Take a fresh look at your lifestyle.

సురవరం ప్రతాపరెడ్డిని స్మరించుకోవడం మనందరి బాధ్యత: మంత్రి కెటి. రామారావు

  • మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు
  • సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ప్రతీకను ఆవిష్కరిస్తున్న మంత్రులు కెటి.రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు
ముషీరాబాద్, డిసెంబర్ 28 (ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తామని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు హామీనిచ్చారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి  సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టే అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్ బషీర్  బాగ్ దేశోద్ధారక భవన్ సురవరం ప్రతాపరెడ్డి హాల్ తెలంగాణ వైతాళికుడు ‘సురవరం ప్రతాప్ రెడ్డి  125 జయంతి’ ఉత్సవాల లోగో (ప్రతీక), ప్రారంభోత్సవ సభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కెటి.రామారావు, గౌరవ అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గద్వాల జెడ్ ఛైర్ సరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సురవరం ప్రతాప్ రెడ్డి 125వ జయంతి ప్రతీకను మంత్రులు కెటి.రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ ఆష్కరించారు. ప్రభుత్వ సలహాదారులు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కెవి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ప్రొఫెసర్ ఎస్వి. సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజెయు) అధ్యక్షులు, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(టియుడబ్లుజె)ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఎంతకాలం జీవించామన్నది కాదని, ఎలా జీవించామన్నదే ముఖ్యమనే విషయాన్ని సురవరం ప్రతాపరెడ్డి నిరూపించారన్నారు.

- Advertisement -

125 ఏళ్ల తర్వాత కూడా సురవరం ప్రతాపరెడ్డి పేరు గుర్తుంచుకునేలా సమాజంలో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. తెలంగాణ అస్థిత్వాన్ని, రయితల, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిజాం కాలంలోనే ఆయన చాటి చెప్పారని, 350 మంది తెలంగాణ కవుల అస్తిత్వాన్ని ఆనాడే చాటి చెప్పిన వ్యక్తి అని ప్రశంసించారు. ప్రతాపరెడ్డిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, ఆయనకు ప్రభుత్వం సముచిత గౌరవాన్ని కల్పిస్తుందని హామీనిచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రం కాకాపోతే ప్రతాపరెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల చరిత్ర మరుగున పడేదన్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఆయన అని, సురవరం అంటే ముందుగా గుర్తొచ్చేది గోలకొండ పత్రిక అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతోనే సాంస్కృతిక పునరుజ్జీవం సాధ్యమైందన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలుగు భాషకే ఒక ధృవతార అని కొనియాడారు. ఆయన పోషించని పాత్ర, ఏ రంగం లేదని, ఆనాడే మాదిగ సంఘానికి గౌరవ అధ్యక్షునిగా వ్యవహారించారని, వర్తక సంఘానికి గౌరవ సలహాదారునిగా వైవిధ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. నాటి రాచరికకాలంలో భాషనే తన ఆయుధంగా మల్చుకున్నారని, తెలంగాణ వైతాళికునిగా  నిలిచారన్నారు. 1995లోనే వనపర్తిలో ఆయన పేరిట లైబ్రరీ ఏర్పాటు చేశామన్నారు. వనపర్తి ప్రాంత ప్రజలు నిత్యం ప్రతాపరెడ్డిని తలచుకునేలా పార్కును ఏర్పాటు చేసి, అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాపరెడ్డి పేరు పెట్టే విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ జాతి గర్వపడే వ్యక్తి అని, అంటరానితనం, పేదరిక నిర్ములన కోసం ఆనాడే కొట్లాడిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతాపరెడ్డి జీవిత చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చాలని, ఉమ్మడి మహబూబ్ నగర్ ఏదో ఒక రిజర్వాయర్ సురవరం ప్రతాప్ పేరు పెట్టేలా సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో సురవరం ప్రతాప్ జయంతి వేడుకలు అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. కె.శ్రీనివాస్ రెడ్డి తన ప్రసంగంలో సురవరం ప్రతాప్ జీవితాన్ని సభకు పరిచయం చేస్తూ తెలుగు, తెలంగాణలో జర్నలిజానికి ఆధ్యులన్నారు. బషీర్ బాగ్ నుంచి ఎంఎల్ఏ క్వార్టర్స్ మార్గాన్ని సురవరం ప్రతాప్ మార్గంగా పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్ రెడ్డి  ఔన్నత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. న్యాయస్థానాల్లో వాస్తవాలను అవాస్తవాలుగా చెప్పాల్సి వస్తుందనే ప్రతాప్ రెడ్డి  న్యాయవాద వృత్తిని ఎంచుకోలేదని వివరించారు. ఆనాడు తెలంగాణ తెలుగు అసలైన తెలుగు కాదని, ఉర్దూ మిళితమైందని ఒక పత్రికలో రాస్తే అందుకు స్పందించిన ప్రతాప రెడ్డి ఆంధ్ర తెలుగులో ఆంగ్లం మిలితమైందని, తెలుగు ఆంధ్రభాష ఎలా అవుతుందని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రొఫెసర్ ఎస్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ సురవరం కథలు, పదకోశాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. సురవరం సంపాదకీయాలు నాటి నిజాం ప్రభువును ఆగ్రహానికి గురిచేసేవని అన్నారు. విరాహాత్ అలీ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి జీవితం ఒక మహాగ్రంథమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోస గర్జించిన తొలి గొంతక సురవరం అని కొనియాడారు. సభలో  సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. సభకు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి కార్యదర్శి డాక్టర్ సురవరం పుష్పలతారెడ్డి స్వాగతం పలకగా, సురవరం అనిల్ కుమార్ వందన సమర్పణ చేశారు.

Leave a Reply