Take a fresh look at your lifestyle.

భానుడి ప్రభావంతో మరో స్వీయ లాక్‌డౌన్‌లోకి…

ఒక పక్క కొరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుంటే, మరో పక్కన ప్రచండ భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండడంతో ప్రజలు మరికొంత కాలం స్వీయ లాక్‌డౌన్‌లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 25 నుండి రోహిణీకార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం నాలుగైదు రోజుల ముందు నుండే పొడసూపడం ప్రారంభించింది. ఉదయం తొమ్మిదిగంటల నుండే ప్రజలు బయటికి వెళ్ళేందుకు భయపడిపోతున్నారు. వారం రోజులకిందికి ఇప్పటికే ఎండ తీవ్రత బాగా పెరిగింది. ప్రతీ వేసవి కాలంలో రోహిణీ కార్తె ప్రవేశిస్తుందంటేనే ప్రజలు ప్రయాణాలు చేయాలంటేనే భయపడిపోతుంటారు. అందుకే ఈ కార్తెకు ఓ విచిత్రమైననానుడి ఉంది. రోహిణిలో రోడ్లు పగిలే ఎండలైనా, రోళ్ళు మునిగే వానలైనా కురుస్తాయంటారు. అంటే ఈ కార్తెలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతుంది. ఈ వేసవి ఆరంభంలో కాస్త తక్కువగానే అనిపించిన ఎండల తీవ్రత క్రమేణా పెరుగుతూ ఇప్పుడు రోహిణికార్తె సమీపిస్తుండడంతో మరింత తీక్షణంగా మారుతున్నది. రోహిణి ఎండలకు ఎంతటి వారైనా తట్టుకోలేని పరిస్థితి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతవాసులు, వ్యవసాయదారులు వడదెబ్బకు తట్టుకోలేక విలవిలలాడిపోతున్న పరిస్థితిని ప్రతీఏటా గమనిస్తూనే ఉన్నాం. ఈసారి కూడా ఇప్పటికే వడగాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నపరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తే ఇంకా రోహిణి ప్రవేశం కాకుండానే 42 నుండి 47 డిగ్రీల వరకు ఊష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగానేఉంది. వీటికితోడు ఈసారి వడగాలులుకూడా తీవ్రంగానే వీచే ప్రమాదముందని వాతావరణ నిపుణులు ముందస్తుగానే హెచ్చరికలు జారీచేసారు కూడా. వాయువ్యంనుండి వేడిగాలులు వీస్తుండడంతో వొచ్చే రెండు మూడు రోజుల్లో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే 42 నుండి 44 డిగ్రీలవరకు గ్రేటర్‌లో ఊష్ణోగ్రత నమోదవడాన్ని బట్టి రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో ఇప్పటికే 45 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదు కావడంతో ముందుముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలో నలభై రెండు మొదలు 45.6 వరకు ఊష్ణోగ్రత రికార్డు అయింది. ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌రామగుండం, ఖమ్మం, వరంగల్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, సూర్యాపేటల్లో కూడా ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధిక ఊష్ణోగ్రత నమోదవుతూనేఉంది. ఊష్ణోగ్రతకు వేడిగాలులు కూడా తోడవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వేడిగాలుల ప్రభావానికి ఇప్పటికే జమ్మికుంట రూరల్‌లో ఇద్దరు మృతిచెందారు.

ఏపిలోకూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈనెల 21 నుండి ఎండవేడిమికి తోడు వేడిగాలుల ప్రభావంకూడా తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అక్కడ హెచ్చరికలు జారీచేసింది. కోస్తాంధ్ర, రాయలసీమలో వీటి ప్రభావం తీవ్రస్థాయికి చేరుకోనుందని చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా రెంట చింతలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకోగా, విజయవాడతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఒకవైపు కొరోనా కారణంగా యాభై రోజులకు పైగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను క్రమేణా సడలిస్తున్నా, ప్రచండ భానుడి తీక్షణ వీక్షణాల కారణంగా ప్రజలు ఇండ్లలోనుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే రోహిణికార్తె పూర్తి అయ్యేవరకు అంటే దాదాపుగా పక్షం రోజులపాటు ప్రజలు మరో లాక్‌డౌన్‌లో కొనసాగాల్సిన పరిస్థితే కనిపిస్తున్నది. ఫలితంగా కార్మికులు, కూలీలలకు ఇంకా కొంతకాలం కష్టం తప్పేట్లులేదు. వారి ఉపాధి అవకాశాలకు మరికొంతకాలం గండిపడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యధిక మందికి ఉపాధి కల్పించే భవన నిర్మాణం ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్ననేపథ్యంలో ఇదోరకంగా వారి ఉపాధికి గండికొట్టనుంది. ఉపాధి కార్మికులు , వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా ఈ సీజన్‌లో అటవి ప్రాంతాలవారికి ఉపాధిని కల్పించే తునికాకు కార్మికులు పైన కూడా ఈ ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy