Take a fresh look at your lifestyle.

అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు తేజం

“54 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయ పీఠం ఎక్కారు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని కృష్ణా జిల్లాలో సాధారణ వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. మాతృభాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై ఆవేదన చెందారు. తెలుగు భాషపై మక్కువ ఎక్కువ కలిగిన జస్టిస్‌ ‌రమణ అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. జస్టిస్‌ ‌రమణ మార్గదర్శకత్వంలో నూతన ఒరవడిలో న్యాయ వ్యవస్థ న్యాయ వంతంగా, నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా, ఆదర్శవంతంగా సాగుతుందని ఆశిద్దాం.”

నేడు ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వేంకటరమణ జన్మదినం

జస్టిస్‌ ‌నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు గణపతిరావు, సరోజిని. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి అమరావతిలోని ఆర్వీవీఎన్‌ ‌కాలేజీ నుంచి అగ్రికల్చర్లో డిగ్రీ చేశారు. 1982లో నాగార్జున విశ్వ విద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యత్వం పొంది న్యాయవాద వృత్తి ప్రారంభించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్‌ ‌చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగ పరమైన, క్రిమినల్‌, ‌సర్వీస్‌, అం‌తర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ ‌కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్‌ ‌జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్‌ 27‌న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

తర్వాత క్రమంగా 2013లో ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. 2014లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ‌చలమేశ్వర్‌ ‌తర్వాత జస్టీస్‌ ‌రమణ రెండవ తెలుగు వ్యక్తి. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులను పరిష్కరింవిన ఘనత ఆయనది. జస్టిస్‌ ఎస్పీ బాల్డే పదవీకాలం ఏప్రిల్‌ 23‌తో ముగియగా.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీనియర్గా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని గత మార్చి నెలలో కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం.. తర్వాత రాష్ట్రపతి. వద్దకు పంపింది. రాష్ట్రపతి ఆమోదం వేయడంతో భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులయ్యారు. 2021 ఏప్రిల్‌ 24‌న భారత దేశ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌నూతలపాటి వేంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్‌ ‌కోవింద్‌ ‌జస్టిస్‌ ‌రమణతో ప్రమాణం చేయించారు.

జస్టిస్‌ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు 16 నెలల పాటు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ చరిత్ర పుటల కెక్కారు. గతంలో 1966 జూన్‌ 30 ‌నుండి 1967 ఏప్రిల్‌ 11 ‌వరకు జస్టిస్‌ ‌కోకా సుబ్బారావు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా పని చేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయ పీఠం ఎక్కారు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని కృష్ణా జిల్లాలో సాధారణ వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. మాతృభాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై ఆవేదన చెందారు. తెలుగు భాషపై మక్కువ ఎక్కువ కలిగిన జస్టిస్‌ ‌రమణ అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. జస్టిస్‌ ‌రమణ మార్గదర్శకత్వంలో నూతన ఒరవడిలో న్యాయ వ్యవస్థ న్యాయ వంతంగా, నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా, ఆదర్శవంతంగా సాగుతుందని ఆశిద్దాం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply