపికి అవకాశమివ్వడమంటే, హైదరాబాద్‌లో విధ్వంసానికి అవకాశమివ్వడమేనంటూ కెటిఆర్‌ వోటర్లకు వివరించే ప్రయత్నంచేస్తున్నారు.”
బండి సంజయ్ వ్యాఖ్య వివాదాస్పదం: మండువ రవీందర్‌రావు

గ్రేటర్‌ ఎన్నికల్లో సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌నినాదం వివాదాస్పదంగా మారింది. శత్రుదేశంలోని తీవ్రవాద స్థావరాల లక్ష్యంగా నిర్వహించే సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ఇప్పుడు రాష్ట్ర రాజధానిపై జరుపుతామంటూ భారతీయ జనతాపార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగామారాయి. హైదరాబాద్ ‌స్టేట్‌ ‌భారత్‌ యూనియన్‌లో విలీనం కాకముందు నుండి పాతబస్తీలో ముస్లింల ఉనికి ఎక్కువే. వివిధ ముస్లిం సంస్థలు వీరికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగానే, వీరిలో కొందరు రాజకీయంగా ఎదగడానికి ఎంఐఎం దోహదపడుతోంది. కొంతకాలం క్రితం వరకు ఉప ప్రాంతీయ పార్టీగా కొనసాగుతున్న ఎంఐఎం ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా ఒక విధంగా జాతీయ పార్టీగా గుర్తుంపు తెచ్చుకుంది. తాజాగా జరిగిన బీహార్‌ ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలను మజ్లీస్‌పార్టీ పొందడమే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంటూ వస్తోందీపార్టీ. ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడినప్పటినుండి ఆరేళ్ళ క్రితం వరకు ఏలిన వివిధ ప్రభుత్వాల కాలంలో ఇక్కడ అల్లర్లు జరుగడమన్నది సహజంగా మారింది.

స్వార్థ రాజకీయ నాయకులు కొందరు ఈ అల్లర్లకు సృష్టికర్తలుగా మారితే, రాజకీయ పార్టీలుకూడా తమ ఉనికిని చాటుకోవడానికి కారణంగా మారాయనడానికి చరిత్రే సాక్ష్యం. ఏదిఏమైనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఆరేళ్ళ కాలంలో రాష్ట్ర రాజధానిలో ఎలాంటి మత ఘర్షణలు జరుగలేదనడం నిర్వివాదాంశం. అందుకు అధికార తెరాస, ఎంఐఎంపార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడమేనన్నది ప్రతిపక్షాలనుండి వస్తున్న విమర్శ. భారత యూనియన్‌లో కలువడానికి అనేక త్యాగాలుచేసిన ఈ గడ్డపైన ఎంఐఎం పార్టీకి అధిక ప్రాధాన్యాన్నివ్వడమేంటన్నది భారతీయ జనతాపార్టీ ప్రశ్న. హిందూ సమాజానికి వ్యతిరేకంగా అనేక సార్లు తమ అభిప్రాయాలను వెల్లడించిన ఎంఐఎం నేతలతో తెరాస ప్రభుత్వం జతకట్టమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రోహింగ్యాలు, పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింలను ఓటరు జాబితాలో చేర్చి ఎంఐఎం రాజకీయ లబ్దిపొందుతోందన్నది బిజెపి వాదన. పలు తీవ్రవాద సంస్థలకు హైదరాబాద్‌ ‌నిలయంగా మారకుండా ప్రక్షాళన చేయాల్సి  ఉందంటోంది బిజెపి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికల్లో దీన్నే ప్రధానాంశంగా తీసుకున్న బిజెపి, హిందుస్తాన్‌లోని హైదరాబాద్‌ ‌కావాలా ? భారతదేశంలోని భాగ్యనగర్‌ ‌కావాలా ? అన్న నినాదంతో ప్రజలముందుకు వెళ్తోంది.

ఈ సందర్భంగానే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి మేయర్‌గా గెలిస్తే పాతబస్తీమీద సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేసిన సంచలనాత్మక వ్యాఖ్య  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది. అయితే  సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ అం‌టే  ఎవరినో చంపుతామని అర్థంకాదని, రోహింగ్యాలు, పాకిస్తాన్‌లను తరిమికొడుతామని దానికి అర్థాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎంఐఎం నేతలు గతంలో, తాజాగా చేసిన వ్యాఖ్య లను కూడా బిజెపి నేతలు ఊటంకిస్తున్నారు. 1948లోనే హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో కలుపాలని ఆ పార్టీ డిమాండ్‌చేసిన విషయాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  కాగా, తాజా శాసనసభలో ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్‌ ఓవైసి రాష్ట్ర  ప్రభుత్వంతో దోస్తీ విషయంలో చేసిన వ్యాఖ్యలుగాని, చార్‌మినార్‌ ఎంఎల్‌ఏ ‌ముంతాజ్‌ఖాన్‌ అహ్మద్‌  ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్న మాటల వెనుక ఆ పార్టీ లక్షాన్ని తెలియజేస్తున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాల్లో ఒకరిని గద్దెమీద కూర్చోబెట్టడం, దించడంకూడా తమకు తెలుస్నట్లుగా వీరిద్దరి మాటలను టిఆర్‌ఎస్‌ అర్థంచేసుకోలేకపోతున్నదన్న విమర్శలుకూడా లేకపోలేదు.  వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే సంజయ్‌ ‌సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌వ్యాఖ్యానం చేసి ఉంటాడన్నది రాజకీయ విశ్లేషకులు  భావిస్తున్నారు. ఇపుడీ  ప్రకటన రాష్ట్రంలో  హాట్‌ ‌టాపిక్‌గా మారింది. దీనిపై ఎంఐఎంకూడా తీవ్రంగానే  స్పందిస్తోంది. నిజంగానే చొరబాటుదారులో, తీవ్రవాదులో ఉంటే కేంద్ర హోంశాఖ ఏంచేస్తున్నదని  ఎంఐఎం అధినేత అసదుద్టీన్‌ ఓవైసీ బిజెపి నేతలను నిలదీస్తున్నారు. రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశస్తులెవరున్నది ఇరవై నాలుగు గంటల్లో కేంద్రం ప్రకటించాలనికూడా ఆయన ఛాలెంజీ విసిరారు. వాస్తవంగా శరణార్ధులకు కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితులు ప్రత్యేక గుర్తింపు  కార్డులనిచ్చి పంపించిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. అంతటితో ఆగకుండా చైనా మనదేశంలో వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంటే కేంద్రం ఏంచేస్తున్నదంటూ ఆయన బిజెపి నాయకులను ఎద్దేవచేశారు. ప్రతీ ఎన్నికల్లో  తీవ్రవాదులు, పాకిస్తానీలన్న పదాలు లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం బిజెపికి అలవాటులేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ ‌నాయకుడు, మాజీమంత్రి షబ్బీర్‌ అలీకూడా విరుచుకు పడ్డారు.

సంజయ్‌ ‌వ్యాఖ్యలు చూస్తుంటే భారతదేశంలో హైదరాబాద్‌ ‌లేదన్నట్లుందని, దీనిపై ఎన్నికల కమిషన్‌, ‌పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. సిపిఐ నాయకుడు నారాయణ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఇదిలాఉంటే  నాలుగు వోట్లు రాల్చుకోవడానికి విశ్వనగరాన్ని  విద్వేషనగరంగా మార్చాలని చూస్తున్నారని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భారతీయ జనతాపార్టీపైన విరుచుకు పడుతున్నారు. నిజంగానే రోహింగ్యాలు, పాకిస్తానీలు ఉంటే కేంద్రం ఎందుకు  వారిపై చర్య తీసుకోవడంలేదంటూ, బండి సంజయ్‌ ‌మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడంటూ తన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో మెట్రోపాలిటి సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్‌కున్న బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని, ఇది చాలా దుర్మార్గమంటూ,  రాష్ట్ర ప్రభుత్వాలపట్ల  కేంద్రం అవలంభించాల్సిన వైఖరి ఇదేనా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.  రాష్ట్రానికిగాని,  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం ఇంతవరకు అందించిన సహాయమేంటి, ఇచ్చిన నిధులేంటి  విషయాలతోపాటు భవిష్యత్‌లో తామందిచ్చే సహకారమేంటన్న విషయాలను మాట్లాడకుండా సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌లాంటి  తీవ్ర పదాలను వాడడాన్ని  బిజెపి పార్టీ నేతలుకూడా ఖండించకపోడం చూస్తుంటే ఆ పార్టీకి హైదరాబాద్‌పై ఉన్న ప్రేమేంటన్నది అర్థమవుతోంది. ఈలాంటి పరిస్థితిలో బిజెపికి అవకాశమివ్వడమంటే, హైదరాబాద్‌లోవిద్వంసానికి అవకాశమివ్వడమేనంటూ కెటిఆర్‌ వోటర్లకు వివరించే ప్రయత్నంచేస్తున్నారు.

Leave a Reply