మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల మేరకు భారత సర్వోన్నత న్యాయ స్థానంలోని లాయర్స్ ఛాంబర్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఏవైనా ముఖ్యమైన కేసుల విచారణ ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచన మేరకు దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 31వ తేదీ వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు కేసుల విచారణ నేరుగా చేపట్టరాదని కోర్టు రిజిస్ట్రీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆమాద్మీ ప్రభుత్వ చర్యలకి మద్ధతుగా లాయర్స్ చాంబర్స్ని మంగళవారం పూర్తిగా మూసివేయనున్నట్టు తెలిపారు. లాయర్స్ ఛాంబర్స్ లాక్డౌన్ మార్చి 31వ వరకు ఉంటుంది. మార్చి 16వ తేదీ నుంచి సుప్రీంకోర్టు గేట్ వద్ద థర్మల్ స్ర్కీనింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.