Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు

  • లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు తెలియని ఎండవేడిమి
  • బయటకు వెళితే దంచికొడుతున్న సూరీడు
  • 22నుంచి 25 వరకు తీవ్రంగా ఉంటాయన్న ఐఎండి

విశాఖపట్టణం,మే 21 : తుపాను తీరం దాటిన సందర్భంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. తుపాను వల్ల సంభవించిన ఈదురు గాలులు గాలిలోని తేమ శాతాన్ని పట్టుకుని వెళ్లిపోవడం వల్ల నేరుగా సూర్య కిరణాలు భూమిని తాకి, ఉష్ణోగ్రతలు పెరిగినట్లు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టరు వి.విజయభాస్కర్‌ ‌తెలిపారు. ఇంకా వేడి పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భూమి నుంచి పశ్చిమ దిశగా గాలులు ఈ తుపాను వల్ల వీయడంతో గాలిలో తేమ శాతం లేకుండా పోయిందని తెలిపారు. దీంతోపాటు నర్సాపురం, మచిలీపట్నం, బాపట్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే .. నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల 43 డిగ్రీల సెల్సియస్‌ ‌చొప్పున, కాకినాడ 42, ఒంగోలు, కావలి 41 చొప్పున, తుని, నెల్లూరు 40 చొప్పున, విశాఖ 39, కళింగపట్నం 36 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇకపోతే ఎపితో పాటు తెలంగాణలోనూ ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌నల్లగొండ, వరగంల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెతుతున్నారు. గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఇక్కడ మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలుగా నమోదైంది. గతంలో ఇక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42-43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ ‌స్టెల్లా తెలిపారు. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.మరోవైపు రోహిణి కార్తెకు ఎండలు మండనున్నాయి.

రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని చ్చరించింది. ఈ ఏడాది ఐఎండీ ఇలాంటి వడగాడ్పు హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం.ఈనెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. దీనికి ముందస్తు సంకేతంగా ఈనెల 22 నుంచి ఎండలు భగ్గుమనడంతోపాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఐఎండీ కూడా ఇవే హెచ్చరికలు జారీ చేసింది. శుక్ర, శని, ఆది వారాల్లో యానాంతోపాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. రోహిణి కార్తె సపించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్‌ ‌బారినపడే ప్రమాదం ఎక్కువ. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్యకిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలన్నారు. లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్నందున ఇంటిపట్టునే ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

Leave a Reply