Take a fresh look at your lifestyle.

‌ప్రాణం తీసిన వరద సాయం

  • క్యూలో నిలబడి మహిళ మృతి
  • మీ సేవ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు
  • కూకట్‌పల్లి, వనస్థలిపురం, మలక్‌పేట, ఉప్పల్‌లో తొక్కిసలాట
  • ఒక్క రోజులోనే మాట మార్చిన ఎన్నికల సంఘం
  • ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే కారణమని ప్రతిపక్షాల విమర్శలు

హైదరాబాద్‌లో వరద సాయం ప్రజల ప్రాణాల మీదికి తెచ్చింది. వరద బాధితులు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వరద సాయం కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచే ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. అయితే, కొన్ని చోట్ల సర్వర్‌ ‌డౌన్‌ ‌కావడం, మరికొన్ని చోట్ల రద్దీని నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. గోల్కొండ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయడానికి వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయడానికి వచ్చిన హకీంపేటకు చెందిన 50 ఏళ్ల మున్నవర్‌ ఉన్నీసా అనే మహిళ సుమారు 3 గంటల పాటు క్యూలో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించే లోపే మృతి చెందింది.

ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎం‌సి ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల వరద సాయం బాధితులకు నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌ ‌ద్వారా పంపిణీ చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాలలో ప్రజలు ఉదయం 6 గంటల నుంచే మీ సేవ కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నగరంలోని కూకట్‌పల్లి, రాంనగర్‌, ‌వనస్థలిపురం, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ‌మలక్‌పేటతో పాటు పాతబస్తీలోని చార్మినార్‌, ‌గోల్కొండలోని పలు ప్రాంతాలలో ప్రజలు కి.మీ.ల మేర క్యూ కట్టారు. రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఓపిక నశించిన ప్రజలు తోపులాటలకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓవైపు, కొరోనా ఉధృతి కొనసాగుతుండగానే ముందు జాగ్రత్తలు ఏవీ పాటించకుండా ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవ కేంద్రాల ముందు వందల సంఖ్యలో గుమిగూడారు. పేర్లు నమోదు చేసుకునేందుకు కొరోనా నిబంధనలు సైతం పట్టించుకోలేదు. మరికొన్ని చోట్ల మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో గొడవలకు దిగారు. ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో సర్వర్లు పనిచేయలేదు. దీంతో వారు రద్దీని నియంత్రించలేక మీ సేవ కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు. అయినప్పటికీ కదలకుండా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు ముగిసే వరకూ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వరద సాయం పంపిణీకి హఠాత్తుగా బ్రేక్‌ ‌పడటంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ ‌కాలనీలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు తమకు వరద సాయం అందించాల్సిందేనంటూ డిమాండ్‌ ‌చేశారు.

గత నెలలో • కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ ‌నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వందలాది కాలనీలు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం వరద బాధితులకు ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీని కోసం రూ. 550 కోట్లను విడుదల చేసింది. అయితే, ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందనీ, ప్రభుత్వ సాయం అసలైన లబ్దిదారులకు కాకుండా అధికార పార్టీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వరద సాయం కోసం బాధితులు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తాజాగా, ప్రభుత్వం వరద సాయం పంపిణి కొనసాగించవచ్చని మంగళవారం ప్రకటించిన ఎన్నికల సంఘం బుధవారం నెలకొన్న పరిస్థితి దృష్ట్యా వరద సాయాన్ని నిలిపి వేయాలని ఆదేశించింది. అయితే, వరద సాయం పంపిణి విషయంలో తలెత్తిన పరిస్థితి ప్రభుత్వ బాధ్యతా రాహిత్య వైఖరే కారణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే ఎన్నికల కమిషన్‌ ‌జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు ప్రకటించడం, వరద సాయం పంపిణీ చేసుకోవచ్చని చెప్పిన తరువాతి రోజే నిలిపివేయాలని ఆదేశించడం సీఎం కేసీఆర్‌, ఎన్నికల కమిషన్‌ ‌కలసి ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తాయి. మీ సేవా కేంద్రాల ద్వారా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ అసమర్థ వైఖరికి నిదర్శనమని విమర్శించాయి. వరద సాయం పేరుతో ప్రజలకు రోడ్లపైకి తీసుకొచ్చి కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply