- ఫరూక్ అబ్దుల్లాపై కేసు కొట్టివేస్తూ సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు
- పిటిషనర్‌కు 50 వేల జరిమానా
జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయంతో విభేదించే వ్యాఖ్యలు చేయడం దేశద్రోహంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై రూ. 50 వేల జరిమానా కూడా విధించింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై గతంలో ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైంది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై ఫరూక్.. పాకిస్థాన్, చైనా మద్దతు కోరినట్లు పిటిషనర్ ఆధారాలు సమర్పించ లేకపోయారని సుప్రీమ్ కోర్టు చెప్పింది.
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు కాదని, ప్రభుత్వాలకు భిన్నమైన రీతిలో స్పందించవచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని నిరసిస్తూ.. మళ్లీ ఆ అధికారం పొందేందుకు అవసరమైతే చైనా, పాకిస్తాన్ దేశాల సహాయం తీసుకుంటామంటూ ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైన వ్యాఖ్యలని, దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని రజత్ శర్మ, నేహ్ శ్రీవాస్తవలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్లో ఫారుఖ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని, ఐపీసీలోని సెక్షన్ 124-ఏ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీమ్ ఘాటుగానే స్పందించింది. ప్రభుత్వాలకు భిన్నంగా, వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొచ్చు. దీనిని దేశద్రోహంగా ఎలా పరిగణిస్తాం. ప్రభుత్వాలపై చేసే వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావు. అవి భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమే అని సుప్రీమ్ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 370 నిర్వీర్యం అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని చాలా మంది నేతలు ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్నారు.