ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు
రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం
న్యూ దిల్లీ, జూన్ 5(ఆర్ఎన్ఎ) : రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్ కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్ కోర్టు హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ఎస్టీలకే కేటాయిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరగ్గా.. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఏపీ, తెలంగాణకు రెండున్నర లక్షల చొప్పున సర్వోన్నత న్యాయస్థానం జరిమానా కూడా విధించింది. ఏపీ ప్రభుత్వం ఈ జరిమానాను చెల్లించగా.. తెలంగాణ చెల్లించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం పాటించలేదని సుప్రీమ్ కోర్టు మండిపడింది. దీనిపై స్పందిస్తూ..పిటిషన్ పెండింగ్లో ఉన్నందునే జరిమానా చెల్లించలేదని ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానమిచ్చింది. జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వానికి ధర్మాసనం మరో 2 వారాలు గడువు ఇచ్చింది. జరిమానా చెల్లించకుంటే కోర్టు ధిక్కరణ పక్రియ చేపడతామని హెచ్చరించింది. అన్నిచోట్ల రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.