Take a fresh look at your lifestyle.

సునీతమ్మా…ఎక్కడమ్మా…!?

  • సైదాబాద్‌ ‌చిన్నారి హత్యాచారం ఘటనపై స్పందించని మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌
  • ఆమె తీరుపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, సాధారణ ప్రజానీకం

రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌మెజిస్ట్రేట్‌ అధికారాలు కలిగి ఉంటారు. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌గా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని హైకోర్టు డెడ్‌లైన్‌తో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సునీతా లక్ష్మారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో మంత్రిగా చేశారు సునీతా లక్ష్మారెడ్డి. రాజకీయంగా కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆమెను మహిళా ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, మెజిస్ట్రేట్‌ అధికారాలు కలిగి ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి తీరుపై ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో నెటిజన్లు, బయట సాధారణ ప్రజానీకం దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

గత వారంలో సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన విషయం విధితమే. ఈ చిన్నారిపై రేప్‌, ‌మర్డర్‌ ‌యావత్‌ ‌దేశాన్ని కుదుపేస్తుంది. రాజును ఎన్‌కౌంటర్‌ ‌చేయాలన్న డిమాండు మూకుమ్మడిగా వ్యక్తమవుతుంది. చిన్నారిని అత్యాచారం, హత్య చేసిన నిందితుడు రాజు కోసం వందలాది మంది పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో గురువారం హైదరాబాద్‌-‌వరంగల్‌  ‌రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. రాజు మృతిని డిజిపి మహేందర్‌రెడ్డి  ధృవీకరించారు. అయితే, రాష్ట్ర మహిళా ఛైర్‌పర్సన్‌ ‌హోదాలో ఉన్న వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే, ఆమెపై నెటిజన్లు, సాధారాణ ప్రజానీకం దుమ్మెత్తిపోయడానికి ప్రధాన కారణం. చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగి వారం రోజులు కావస్తున్నప్పటికీ…ఇప్పటి వరకు మహిళా ఛైర్‌పర్సన్‌ ‌హోదాలో ఉన్న సునీతా క్ష్మారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోకవడమే కాకుండా, ఘటనపై కనీసం మాట్లాడకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలను సూచించడం, మహిళా సమస్యలు, అత్యాచార ఘటనలపై అధ్యయనం చేసి, నేరస్థులకు తగిన శిక్ష పడేలా కృషి చేయడం, సాక్షులను విచారించడానికి సమన్లు జారీ చేయడం, మహిళల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో మహిళల సమానత్వం, అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలు కాని సందర్భంలో మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు తనకు తాను కేసులను సుమోటోగా స్వీకరించడం, రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం…ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌కు ఎన్నో అధికారాలున్నాయి.

ఇన్ని అధికారాలున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌సునీతా లక్ష్మారెడ్డి మాత్రం సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనపై స్పందించకపోవడంతో ఆమె మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌పదవీకి అనర్హురాలన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా చిన్నారి ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సోషల్‌ ‌మీడియాలో నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. ఇంతకూ సునీతమ్మా ఎక్కడున్నారంటూ..నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆమె స్పందిస్తారో లేదో చూడాలి!

Leave a Reply