వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయకపోతే, మేం స్టే విధిస్తాం, సమస్య పరిష్కారానికి కమిటీని ప్రతిపాదిస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రకటన కేంద్రానికి చెంప పెట్టువంటిది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో జరుగుతున్న ఆందోళనపై కేంద్రం చాలా రోజులు స్పందించలేదు. చివరికి ఇద్దరు మంత్రులు వ్యవసాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభిచాంరు. ఆ ప్రతినిధులతో తొమ్మిది దఫాలు పైగా చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు. రైతులు ప్రతిపాదించిన రెండింటికి కేంద్రం అంగీకరించినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ ప్రకటించారు. గడ్డకట్టే చలిలో రైతులు సాగిస్తున్న ఆందోళనను విరమింపజేయటడానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి బదులు కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్రం ఎంత నచ్చజెప్పినా, ఆ మూడు చట్టాలనూ రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేయడం వల్ల చర్చల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ పై రాబడి గాలిలో దీపంలా తయారైంది. కేంద్రం రైతుల వైపు నుంచి ఆలోచించకుండా తాను అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో సాగదీత ధోరణిని అనుసరిస్తోంది. మార్కెట్ తో పోటీ పడితే రైతులకు మంచి ధర లభిస్తుందని కేంద్రం ఊరిస్తోంది. కానీ, మార్కెట్ లో ధాన్యం ధర ఏ మేరకు ఎక్కువ వొస్తుందో రైతులకు తెలుసు.అందుకే వారు ససేమిరా అంటున్నారు.
ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశంపై చాలా స్పష్టమైన వైఖరిని తీసుకుంది. కేంద్రం చేసిన జాప్యానికి కూడా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకూ జరిపిన చర్చల వివరాలు సంతృప్తికరంగా లేవని కూడా సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. అగ్రి చట్టాలపై దేశంలో మేధావులు, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు ప్రభుత్వానికి శతవిధాల మొరపెట్టుకున్నా, కేంద్రం తన పంతమే నెగ్గాలన్న ధోరణిలో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వొచ్చింది. రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా పరిగణిస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను యథేచ్చగా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా కార్పొరేట్ సంస్థలకు విక్రయించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.తాము కార్పొరేట్ సంస్థలకూ, లేదా కాంట్రాక్టు ఫార్మింగ్ చేసేవారికీ లోబడి పని చేయాల్సి ఉంటుందన్నది రైతుల అభిప్రాయం.అలాగే,ఏ పంట వేయాలో, ఎంత సాగు చేయాలో నిర్ణయించే అధికారం తమకే ఉండలన్నది రైతుల వాదన. కానీ, ప్రభుత్వం రైతులకు లాభదాయక విధానం అని చెబుతున్న ఈ కొత్త చట్టాల వల్ల రైతులు పరాధీనులు కావల్సి వొస్తుందని రైతులే కాకుండా, వ్యవసాయ రంగంలో దశాబ్దాలుగా అనుభవం ఉన్నవారు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వాలూ వ్యవసాయ చట్టాల గురించి ఇంతగా పట్టుపట్టలేదు. రైతుల స్వేచ్ఛ జోలికి రాలేదు. మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకుని రావడం రైతుల పాలిట శాపంగా పరిగణమించింది. పత్తి విత్తనాలకు సంబంధించి బీటీ కాటన్ విత్తనాలను వేయాలని గతంలో ఒత్తిడి వొచ్చినప్పుడు రైతులంతా సంఘటితమై ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
ప్రభుత్వం విదేశీ సంస్థలకు లొంగి పోయి ఇలాంటి ప్రతిపాదనలను చేస్తోందన్న ఆరోపణలు అప్పట్లో వొచ్చాయి. అప్పట్లో దానిపై కూడా రైతులు, వారి తరఫున రాజకీయ పార్టీలు సుదీర్ఘ పోరాటాన్ని జరిపాయి. అంతేకాకుండా బీటీ కాటన్ విత్తనాలు మన దేశంలో భూములకు సరిపడనివి కావని శాస్త్రజ్ఞులు హెచ్చరించినా ప్రభుత్వం అప్పట్ల మొండిగా వ్యవహరించింది. రైతులకు లాభం చేకూరే విధానాలను డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. వాటిని గాలికి వొదిలేసి మార్కెట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించడం ఎంత మాత్రం సహించరాని విషయమని చాలా మంది మేధావులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రైతులతో కేంద్ర మంత్రుల కమిటీ చర్చలు ఫలించనందున సుప్రీంకోర్టు స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపింది.ఆ కమిటీలో వ్యవసాయ శాస్త్రజ్ఞులు, ఆహార రంగానికి చెందిన ప్రముఖులు ఉంటారు. ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేయడానికి బదులు తమకు లోబడి ఉండేవారికి ఈ చర్చలు జరిపే బాధ్యత అప్పగించడం వల్ల వారు ప్రభుత్వ విధానాన్నే పదే పదే చెబుతున్నారు. చట్టాలను నిలిపివేయడం కుదరదనీ, కేంద్రం తరఫు న్యాయవాది పేర్కొన్నప్పుడు, ఈ చట్టాలు పౌరుల ప్రాధమిక హక్కులకు విరుద్ధంగా ఉంటేనే నిలిపివేయడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.దేశంలో రైతులు ఎక్కడా ఆందోళన చేయడం లేదనీ, ఒకటి రెండు రాష్ట్రాల్లోనే ఆందోళన సాగుతోందని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడం విడ్డూరంగా ఉంది. ఢిల్లీ శివారులో జరిగే ఆందోళనలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతులే కాకుండా, ఇతర రాష్ట్రాల వారూ పాల్గొంటున్నారు. గతంలో వ్యవసాయదారుల ఉద్యమాలు చాలా జరిగాయి.ఈ ఆందోళనలో కాన వచ్చిన సంఘీభావం ఎన్నడూ కానరాలేదు.
అంతేకాకుండా రైతులు ప్రభుత్వం కల్పించే భోజన సౌకర్యాలను తిరస్కరించి తమకు తామే ఆహారాన్ని తయారు చేసుకోవడం వారి ఆత్మాభిమానానికి ప్రతీకగా పేర్కొన వచ్చు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి సన్నిహితుడు, ఆర్ ఎస్ ఎస్ లో శిక్షణ పొందిన కాలం నుంచి సహాధ్యాయి. ఆయన నిన్న ఒక సభలో ప్రసంగించేందుకు సన్నాహం చేయగా,ఆయన హెలికాప్టర్ దిగాల్సిన హెలీ ప్యాడ్ ను రైతులు ధ్వంసం చేశారు. రైతుల ఆగ్రహానికి ఇది మచ్చు తునక, ప్రభుత్వం ఈ చట్టాలను తేవడం వల్ల దేశంలో ఎప్పటి మాదిరిగా జరగాల్సిన వ్యవసాయ కార్యకలాపాలు జరగడం లేదు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలి కేంద్రం న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి తన నిర్ణయాలను పునరాలోచన చేసుకోవాలి. లేకుండా ప్రజాగ్రహానికి గురి కావల్సి వొస్తుంది.