Take a fresh look at your lifestyle.

గంగిగోవు గర్జన

నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా…

నేను గంగిగోవునే
నువ్వేం చేసినా
నోరు మెదపని గంగిగోవునే
అది నిన్నటి వరకూ

నిన్నటి కాలంలోంచి
వెనక్కి చూసుకుంటే
ఈ గంగిగోవుల
ఎదనిండా గాయాలే
రక్తమోడుతున్న దేహాలే
అయినా.. రసికారుతున్న గాయాలపై
నీళ్లు చల్లుకుని మంటనార్పుకుంటూ
రేపటిపై ఆశ చావక
కాడి కదుపుతూనే
దుక్కి దున్నుతూనే
పంటతీస్తూనే ఉన్నానా ..

ఇప్పుడిక
ఏకంగా నా నడ్డి విరిచేస్తుంటే
నట్టేట ముంచేస్తుంటే
రేపనేది లేకుండా పోతుంటే
మౌనంగా చూస్తూ, భరిస్తూ
ఎలా ఉండగలదీ గంగిగోవు?
తాడో పేడో తేల్చుకోవాల్సిందేగా ..!

నీకూ తెలుసుగా ..
బంధిస్తే పిల్లే పులిగా మారుతుందని
ఈ సాధుజీవీ అంతే..
తన పాలపొదుగునే గద్దలు తన్నుకుపోతుంటే
ఆవురావురంటూ రాబందులు కాచుక్కూచుంటే
తనను తాను నిలుపుకోవడం కోసం
తన వాళ్ళను కాపాడుకోవడం కోసం
కమిలిపోతున్న బతుకును దిద్దుకోవడం కోసం
కదిలిపోనున్న క్షేత్రాన్ని రక్షించుకోవడం కోసం
రూపు మార్చుకున్నది
చూపు మార్చుకున్నది

నిన్నలలోంచి రేపటిని
రేపటిలోంచి భవితను
నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తున్నది
నీవెన్ని జిత్తులమారి ఎత్తులేసినా
మరెన్ని టక్కుటమారి గంతులేసినా
నమ్మే అమాయకజీవి కాదిప్పుడీ గంగిగోవు
నీ టియర్‌ ‌గ్యాస్‌లూ, లాఠీఛార్జ్‌లూ
నన్ను నా లక్ష్యాన్ని ఛేదించలేవు
గమ్యం చేరకుండా ఆపలేవు
నా దారికడ్డుగా నువ్వెన్ని బలగాలను దింపినా
బారికేడ్లు కట్టినా .. దారులన్నీ మూసేసినా
అడ్డుగోడల్ని బద్ధలుకొట్టుకు పోతూనే ఉంటా
నీ చుట్టూ దిగ్బంధనం చేసి
నీ కంట్లో నలుసులై
నీ గొంతులో బండలై
నీ చెవిలో జోరీగలై
నీ ముక్కులో నుసుములై
గర్జిస్తూ జనబలం ముంచెత్తకముందే
గంగిగోవులన్నీ కొమ్ములెత్తి కుమ్మేయకముందే
మేలుకో.. మేలుకో .. మేలుకో
ఎంతటి బలవంతమైన సర్పమైనా
చలిచీమల చేత చిక్కి చావక తప్పదని
తెలుసుకో .. తెలుసుకో .. తెలుసుకో

– వి. శాంతి ప్రబోధ

Leave a Reply