Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల వయో పరిమితి పెంపునకు నిరసనగా…. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సునీల్‌ ‌మృతి

పోస్టుమార్టం నిమిత్తం నిమ్స్ ‌నుంచి గాంధీ హాస్పిటల్‌కు తరలింపు
మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేదు : బండి సంజయ్‌
‌కేసీఆర్‌దే బాధ్యత : ప్రొ.కోదండరామ్‌

  ఉద్యోగాల భర్తీలో ఆలస్యంతో యువతలో ఆందోళన : జీవన్‌ ‌రెడ్డి  

‌ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడచినా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయనందుకు నిరసనగా ఆత్మహత్యకు యత్నించిన బోయ సునీల్‌ ‌నాయక్‌ ‌శుక్రవారం మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన సునీల్‌ ఐదేళ్లుగా పోలీస్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే పోటీ పరీక్షలకు సైతం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో నిరాశ చెందాడు. ప్రభుత్వం ఇక ఖాళీల భర్తీకి ప్రకటనలు జారీ చేయదని భావించి గత నెల 26న హన్మకొండలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తన ఆత్మహత్యతోనైనా సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలని సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

 

ముందుగా కేయీ పోలీసులు సునీల్‌ను ఎంజిఎంకు  చికిత్సనిమిత్తం తరలించి ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. గత వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సునీల్‌ ఆరోగ్యం విషమించి శుక్రవారం మృతి చెందగా పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, సునీల్‌ ‌మృతి చెందిన విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. వారితో పాటు మృతుడు సునీల్‌ ‌బంధువులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాంధీ హాస్పిటల్‌ ‌మార్చురీ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సునీల్‌ ‌కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గాంధీ హాస్పిటల్‌ ‌మార్చురీ వద్ద  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సునీల్‌ ‌కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. .మరోవైపు, కేయూ విద్యార్థి సునీల్‌ ‌నాయక్‌ ‌మృతి పట్ల టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1 లక్షా 92  వేల ఖాళీలు ఉన్నాయనీ, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ ‌విడుదల చేయాలని టీజేఎస్‌ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందిచలేదని విమర్శించారు. సునీల్‌ ఆత్మహత్యకు వరంగల్‌లో నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం అక్రమమనీ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.  సునీల్‌ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగానే పరిగణించాలనీ, సునీల్‌ ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న విధంగా ఆయన ఆత్మహత్యకు సీఎం కేసీఆర్‌దే బాధ్యతనీ, అందుకని ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రొ.కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

 తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదు
బోడ సునిల్‌ ‌మృత దేహం వద్ద నాయకుల ధర్నా

గూడూరు:  ధర్నాలో పాల్గొన్న తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌, ‌బహుజన లెఫ్ట్ ‌ఫ్రంట్‌ ‌వరంగల్‌ ‌పార్లమెంటు కన్వీనర్‌ ‌సాయిని నరేందర్‌, ‌బహుజన లెఫ్ట్ ‌పార్టీ వరంగల్‌ ‌జిలా అధ్యక్షుడు చింతకింది కుమారస్వామి, బి.ఎల్‌.ఎఫ్‌ ‌రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పటేల్‌ ‌వనజక్క, నాయకుడు సూరం నిరంజన్‌, ‌పీపుల్స్ ‌డెమోక్రాటిక్‌ ‌ఫ్రంట్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు సోమ రామమూర్తి, ఎం.సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదెగోని రవి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ ‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌ ‌నాయక్‌, ‌లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పోరిక ఈశ్వర్‌ ‌సింగ్‌, ‌యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
నా మరణంతోనైన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని గత వారం రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసిన బోడ సునిల్‌ ‌శుక్రవారం మరణించగా ఆయన మృతదేహాన్ని చివరిసారిగా చూసి నివాళులు అర్పించడానికి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చారు. సునిల్‌ ‌కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవడమే కాకుండా సునిల్‌ ‌మరణిస్తూ డిమాండ్‌ ‌చేసిన ఉద్యోగ ప్రకటన వెంటనే చేయాలని అప్పటివరకు ఇక్కడి నుండి లేచేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. విలపిస్తున్న సునిల్‌ ‌తల్లి మల్లిక,  తండ్రి రాంధన్‌, అన్న శ్రీనివాస్‌, ‌వదిన వనజ, కుటుంబ సభ్యులను నాయకులు ఓదార్చి మేము మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తెలంగాణ నిరుద్యోగుల కోసం చనిపోతే ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు వచ్చి సమాధానము చెప్పడం లేదని ప్రశ్నించారు. సరైన సమాధానం ఇచ్చేవరకు ఇక్కడినుండి కదిలేది లేదన్నారు.
ఇది ముమ్మాటికీ కెసిఆర్‌ ‌హత్యే : బండి సంజయ్‌
‌సునీల్‌ ‌నాయక్‌ ‌కుటుంబాన్ని హాస్పిటల్‌ ‌వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌మాజీ ఎంపీ వివేక్‌ ‌వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం బండి సంజయ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ..సునీల్‌ ‌నాయక్‌ది ఆత్మహత్య కాదని..ఇది కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌హత్య అంటూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునీల్‌.. ‌కేసీఆర్‌ ‌పేరు ప్రస్తావించాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కేసీఆర్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నిరుద్యోగులు తొందరపడి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని.. కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యోగాలు కల్పిస్తామని బండి సంజయ్‌ అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సీఎం గానీ, మంత్రులు గానీ ఎవరూ ఆ పేద కుటుంబానికి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు మాత్రం ఉద్యోగం లేకుండా బతకలేరని, రాష్ట్రంలో చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు లేవని బండి సంజయ్‌ ‌తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వొచ్చినప్పుడు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్‌ అం‌టూ మాయమాటలు చెబుతారని, ఎన్నికలు అయిన తర్వాత మరిచిపోతారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలని సంజయ్‌ అన్నారు. ఆనాడు అనేకమంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ వొచ్చిందని, ఈనాడు సీఎం తన పదవిని కాపాడుకోవడం కోసం అనేకమందిని బలితీసుకుంటున్నారని విమర్శించారు. దయ చేసి విద్యార్థులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని బండి సంజయ్‌ ‌సూచించారు.
సర్కార్‌ ‌చేతగాని తనం వల్లే సునీల్‌ ఆత్మహత్య : ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
సర్కార్‌ ‌చేతగాని తనం వల్లే కేయూ విద్యార్థి సునీల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోవట్లేదన్నారు. సునీల్‌ ‌కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. యువత ఎవ్వరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. నోటిఫికేషన్లు రావడంలేదని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ ‌నాయక్‌ ‌మృతి పట్ల తెలంగాణ యూత్‌ ‌కాంగ్రెస్‌ ఆం‌దోళనకు దిగింది. దీంతో వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. సునీల్‌ ‌నాయక్‌ అం‌తిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలని యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. కల్వకుంట్ల కుటుంబం కళ్ళుతెరిచే వరకు నిరుద్యోగులతో కలసి యూత్‌ ‌కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. గాంధీ హాస్పిటల్‌ ‌నుండి సునీల్‌ ‌నాయక్‌ ‌భౌతికకాయాన్ని స్వగ్రామం మహబూబాబాద్‌ ‌జిల్లా గూడూరుకు తరలించనున్నారు.
ఉద్యోగాల భర్తీలో ఆలస్యంతో యువతలో ఆందోళన : జీవన్‌ ‌రెడ్డి
వరంగల్‌ ‌జిల్లాకు చెందిన  విద్యార్థి సునీల్‌ ‌మరణానికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ ‌జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన వి•డియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగ ఖాళీలుంటే 50 వేలు భర్తీ చేస్తామనడం దారుణమన్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ ‌వయసు పెంపు నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు. విద్యార్థి సునీల్‌ ‌మరణాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్తామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply