మహబూబ్‌నగర్, జూన్ 3 (ప్రజాతంత్ర ప్రతినిధి) : జిల్లాలోని దేవరకద్ర మండలం హజిలాపూర్, లక్ష్మీపల్లి గ్రామాలను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. హజిలాపూర్ గ్రామంలోని జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపైన చెత్తను వేయరాదని నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, గ్రామాల్లో వారానికి ఒకరోజు గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునట్లయితే సీజనల్ వ్యాధులు ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ప్రజలు కూడా తమ ఇళ్ల చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లక్ష్మీ పల్లి గ్రామంలో ఉన్న నర్సరీని సందర్శించి నర్సరీలో పెరుగుతున్న మొక్కలు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లక్ష్మీ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బియ్యం పంపిణీ అందరికీ అందుతున్నాయా, పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం లక్ష్మీ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతులతో మాట్లాడుతూ మీ గ్రామంలో ఏ పంటలను పండిస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు రైతులు విన్నవించారు. లక్ష్మీ పల్లి గ్రామానికి ఎరువులను విత్తనాలను సరఫరా చేస్తామని, మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని, రైతులందరూ విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు వస్తారని తెలిపారు. పెన్షన్లు అందరికీ వస్తున్నాయా ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అని కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతు వేదిక నిర్మాణం చేయుటకు స్థలం కనుగొని పనులు ప్రారంభించారా అని సర్పంచ్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీడీవో గోపాల్ నాయక్, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.