Take a fresh look at your lifestyle.

చర్చల్లో విశాల దృక్పథం లేదని తేల్చిన ‘సుప్రీమ్‌’.. ‌కమిటీ వేయడానికి సంసిద్ధత

ఇరవై రోజులు పైగా ఆందోళన సాగిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో వివిధ స్థాయిల్లో ఎన్ని సంప్రదింపులు జరిపినా పరిష్కారం కుదరడం లేదంటూ సుప్రీమ్‌కోర్టుకు కేంద్రం తెలియజేసినప్పుడు విశాల దృక్పథం ఉంటేనే చర్చలు ఫలవంతమవుతాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే, ప్రభుత్వం విశాల దృక్పథం లేకుండానే చర్చలు జరుపుతున్నట్టు చెప్పకనే చెప్పింది. రైతు సంఘాలలో చీలికకు ప్రయత్నించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రాంతాల వారీగా ఈ సమస్యను పరిష్కారించాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలను పంజాబ్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ‌వంటి ఉత్తరాది రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వొచ్చాయి. ఉద్యమాన్ని ఉధృతంగా నడుపుతున్నది పంజాబ్‌ ‌రైతులే కనుక వారికి మినహాయింపు ఇస్తే, ఉద్యమ తీవ్రత తగ్గుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కావచ్చు. అలా చేయాలనుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలకే విడిచి పెడితే గొడవ ఉండదు. ఈ సమస్యను మరింత జాప్యం చేస్తే జాతీయ సమస్యగా పరిణమించగలదని సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. కేంద్రం ఇప్పుడు ప్రదర్శిస్తున్న వెసులుబాటు వైఖరి మొదట్లోనే ప్రదర్శించి ఉంటే ఉద్యమం ఇంత వేడెక్కి ఉండేది కాదు.

ఈ విషయాన్ని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో ప్రధాన భాగంగా ఉన్న వ్యవసాయ రంగం గురించి ప్రభుత్వం శాస్త్రీయమైన దృక్పథంతో కాకుండా రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తుండటం వల్లనే ఈ సమస్య కోతిపుండు బ్రహ్మరాక్షసిలా తయారైంది. రైతు సంఘాలను చర్చల్లో ముందే, అంటే బిల్లులు తయారీ దశలోనే భాగస్వాములు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఆచరణకు ఇవ్వడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గ్యాస్‌పై సబ్సిడీ విషయమే తీసుకుంటే, సబ్సిడీ వదులుకున్న కుటుంబాలు దేశాభివృద్దిలో పాలుపంచుకుంటున్నారంటూ పొగడ్తలు చేస్తూ పెట్రోల్‌ ‌బంకుల్లో పెద్ద హోర్డింగ్‌లు పెట్టించారు. సబ్సిడీ సొమ్ము వదులుకున్నవారే దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారంటే, వేల కోట్ల రూపాయిల సబ్సిడీని తీసుకుంటున్న పారిశ్రామిక, కార్పొరేట్‌ ‌సంస్థలు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే కదా, ఈ వాదం ఎంతవరకూ వెళ్తుందో చెప్పలేం. కానీ, ప్రచారం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే అది బెడిసి కొడుతుందన్న వాస్తవాన్ని ఆయనే కాదు, ఆయనను అనుసరిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసుకుంటే మంచిది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ ‌పథకం, ఆంధప్రదేశ్‌లో పూర్వపు తెలుగుదేశం హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై జరిగిన ప్రచారం ఇందుకు నిదర్శనం. ఆంధప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వాలు అనూహ్యమైన ప్రచారాన్ని ఇస్తున్నాయి. వాటికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఫలితాలు మాత్రం ఆశించినంత లభించడం లేదు. ప్రధానమంత్రి దారిలోనే ముఖ్యమంత్రులు పయనిస్తున్నారు. రైతుల ఉద్యమానికి సంబంధించి కేంద్రం రైతు సంఘాల నాయకులతో చర్చలను అరమరికలు లేకుండా జరపలేదన్న వాస్తవాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు గ్రహించింది. చర్చలు సామరస్యంగా, అరమరికలు లేకుండా జరిగేందుకు కమిటీని నియమిస్తామని ప్రకటించింది. అంటే ప్రభుత్వం విపలమైందన్న మాటేగా. ఇందుకు వేరే రుజువులు అవసరం లేదు. ఇరవై రోజులుపైగా రైతులు జరుపుతున్న ఆందోళనపై ప్రభుత్వం కొంత మేర దిగివొచ్చిన మాట వాస్తవమే. రైతులు కూడా మరిన్ని మెట్లు దిగాలని ప్రభుత్వం కోరుతోంది.

- Advertisement -

అసలు కార్పొరేట్‌, ‌పారిశ్రామిక వర్గాలకు వ్యవసాయంలో ప్రమేయం కల్పించడం ఎందుకన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఈ వర్గాలు తమ సంబంధిత రంగాల్లో అభివృద్ధి ఫలాలను గణనీయంగా చూపించి ఉంటే ఒక రకంగా అర్ధం చేసుకోవొచ్చు. పారిశ్రామిక, కార్పొరేట్‌ ‌రంగాలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు రైతులకు ఇస్తున్న సబ్సిడీలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. అయినప్పటికీ అవి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోతున్నాయి. కొరోనా సమయంలో ఆఫీసులు, కర్మాగారాలు ఫ్యాక్టరీలు మూతపడితే నష్టాలొచ్చాయని ప్రకటనలు చేసి సానుభూతి మూటగట్టుకోవడానికి ప్రయత్నించాయే తప్ప, ఇంత కాలం వొచ్చిన లాభాల ఆసరాతో బయటపడే ప్రయత్నాలు చేయలేదు. పారిశ్రామికాభివృద్ధి ఎంత అవసరమో, వ్యవసాయాభివృద్ధి కూడా అంతే అవసరం. అందుకే, తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ ఈ రెండు రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు నెహ్రూ విధానాలను తుచ తప్పకుండా పాటించి ఉంటే రైతే రాజు అయ్యేవాడు.

కాంగ్రెస్‌ అవినితి దేశాభివృద్ధికి పెద్ద అవరోధంగా తయారైంది. బీజేపీ మొదటి నుంచి కార్పొరేట్‌, ‌పారిశ్రామిక వర్గాలకు లబ్ది చేకూర్చే పార్టీగా ముద్ర పడింది. వాజ్‌ ‌పేయి ప్రభుత్వంలో బీజేపీ మేలి ముసుగు బయటపడనందున తేడా తెలిసేది కాదు. మోడీ ప్రభుత్వంలో ఆ మేలి ముసుగు తొలగి పోయింది. కార్పొరేట్‌ ‌రంగానికి బాహాటంగా మద్దతు ఇస్తూ రైతుల పట్ల వలపక్షం చూపుతున్నారు. ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటున్న మోడీ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రైతులకు విడిచిపెడితే ఆయన అనుకున్నది సాధించేందుకు అవకాశం ఉండేది. మార్కెట్‌ ‌వ్యవస్థను వ్యవసాయ రంగంలోకి తీసుకుని వొస్తే వాటిల్లే దుష్పరిణామాలు ఎన్నో. ఈ వాస్తవాన్ని గ్రహించడం వల్లనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వ్యవసాయ సంస్కరణల పేరిట తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు.

Leave a Reply