Take a fresh look at your lifestyle.

‘సెంట్రల్ విస్టా’ ప్రాముఖ్యత గల ప్రాజెక్టు ..!

  • నిలిపివేయమని తీర్పు ఇవ్వలేమన్న దిల్లీ హై కోర్ట్
  • ‘ప్రేరేపిత’ వ్యాజ్యం అంటూ  పిటిషనర్లకు రు .లక్ష ఫైన్ 

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,మే 30: దేశంలో కొరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని దాఖలు అయిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాముఖ్యత ఉందని.. దీనిని నిలిపివేయాలని తీర్పు ఇవ్వలేమని చెప్పింది. పిటిషనర్లు అయిన అన్య మల్హోత్రా మరియు సోహైల్ హష్మీ పై కోర్టు లక్ష జరిమానా విధించింది. ఎందుకంటే ఈ పిల్  ‘ప్రేరేపించబడినది’ మరియు నిజమైన ప్రజా వ్యాజ్యం కిందకి రాదు అని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సమయం మించిపోకుండా నిర్మాణం పూర్తి కావాలని, అంటే నవంబర్ 2021 కి ముందే పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ఒకసారి కార్మికులు పనిలోకి దిగాక నిర్మాణ స్థలంలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించబడి, మరియు కోవిడ్ -19 ప్రవర్తన నియమావళికి కట్టుబడి నిర్మాణ పని జరుగుతున్న  ఈ ప్రాజెక్టును ఆపడానికి ఎటువంటి కారణం లేదు అని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని దాఖలు అయిన పిటిషన్‌ నిజమైన ‘పిల్’  కాదు అని ఢిల్లీ హైకోర్టు భావించింది.

పిటిషనర్ల వాదోపవాదాలు..
అన్య మల్హోత్రా మరియు సోహైల్ హష్మీలు కోవిడ్ -19 పరిస్థితి కారణంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన వందలాది కార్మికులు వైరస్ బారిన పడతారని, ఈ నిర్మాణ సైట్ ఎలా సూపర్ స్ప్రెడర్‌గా ఉండబోతుంది కోర్టుకి వివరించారు. అలాగే  ఈ ప్రాజెక్టును ‘అత్యవసర సేవ’ గా పరిగణించడం వెనుక ఎటువంటి హేతువు లేదని, ఎగ్జిక్యూటివ్ ఆదేశాల మేరకు మాత్రమే ఈ నిర్మాణం జరుగుతున్నది అని తమ పిటిషన్ లో తెలిపారు.

పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా, ఈ నిర్మాణం వలన దిల్లీ పూల తోటలు ఆక్రమణకు గురి అవుతాయి అనే భయంతోనే ఈ పిటిషన్ దాఖలు చేయబడిందని వాదించారు. దేశ రాజధానిలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ, నిర్మాణ పనిని కొనసాగించడానికి షాపూర్జీ పల్లోంజి నిర్మాణ గ్రూప్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని లుథ్రా కోర్టుకు చెప్పారు.నిర్మాణ స్థలంలో కార్మికులకు పడకలు మరియు గుడారాలు అందుబాటులో లేకపోవడంతో పాటుగా… కోవిడ్ -19 సదుపాయాలు ఈ సైట్ లో ఉన్నాయి అని చెబుతున్న ప్రభుత్వ వాదనలను న్యాయవాది లుథ్రా కోర్టులో నిలదీసారు.

కేంద్రం వాదోపవాదాలు..
రాజ్‌పథ్ మరియు ఇండియా గేట్ పరిసరాల్లో నిర్మాణం కొనసాగుతోందని, కొత్త పార్లమెంట్ భవనం లేదా కొత్త కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణం జరగటం లేదని కోర్టుకి కేంధ్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్ పాత్ మార్గంలో ప్రజలు మరియు పర్యాటకులు సందర్శించే బహిరంగ ప్రదేశాలలో, టాయిలెట్ బ్లాక్స్, పార్కింగ్ ప్రాంతాలు, పాదచారుల అండర్‌పాస్‌లు మొదలైనవి ప్రస్తుత నిర్మాణంలో భాగంగా ఉన్నాయి అని కేంద్రం కోర్టుకు తెలిపింది. పిటిషనర్లు చెప్పింది నిజం కాదని నిర్మాణ స్థలంలో వైద్య సదుపాయం ఉందని, అందులో కార్మికులకు ప్రవేశం ఉందని కేంద్రం తెలిపింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ పని కోవిడ్  ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉంది.. ఉంటుందని కేంద్రం తెలిపింది. పిటిషనర్లు తన పిల్  ద్వారా  ఎప్పుడూ ఏదో ఒక సాకుతో నిర్మాణాన్ని ఆపాలని కోరుకుంటూ ఇలా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు అని కేంద్రం పిటిషనర్లపై ఎదురు దాడి చేసింది. నిర్మాణాన్ని ఆపడానికి నిరాకరిస్తూ, కార్మికులు నిర్మాణ  స్థలానికి సమీపంలో నివసిస్తున్నారని, అందువల్ల, ‘నిర్మాణ పనులను నిలిపివేసే ప్రశ్న తలెత్తదు’ అని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో కూడా ఈ పిటిషన్ ‘చట్ట ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం’ చేసిందని, ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిందని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. పిటిషన్‌ను జరిమానాతో కొట్టివేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టు ముందు కోరింది.ఢిల్లీ హైకోర్టు మే 17 న తీర్పును రిజర్వు చేసి సోమవారం తన తీర్పును వెలువరించింది.

Leave a Reply