Take a fresh look at your lifestyle.

రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీమ్‌ ‌సూచన

అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించరాదని 1992లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.అప్పటి నుంచి ప్రతి సందర్బంలోనూ సుప్రీమ్‌ ‌కోర్టు విధించిన పరిమితి గురించి రాజకీయనాయకులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. మరో వంక రిజర్వేషన్లు కావాలని సమాజంలో వివిధ వర్గాల వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం గురించి చాలా మంది సుప్రీమ్‌ ‌కోర్టుకు విజ్ఞప్తులు కూడా చేసారు. వాటిని పురస్కరించుకుని 1992లో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై పునః పరిశీలన జరపాలన్న డిమాండ్‌ ‌ను సర్వోన్నత న్యాయస్థానం ఇప్పుడు వేరే కేసు సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిశీలన జరిపి అవసరమైన చర్యలకు ఉపక్రమించాలని జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌ ‌నేతృత్వంలోని బెంచ్‌ ‌రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ నోటీసులు జారీ చేసింది. 1992లో ఇందిరా సాహ్ని తీర్పు వెలువడి మూడు దశాబ్దాలు అవుతున్న దృష్ట్యా, దేశంలో పలు వరప్గాల నుంచి డిమాండ్లు పెరుగుతున్న దృష్ట్యా, ఈ మధ్య కాలంలో అనేక సార్లు రాజ్యాంగ సవరణలు, సామాజికార్ధిక మార్పులు జరిగిన దృష్ట్యా, రిజర్వేషన్ల పరిమితిపై సమీక్ష జరపాలన్న డిమాండ్‌ ‌ను పరిశీలించాలని ధర్మాసనం సూచించింది.దీనిపై రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ వాటి అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.

మరాఠాలకు రిజర్వేషన్లను కేటాయిస్తూ ఆనాటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బొంబాయి హైకోర్టు సమర్ధించగా, ఆ తీర్పును సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ ‌పై విచారణ సందర్బంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం ఈ సూచన చేసింది. రిజర్వేషన్లు అనేవి రాజకీయ అంశం అయినప్పుడు దీనిపై రాజకీయ పార్టీల తో ఏర్పడిన ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలన్న మాట యధార్ధమే. సమాజంలో వివిధ వర్గాల ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. తరతరాలుగా దళితులు అనుభవించిన వివక్షనూ, అవమానాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ‌షెడ్యూల్డ్ ‌కులాలు, షెడ్యూల్డ్ ‌తెగలకు రాజ్యాంగ బద్దమైన రిజర్వేషన్లు కల్పించారు.ఆ తర్వాత సామాజిక న్యాయం ఉద్యమం ఊపందుకోవడతో 1989లో మండల్‌ ‌కమిషన్‌ ‌చేసిన సిఫార్సులను పురస్కరించుకుని ఆనాటి ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది.ఆ తర్వాత ఈ పరిధి ఇంకా పెరుగుతూ వొచ్చింది.ఇంకా రిజర్వేషన్ల డిమాండ్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.

కొత్తగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు మోడీ ప్రభుత్వమూ, తాజాగా కేసీఆర్‌ ‌నేతృత్వంలోని తెరాస ప్రభుత్వమూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నేపథ్యం లో పలువురు కోర్టులను ఆశ్రయించారు. కోర్టులు చట్టంలో ఉన్న విషయాలనే చెబుతాయి. కొత్తగా నిర్ణయాలు చేయలేవు.ఈ విషయం అందరికీ తెలుసు. రిజర్వేషన్లు కొత్తగా ప్రకటించేవారికీ తెలుసు. కోర్టులో తమ ప్రకటనలు ఆగిపోతాయని.అంటే, ఆయా వర్గాల ఆందోళనలను చల్లార్చడానికి అప్పటికప్పుడు ప్రకటనలు చేస్తుంటారు. అవి రాజకీయ ప్రకటనలేనన్న సంగతి జనానికీ తెలుసు. ఆయా వర్గాల్లో భావోద్వేగాలను చల్లార్చడానికి రాజకీయ నాయకులు, వారిని ఆశ్రయించిన వర్గాలు దశాబ్దాలుగా చేస్తున్న హంగామా ఇది.

- Advertisement -

రిజర్వేషన్లకు ప్రాతిపదిక దారిద్య్రం కావాలని కొందరు వాదిస్తుండగా, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని మరి కొందరు కోరుతున్నారు. సామాజిక వెనకబాటు తనం అనేది ఇప్పుడు ఒక నినాదంగా మారింది.గతంలో సామాజిక వెనకబాటుతనం ఉన్న మాట నిజమే. కాని, ఇప్పుడు అన్ని వర్గాలూ సమాన హక్కులను అనుభవిస్తున్నారు. బీసీలకు మంత్రి పదవుల్లో, స్కూళ్ళు, కాలేజీల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కోసం డిమాండ్లు రాజకీయావసరాల కోసం కొన్ని పార్టీలూ, వర్గాలూ చేస్తున్న డిమాండ్లు మాత్రమే. పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ల పేరిట చాలా మంది మంత్రి పదవులు, కార్పొరేషన్‌ ‌పదవులు,ఇతర పదవులు సంపాదించుకుంటున్నారు. అయితే, మహిళల విషయానికొచ్చేసరికి ఎవరి మటుకు వారు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం రాజీవ్‌ ‌గాంధీ, తర్వాత పీవీ చాలా నిజాయితీగా కృషి చేశారు. వాజ్‌ ‌పేయి హయాంలో ఏకాభిప్రాయ సాధన మంత్రం తో రిజర్వేషన్లను వాయిదా వేస్తూ వొచ్చారు.ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలైన డిఎంకె, సమాజ్‌ ‌వాదీ,ఆర్‌ ‌జేడీ పార్టీలు వ్యతిరేకించడం వల్ల మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ఆగిపోయింది. మోడీ అధికారంలోకి వొచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు మాటే లేదు.

ఆయన కేబినెట్‌ ‌లో మహిళలకు లభించిన ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే, తొలి కేబినెట్‌ ‌లో సుష్మా స్వరాజ్‌ ‌వంటి ప్రతిభ గలవారికి స్థానం కల్పించినా, వారి వాణికి ప్రాధాన్యం లభించలేదు. అలాగే, సామాజిక న్యాయం పాటించడం లేదన్న అసంతృప్తిని ఉమాభారతి చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. రెండోసారి ఆమెకు కేబినెట్‌ ‌లో పదవి దక్కలేదు. స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌ ‌వంటి వారు కేవలం తలూపే మంత్రులుగానే పేరొందారు. వారి గళం ఎక్కడా వినిపించడం లేదు. రిజర్వేషన్లు కేవలం రాజకీయ లబ్ధికి రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్న అస్త్రం. వాటి ప్రమేయం లేకుండానే మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. స్వశక్తితో పైకి వొచ్చిన మహిళలను తొక్కిపట్టే యత్నాలు సాగుతున్నాయి . ముఖ్యంగా రాజకీయ రంగంలో నోరెత్తే మహిళలకు స్థానం లేకుండా చేయాలనే తలంపుతో నేటి పాలకులు వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీని గద్దె దింపేందుకు మోడీ,ఆయన శిష్యుడు అమిత్‌ ‌షా కాలికి బలపం కట్టుకుని సాగిస్తున్న ప్రచార యాత్రలు ఇందుకు నిదర్శనం.

మోడీ చేసే ప్రసంగాల్లో మమతా బెనర్జీపై వెళ్ళగక్కుతున్న ఆగ్రహం, అక్కసు ఆమెకు అనుకూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. మమతా బెనర్జీని విమర్శిస్తే బెంగాలీలు సహిచే పరిస్థితి లేదని తాజా వార్తలు సూచిస్తున్నాయి. తమిళనాడులో దివంగత జయలలిత పేరు చెప్పుకుని బీజేపీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి వొచ్చిందంటే కేంద్రం ఏడేళ్ళ నుంచి ఆ పార్టీ చేసిందేమీ లేదని స్పష్టం అవుతోంది. రిజర్వేషన్లు తీరు కూడా అంతే. ఏమైనా రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను వోట్ల సాగు కోసం ఉపయోగించుకుంటున్నాయే తప్ప ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుద్దామన్న ఉద్దేశ్యంతో కాదు. ఆ విషయాన్ని ఆ వర్గాలు కూడా గ్రహించాయి.అందుకే, రిజర్వేషన్ల తాయిలం చూపినా, వోటుకు నోటు ఇవ్వాల్సిందేనని వోటర్లు డిమాండ్‌ ‌చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply