తాజాగా ఎంజిఎం సూపరింటెండెంట్ రాజీనామా..
రాజకీయ వొత్తిళ్లే కారణమని ప్రచారం
ప్రభుత్వ దవాఖానాల సూపరింటెండెంట్ల వరుస రాజీనామాలు తెలంగాణలో సంచలనంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేయగా, తాజాగా మంగళవారం వరంగల్ ఎంజిఎం దవాఖాన సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ నగరంలో, రూరల్ జిల్లాలో భారీగా పెరుగుతున్న కొరోనా కేసులపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజా ప్రతనిధులతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలోనే ఎంజిఎం సూపరింటెండెంట్ రాజీనామా చేయడం గమనార్హం. ఆరోగ్యం సహకరించడం లేదనీ, తన రాజీనామాను అంగీకరించాలని డీఎంఈకి రాసిన లేఖలో ఆయన కోరారు. అయితే, శ్రీనివాసరావు రాజీనామాకు రాజకీయ వొత్తిళ్లే కారణమని వైద్య వర్గాలలో చర్చ జరుగుతోంది.
గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంతో పాటు రూరల్ జిల్లాలో కొరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వరంగల్ నగరంలో మంగళవారం నాటికి కొరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో ఏకంగా 152కు చేరింది. దీంతో కొరోనా కేసుల నియంత్రణలో విఫలమయ్యారని రాజకీయ వర్గాల నుంచి వొచ్చిన వొత్తిడి మేరకు ఆయన రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. గతంలో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ దవాఖానాలో నెలకొన్న పరిస్థితులను చూసి మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు డీఎంఈకి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన రాజీనామా చేసిన సమయంలో దవాఖానాలో ఆక్సీజన్ అందక నలుగురు కొరోనా రోగులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. తాజాగా వరంగల్ ఎంజిఎం దవాఖానా సూపరింటెండెంట్ రాజీనామా వెనక ఆయన పేర్కొన్నట్లుగా ఆరోగ్యపరమైన కారణాలు కాకుండా ఇతర కారణాలు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ వొత్తిళ్లు, అవినీతి ఆరోపణలు, కింది స్థాయి ఉద్యోగులు సహకరించకపోవడంతో మనస్థాపం చెంది శ్రీనివాసరావు రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆయన రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సూపరింటెండెంట్‌ను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంజీఎం దవాఖానా కొత్త సూపరింటెండెంట్ పరిశీలనలో డాక్టర్ చంద్రశేఖర్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.