Take a fresh look at your lifestyle.

సోషల్‌ ‌మీడియాలో నకిలీ వార్తలపై సుప్రీమ్‌ ‌కోర్టు అసహనం

  • దేశానికి చెడ్డ పేరు తెస్తుందని హెచ్చరిక
  • నియంత్రణ యంత్రాంగం ఏదైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు

సోషల్‌ ‌మీడియాలో నకిలీ వార్తలు పెరిగి పోతుండడంపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాలోని కొన్ని విభాగాలు ప్రతి విషయాన్ని ప్రచారం చేశాయని, ఇది చివరికి దేశానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘి జమాత్‌ ‌సమావేశమే కొరోనా వైరస్‌ ‌వ్యాప్తికి కారణమని కొన్ని మీడియా సంస్థలు ఎలా మతం రంగును పులుముతూ వొచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సమస్య ఏమిటంటే, ఈ దేశంలో ప్రతిదీ ఒక వర్గం మీడియా ద్వారా మతపరమైన కోణంతో చూపబడింది. దీంతో చివరికి దేశానికి చెడ్డ పేరు వొస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జవాబుదారీతనం లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు శక్తివంతమైన వ్యక్తుల విషయంలో మాత్రమే ప్రతిస్పందిస్తాయని, అయితే సాధారణ వ్యక్తులు, సంస్థలు, న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదులు పట్టించుకోలేదని చెప్పారు.

వెబ్‌ ‌పోర్టళ్ల నియంత్రణ కోసం ఏదైనా యంత్రాంగం ఉందా అని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ ‌మరియు డిజిటల్‌ ‌మీడియా ఎథిక్స్ ‌కోడ్‌) ‌రూల్స్, 2021‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2021 సమాచార సాంకేతిక నియమాలను సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల నుంచి సుప్రీమ్‌ ‌కోర్టుకు కేసులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అన్ని పిటిషన్‌లను కలిపి విచారించడంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాల లిస్ట్ ‌చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు.

ఆ తర్వాత సోషల్‌ ‌మీడియా కేసులన్నీ సుప్రీమ్‌ ‌కోర్టుకు బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘‘నిజమైన పోటీ పత్రికా స్వేచ్ఛ మరియు నిజమైన వార్తలను పొందే పౌరుల హక్కు మధ్య ఉంది. మేము నియంత్రించడానికి, సమతుల్యం చేయడానికి ప్రయత్నించాము’’ అని మెహతా న్యాయస్థానానికి తెలిపారు. సెప్టెంబర్‌ 24, 2019 ‌న, ఫేస్‌బుక్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీమ్‌ ‌కోర్టు, నేరాలకు పాల్పడేందుకు సోషల్‌ ‌మీడియాను ఉపయోగించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్‌ ‌మీడియాలో కొన్ని సందేశాలు జాతీయ సార్వభౌమత్వాన్ని కూడా బెదిరించవచ్చని కోర్టు అభిప్రాయబడింది.

Leave a Reply